-ఢిల్లీలో కాదు… గల్లీలో తేల్చుకుందాం రా…
-గంటసేపు ఢిల్లీలో ధర్నా చేయలేని కేసీఆర్… దేశాన్ని ఎట్లా పాలిస్తావ్
-సీఎం సీటు కోసం కొడుకు డాడీ డాడీ అంటుంటే కేసీఆర్ ప్యాడీ ప్యాడీ అని తిరుగుతుండు
– వడ్ల దందాతో కోట్లు దండుకునేందుకు కేసీఆర్ కుట్ర
-బరాబర్ కొనేది కేంద్రమే… సేకరించి ఇచ్చే దమ్ము కేసీఆర్ కు ఉందా?
-వడ్లు కొనేదాకా కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..
-తప్పు కేసీఆర్ చేసి… కేంద్రాన్ని బదనాం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
-ఓట్లు, సీట్లు కొంటవ్… రైతుల కోసం వడ్లు కొనలేవా?
-దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలో ఇప్పుడే ఎందుకొచ్చింది?
-పంట చేతికొస్తున్న సమయంలో రైతులను అరిగోస పెడతవా?
-రైతులు చేసిన తప్పేంది?…. నువ్వు చేసిన తప్పులకు వాళ్లనెందుకు బలి చేస్తున్నవ్?
– మోదీని గద్దె దించే దమ్ముందా కేసీఆర్…
-రైతును రాజు చేసేందుకు నిరంతరం క్రుషి చేస్తున్న గొప్ప నాయకుడు నరేంద్రమోదీ
-ఒక్కో ఎకరానికి రూ.65 వేలకుపైగా ఖర్చు చేస్తున్న ఘనత మోదీ సర్కార్ దే
-మోదీ పాలనలోనే పత్తి, మిర్చిసహా పంట ఉత్పత్తులకు అధికంగా గిట్టుబాటు ధర లభిస్తోంది నిజం కాదా?
-కేసీఆర్ ను ఫాంహౌజ్ నుండి ఢిల్లీకి గుంజుకొచ్చిన బీజేపీ కార్యకర్తలు సింహాలై గర్జిస్తున్నరు
-ఇందిరాపార్క్ వద్ద ‘బీజేపీ రైతు దీక్ష’లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
వడ్ల కొనుగోలు పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో దీక్షల పేరిట డ్రామాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్… చేతనైతే వడ్లు కొను… లేదంటే గద్దె దిగు’’అంటూ హెచ్చరించారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మరోసారి పునరుద్ఘాటించారు.
‘‘కేసీఆర్.. మళ్లా చెబుతున్నా… బరాబర్ కేంద్రం కొనేందుకు సిద్ధం. వడ్లు సేకరించి ఇచ్చే దమ్ముందా?’’అని ప్రశ్నించారు. బీజేపీ నేతలను కుక్కలంటూ సంబోధించిన కేసీఆర్ పై తీవ్రంగా స్పందించారు. ‘‘కుక్కలో కూడా మల్లన్నను చూసుకునే సంస్ర్కుతి బీజేపీదే. సింహాలై గర్జిస్తున్న కార్యకర్తలు బీజేపీకే సొంతం. సింహాలై గర్జించి ఫాంహౌజ్ నుండి ధర్నా చౌక్ కు, ఢిల్లీకి గుంజుకొచ్చిన ఘనత బీజేపీ కార్యకర్తలదేనని సంగతి గుర్తుంచుకో కేసీఆర్…’’అంటూ హెచ్చరించారు.
గత 7 ఏండ్లుగా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తోందని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడెందుకు యాసంగి పంట కొనడం లేదో ప్రజలకు జవాబు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. రైతాంగం పండించిన ప్రతి గింజను కొనేదాకా కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నరేంద్రమోదీని గద్దె దించుతామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘మోదీని గద్దె దించేంతటి మొనగాడివా? నీ పని ఎప్పుడో ఖతమైంది. తెలంగాణ ప్రజలు నిన్ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారు. ’’అని పేర్కొన్నారు.
కేసీఆర్ ఢిల్లీ దీక్షపైనా బండి సంజయ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ ఉదయం నుండి సాయంత్రం దాకా దీక్ష చేస్తానన్న కేసీఆర్ గంట సేపు కూడా కూర్చోలేకపోయిండు. ఇగ దేశాన్ని ఎట్లా పాలిస్తాడు?’’అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కు కాయల్ తప్పిందని… సీఎం సీటు కోసం కొడుకు డాడీ అంటుంటే… కేసీఆర్ మాత్రం ప్యాడీ ప్యాడీ అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇందిరా పార్క్ వద్ద ‘కేసీఆర్… వడ్లు కొను లేదా గద్దె దిగు’ పేరిట ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టిన రైతు దీక్షలో బండి సంజయ్ తోపాటు పార్లమెంటరీ, విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, గరికపాటి మోహన్ రావు, జి.వివేక్ వెంకటస్వామి, తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ మంత్రులు చంద్రశేఖర్, సుద్దాల దేవయ్య, సీనియర్ నేతలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎంపీలు చాడా సురేష్ రెడ్డి, రవీంద్రనాయక్ రాష్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్.విఠల్, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమదేవి, జె.సంగప్ప, పోరెడ్డి కిషోర్ తోపాటు వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ దీక్షకు పెద్ద ఎత్తున రైతులు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…..
ఢిల్లీలో దీక్ష కోసం 5 రోజులు కష్టపడి ఫ్లెక్సీలు, కట్టి కష్టపడితే కండ్లు మూసుకుని తెరిచే సరికి కేసీఆర్ దీక్ష ముగించిండని అక్కడున్నోళ్లంతా మొత్తుకుంటున్నరు. కేసీఆర్ కు కాయిల్ తప్పింది. కొడుకు సీఎం పదవి కోసం డాడీ డాడీ అంటుండు… తండ్రి ప్యాడీ ప్యాడీ అని తిరుగుతుండు.బీజేపీని కుక్కలంటున్నరు.
మొరుగుతున్నవి టీఆర్ఎస్ కుక్కలే. మోదీ సింహం లెక్క గర్జిస్తున్నరు. తెలంగాణ బీజేపీ కార్యకర్తలు కూడా సింహం లెక్క గర్జిస్తున్నరు కాబట్టే తట్టుకోలేక కేసీఆర్ ఢిల్లీ పోయి నాటకాలాడుతున్నరు.
కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంచి ప్రజలపై భారం వేసిండు. ఛార్జీలను చూసి జనం భగ్గుమంటున్నరు. కాబట్టే చర్చను దారి మళ్లించేందుకే ఈ డ్రామాలు. కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో ఉన్నడు. కోట్లు పెట్టి సీట్లు, ఓట్లు కొంటున్నడు. కానీ రైతుల వడ్లు ఎందుకు కొనడం లేదు? కమీషన్లకు అలవాటు పడి బ్రోకర్ల చేతిలో పెడుతున్నడు.
బియ్యం కొనేది మేమే… పైసలు చెల్లించేది కేంద్రమే. ఇన్నాళ్లు నేనే కొంటున్నా, కేంద్రానికి సంబంధం లేదని 7 ఏళ్లుగా ప్రజలను వంచించినవ్ కదా… మరెందుకు కొనడం లేదో చెప్పాలి?
నల్గొంగలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి బీజేపీ వాస్తవాలు చెబితే రైతులు నమ్ముతున్నరని భయపడి ఉద్దేశంతో కేంద్రాన్ని బద్నాం చేసేందుకు రైతులను అరిగొస పెడుతున్నడు.
మళ్లీ చెబుతున్నం… పక్కా కొనేది కేంద్రమే. నువ్వు సేకరించి ఇస్తవా లేదా? నువ్వు బ్రోకర్ వి మాత్రమే. రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రోకర్ గా మారి కమీషన్లు తీసుకుని వడ్లు సేకరించి కేంద్రానికి ఇవ్వాలి. డబ్బులు ఇచ్చేది కేంద్రమే.
అన్ని రాష్ట్రాలతో కేంద్రం జూమ్ సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని రాష్ట్రాలు యాసంగి పంట ధాన్యం వివరాలు వెల్లడిస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆ వివరాలు ఇవ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. ధాన్యం ఇవ్వబోమని, కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తున్నామని రైతులను మోసం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్.
సీఎం చెప్పాలి…. బరాబర్ కొంటామన్నది మేమే… మళ్లీ అదే చెబుతున్నం. మేం కొనేందుకు సిద్ధం… మీరెందుకు ధాన్యం సేకరించి ఇవ్వకుండా తెలంగాణ రైతులను ఎందుకు నట్టేట ముంచుతున్నవ్? రైతులు తిరగబడతారని భయపడే కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నడు.
ఒకరోజు సన్న వడ్లు వేయమన్నడు. ఫాంహౌజ్ లో మాత్రం దొడ్లు వేసుకున్నడు. రైతులను రోడ్డున పడేసిండు. పత్తి వేయొద్దన్నడు. మళ్ల వరి వేస్తే ఉరే గతి అన్నడు. ఓ కలెక్టర్ వరి వేస్తే సంగతి చూస్తానన్నడు. హుజూరాబాద్ ప్రజలంతా ఒక్కటై మాకు వరే కావాలని బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించి టీఆర్ఎస్ ను ఉరేసిండ్రు.
రైతులను రాజు చేస్తున్న గొప్ప నాయకుడు నరేంద్రమోదీ. మోదీ రాకముందు వడ్ల కనీస ధర రూ.1310 లుంటే ఇఫ్పుడు రూ.1960లు చేసిన ఘనత కేంద్రానిదే. పత్తి కేవలం రూ. 4వేలుంటే… ఈరోజు రూ.15 వేలు దాటింది. గతంలో మిర్చి ధర రూ. 6వేలుంటే…. ఈరోజు రూ.50 వేలకుపైగా ధర పలుకుతోందంటే ఆ ఘనత నరేంద్రమోదీదే తప్ప కేసీఆర్ ది కానేకాదు.
పండించిన పంటను నిల్వ చేసుకునే పరిస్థితి లేని దుస్థితి రైతులది. మీ పొలాల దగ్గరకే ట్రాక్టర్లను పంపించి వడ్లను ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తానన్న కేసీఆర్ యాడికి పోయిండు.
రైతు సమన్వయ సమితిలు ఎటు పోయినయ్? కనీస ధర కంటే ఎక్కువకు కొన్పిస్తామని చెప్పినవ్ కదా… ఏమైంది? మందులో సోడా పోసినోళ్లకు… సొల్లు కారితే తూడిచినోళ్లకు పదవులిచ్చి రైతులను మోసం చేసిన దగుల్బాజీ సీఎం కేసీఆర్. కోతకొచ్చిన పంటను అమ్ముకోలేక రైతులు బాధపడుతుంటే… వాళ్లు ఎక్కడ తిరగబడతారోననే భయపడే కేసీఆర్ ఢిల్లీపోయి ధర్నా పేరిట డ్రామా చేస్తుండు..
బీజేపీని కుక్కలంటావా?… మేం కుక్కల్లో కూడా మల్లన్నను తలుచుకుంటం. మా కార్యకర్తల జోలికొస్తే… మోదీగారిని తిడితే… బట్టలిప్పి ఉరికిస్తం? బీజేపీని తిడితే ఖబడ్దార్…
నిన్ను ఫాంహౌజ్ నుండి, ప్రగతి భవన్ నుండి నువ్వు ఎత్తివేసిన ధర్నా చౌక్ కు గల్లాపట్టి ఈడ్చుకొచ్చిన పార్టీ బీజేపీదే. ఫాంహౌజ్ నుండి బయటకు గుంజుకొచ్చిన పార్టీ బీజేపీ. నిన్ను ఢిల్లీ నడిబొడ్డున తలదించుకునేలా చేసిన పార్టీ బీజేపీ. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.
కేసీఆర్… రైతులు పండించిన పంటను ఎట్టి పరిస్థితుల్లో కొని తీరాల్సిందే. కొనివ్వకుంటే నిన్ను ఉరికిస్తం. నువ్వు కోనేదాకా వదిలిపెట్టం.
నీకు చేతనైతే వడ్లు కొను… లేకుంటే గద్దె దిగు… రైతాంగాన్ని కాపాడుకునే బాధ్యతను బీజేపీ తీసుకుంటుంది.ధర్నాలు, దీక్షలన్నీ ఆడోళ్ల చీరలు గుంజడానికి, మైకులు లాక్కోవడానికి తప్ప నువ్వు సాధించేదేమీ లేదని సోషల్ మీడియా ద్వారా తెలిసిపోయింది. టీఆర్ఎస్ నేతలు సంస్కారహీనులు.
వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణది 7వ స్థానం. దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు స్రుష్టిస్తున్నరో కేసీఆర్ చెప్పాలి.నరేంద్రమోదీ ప్రభుత్వం పేదల పాలిట ప్రభుత్వం. రైతులను ఇబ్బంది పెట్టొద్దు. రాజకీయ స్వార్థాన్ని పక్కనపెట్టి రైతుల సమస్యను పరిష్కరిద్దామని నెలరోజులుగా మొత్తుకుంటున్నం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరని చెప్పినం.
గతంలో వానల్లేక రైతులు ఆత్మహత్య చేసుకునేటోళ్లు… ఇఫ్పుడు వరుణదేవుడు కరుణించి పంటలు పండితే.. గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకునే దుస్థితి.మోదీ ప్రభుత్వం తెలంగాణ రైతాంతానికి ఒక్కో ఎకరాకు రూ.65 వేలు ఖర్చు పెడుతున్నరు. మద్దతు ధరతోపాటు అన్ని రకాల సాయంతో కలిసి . కేసీఆర్ చేసిందేమీ లేదు.
వరి వేస్తే ఉరే గతి అన్న కేసీఆర్ రైతులుకు ప్రత్యామ్నాయ పంటలను మాత్రం ప్రోత్సహించకుండా రైతులను మోసం చేసిండు. భూ సార పరీక్షల నిధులను కూడా దొబ్బుకుతిన్న ఘనుడు కేసీఆర్
నష్టపోయిన రైతులను, నష్టపోయిన రైస్ మిల్లులను ఇతర రాష్ట్రాలు ఆదుకుంటుంటే కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదు.ఇసుక దందా… వైన్స్ దందా… భూ దందా, పాస్ ఫోర్టుల దందాలతో డబ్బులు దండుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు వడ్ల దందాకు తెరదీసిండు.
యాసంగి వడ్ల దందాతో రూ.800 కోట్ల కుంభకోణానికి తెరదీసిండు.నేను మళ్లీ చెబుతున్న…. తెలంగాణ ప్రభుత్వం ఎంత బియ్యం ఇచ్చినా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన కూడా చేసిండు.
కానీ కేసీఆర్ మాత్రం వాస్తవాలను మరుగునపెట్టి ఢిల్లీకి పోయి దొంగ దీక్ష చేస్తున్నడు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ దొంగ దీక్షలు చేసిన చరిత్ర కేసీఆర్ దే. చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ అంటూ వార్తలు రాయించుకుండు… దీక్ష పేరుతో మందు తాగిన నీచుడు కేసీఆర్.
ఈ రోజు కూడా ఢిల్లీలో కూడా కేసీఆర్ చేసింది అదే… గంట సేపు కూడా దీక్ష చేయలేని అసమర్థుడు కేసీఆర్. దొంగ దీక్షతో తెలంగాణ ప్రజలను ఇక వంచించలేవని గుర్తుంచుకో… నీ మోసాలను ప్రజలు గుర్తించారు.
నీ గడీలు కూల్చడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధమైండ్రు. అందుకే యాడికి పోయినా కార్యకర్తలను ప్రజలు ఆదరిస్తున్నరు.కేసీఆర్… వడ్లు కొంటావా?… గద్దె దిగుతవా?… ఏడేండ్లుగా వడ్లు మేమే కొంటున్నామని చెప్పిన నువ్వు ఎందుకు కొనడం లేదో సమాధానం చెప్పాలి.