Suryaa.co.in

Political News

మడమదేముంది.. కుడి ఎడమ తప్పినట్టే..!

ఏనుగు అంత చేస్తుంది..ఇంత చేస్తుంది అన్న చందాన ఇంచుమించు గడచిన ఆరు నెలలుగా ఎంతో హడావిడి చేసిన జగన్మోహన రెడ్డి మంత్రివర్గ పునర్నిర్మాణం ఎట్టకేలకు అత్యంత సాదాసీదాగా ముగిసిపోయింది.మంత్రివర్గం కూర్పులో విశ్లేషించడానికి విశేషం ఏమీ కనిపించలేదు. వెళ్లిన వారు ఎంతటి వీరులు..కొత్తగా వచ్చినోళ్ళు ఎంతపాటి శూరులు..అన్న అంశం సైతం కూడా అంత ఆసక్తికర చర్చనీయాంశంగా అనిపించడం లేదు.. పాత సీసాలో కొత్త నీరు.. ఇంకా చెప్పాలంటే పాత చింతకాయ పచ్చడి మచ్చు..ఇవన్నీ ప్రజలకు అవసరమైన విషయాలు కూడా కావేమో..

రాజకీయాలు గనక..వీటి చుట్టూ కొంత ఉత్సుకత.. ఉత్కంఠ నెలకొని ఉన్నాయి గనక చర్చ తప్పలేదు. అంతకు మించి జగన్ కొత్త మంత్రివర్గంపై అబ్బో… తలలు బద్దలు కొట్టుకుని.. బుర్రలకు పదును పెట్టి రాయాల్సింది ఏమీ ఉన్నట్టు అనిపించడం లేదు..!
మరేంటి సబ్జెక్ట్..ఎందుకీ ఉపోద్ఘాతమనా..!?
ఇక్కడ చర్చనీయాంశం మంత్రివర్గ నిర్మాణానంతర నిరసన..అసంతృప్తి సెగ..ఇలా రోడ్డుకెక్కుతారా అని అస్సలు ఊహించని కొందరు ఎమ్మెల్యేలు,మాజీ మంత్రుల స్పందన రాష్ట్రంలో రాజకీయ సన్నివేశం తిరగబడబోతోందా అనే చర్చకు తెర ఎత్తినట్టే…మేకపాటి సుచరిత..బాలినేని..ధర్మశ్రీ వంటి ‘కామ్’ గోయింగ్ ,సహచరులు ఇలా నిరసన చూపించడం..అంతకు మించి ధిక్కార స్వరం వినిపించడం..
వారిలో కొందరు నేతల అనుచరులు సాక్షాత్తు బిగ్ బాస్ది ష్టిబొమ్మనే దగ్ధం చేయడం అనూహ్యం..అసాధారణం..!

ఇవన్నీ రాబోయే రోజుల్లో కొన్ని విపత్కర పరిణామాలకు ఖచ్చితంగా సంకేతమే..ఇప్పుడే..అంటే ఈ ప్రభుత్వం..శాసనసభ కాలం ఇంకా రెండేళ్లు మిగిలి ఉన్న తరుణంలోనే జగనన్న అప్రతిహత ఆధిపత్యంపై ఇలా అనూహ్యంగా తిరుగుబాటు బోణీ జరిగిందంటే కొందరి బాణీ మారుతున్నట్టేనా..?
సెగ మొదలయిందా..
బాంబు రబ్బర్ లాగినట్టేనా..
రేపు ఎన్నికల టికెట్ల పంపిణీ సమయానికి ఈ సెగ ఎంత వేడిగా మారనుందో..2014..2019 ఎన్నికల మొదలు నిన్న మొన్నటి వరకు జగన్ చెప్పిందే వేదం..చేసిందే శాసనం…ఆ సీన్ ఇప్పుడు రివర్స్ అవ్వడం మొదలైనట్టే.

ఇప్పటికే కనీసం యాభై మందికి పైగా ఎమ్మేల్యేలు తమకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం ఇళ్లే అని ఫిక్స్ అయిపోయారని సమాచారం.దాని పరిణామమే నిన్నటి సెగ..రొద..ఇదంతా సొదగా.. సోదిగా కొట్టి పారేయడానికి లేదండోయ్..ఇలాంటివే ఇంతింతై..చినికి చినికి గాలివాన టైపు..!
అందునా జగన్ పార్టీలో ఉన్నదంతా కాంగ్రెస్ నీరే..అది గుర్తు పెట్టుకోవాలి..!!

ఆ ఇద్దరూ కూడా లేకుంటే..
ఇక్కడ మరో ఆసక్తికర విషయం..ఇప్పటికే ఇంత గందరగోళం నెలకొని ఉంది కదా..అదే గనక జగన్మోహన రెడ్డి ఆ ఇద్దరిని రిపీట్ చేసి ఉండకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో..
ఆ ఇద్దరూ ఇప్పటికే చాప చుట్టేస్తున్నారని..అంతకు ముందే చాప కింద నీరు సిద్ధం చేసేశారని రకరకాల కథనాలు కొంత కాలంగా వింటూనే ఉన్నాం.అసలు అలాంటి సమాచారం జగన్ వద్దకు ఆధారాలతో సహా చేరింది గనకనే ముందు జాగ్రత్తగా మడమను కొంత వదులు చేసి ఉంచి చివరి నిమిషంలో తిప్పేసారని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి.తిప్పితే తిప్పారు గాని తక్షణ ప్రమాదాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్టేనని వైసిపి వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఆ ఇద్దరినీ బయట ఉంచి కొరివితో తల గోక్కునే కన్నా లోపలికి తీసుకు వచ్చి కట్టుదిట్టం చేస్తే కనీసం వచ్చే ఎన్నికల వరకైనా సేఫ్ జోన్లో ఉండవచ్చునని జగన్ ఆలోచించి ఉంటారు..
అది కరెక్టేనేమో కూడా..
ఎందుకంటే మంత్రివర్గం విషయంలో నిరసన చెబుతున్న వారు ఇప్పుడైతే వ్యక్తిగత బలంతోనే ముందుకు వెళ్తున్నారు.వారుగా బయటికి వెళ్ళడం గాని..వెళ్తూ కొందరిని తమతో కూడగట్టి తీసుకువెళ్ళే సీన్ గాని వారికి ఉండదు.అలాగే అసంతృప్తితో ఉన్న ఇంకొందరిని చేరదీసి ఒక పెద్ద ముఠాను ఏర్పాటు చేసే నాయకత్వ పటిమ కూడా వారికి ఉండదన్నది నిర్వివాదం.అలాంటి కెపాసిటీ ఆ ఇద్దరికే ఉంది.
ఆ మేరకు ఆ ద్వయం విడిగానో..కలిసో కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేసి సిద్ధంగా ఉన్నారని కూడా వార్తలు ఉన్నాయి.ఆ ఇద్దరూ లెఫ్ట్ ఔట్స్ లో ఉంటే అసమ్మతి బ్యాచ్ కి ఒకరో..ఇద్దరూనో లీడర్స్ దొరికినట్టే..అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో..
మొత్తానికి జగన్ దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకున్నట్టు కాక.. ఇల్లు ఉంటుండగానే దీపం కొండెక్కకకుండా గట్టి ఏర్పాటే చేసుకున్నారు.మడమదేముంది..కుడిఎడమ కాకుండా కాపాడుకోవడమే రాజనీతి..
అదే జగన్ తాజా రీతి..!

– ఇ.సురేష్ కుమార్
జర్నలిస్ట్

LEAVE A RESPONSE