Suryaa.co.in

Telangana

ఆశ చూపడమెందుకు….. మోసం చేయడమెందుకు?

-దళితబంధు, దళితులకు మూడెకరాలు ఇవ్వనేలేదని తక్కశిల గ్రామస్తుల ఆగ్రహం
-ఒకే ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకు దళిత బంధు ఇచ్చి అర్హులందరినీ మోసం చేశారని ధ్వజం
-మాకు అర్హత ఉన్నా ఫించన్ ఇవ్వడం లేదని వ్రుద్దుల ఆవేదన
-టీఆర్ఎస్ వద్దు… బీజేపీలో చేరతామన్న యువకులు
-బండి సంజయ్ సమక్షంలో దాదాపు 80 మంది తక్కశిల గ్రామస్తులు బీజేపీలో చేరిక

ప్రజా సంగ్రామ యాత్ర 3వ రోజు పాదయాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండిగ సంజయ్ కుమార్ అలంపూర్ నియోజకవర్గంలోని తక్కశిల గ్రామంలో ‘ప్రజల గోస – బీజేపీ భరోసా’ పేరిట రచ్చ బండ నిర్వహించారు. పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి వచ్చి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. స్థానికులందరితో కలిసి బండి సంజయ్ కూర్చొని వారి సమస్యలను ఓపిగా ఆలకించారు.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దళిత మహిళ ‘‘సార్ దళిత బంధు ఇస్తనని కేసీఆర్ ఆశ పెట్టిండు. మా ఉళ్లో ఒక్కడికి మాత్రమే దళిత బంధు ఇచ్చిండ్రు. అతను టీఆర్ఎస్ నాయకుడే. మేమంతా తిండికి లేనోళ్లం. మాకు దళిత బంధు ఇయ్యలే. అట్లగే దళితులకు మూడెకరాల పొలమిస్తనని ఆశ చూపి మోసం చేసిండు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తనని ఆశపెట్టి దరఖాస్తు చేసుకుంటే మోసం చేసిండు. రేషన్ బియ్యం ఇస్తున్నరు కానీ…అన్నీ నూకలే ఇస్తున్నరు. తినబుద్ది కావట్లే. సారూ…. నాకర్థం కాక అడుగుతా… ఆశపెట్టుడెందుకు… మోసం చేసుడెందుకు? ఇగ మా బతుకులు ఎట్లా బాగుపడాలే?’’అని వాపోయారు. అదే గ్రామానికి చెందిన దేవ సహాయం అనే 70 ఏళ్ల వ్రుద్దుడు
మాట్లాడుతూ…. నాకు ఫించన్ రావడం లేదు. నాలాగే ఊళ్ల చాలామందికి ముసలోళ్లకు పెన్షన్ లేదు. దళిత బంధు మా ఉళ్ల ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకు మాత్రమే దళిత బంధు ఇచ్చిండ్రు. మాకెవ్వరికీ రాలేదు. ఒక్కడికి ఇచ్చి ఊరించి ఊరించి చంపుతున్నరు తప్ప చేసిందేమీ లేదు’’అని పేర్కొన్నారు.

ఇదే గ్రామానికి చెందిన యువకుడొకరు మాట్లాడుతూ… ఈ ప్రాంతమంతా ఎండిపోయి ఉంది. ఆర్డీఎస్ నీళ్లు ఇస్తే పొలాలు పండి అందరి బతుకులు బాగుపడతాయ. కానీ పట్టించుకునే దిక్కు లేదు. దళిత బంధు ఇస్తానని మోసం చేసిండ్రు. నిరుద్యోగ భ్రుతి లేదు. దళితులకు మూడెకరాలు ఇస్తామన్నరు. అతీగతీ లేదు. కనీసం ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తేనైనా ఉద్యోగం వచ్చేది. అదీ గతి లేదు. ఈ ప్రభుత్వంవల్ల మేం బాగుపడింది లేదు..మా ఊరు మారలేదు’’అని వాపోయారు.

వారందరి సమస్యలను ఆలకించిన బండి సంజయ్ కేసీఆర్ ఫ్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే ప్రజలు బాగుపడతారనుకుంటే… కేసీఆర్ పాలనలో ప్రజలు పక్క రాష్ట్రానికి పోయి వైద్యం చేయించుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే తాను పాదయాత్ర చేపట్టానని చెప్పారు. దీంతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు వాటి పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

అట్లాగే పాదయాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడంతోపాటు నరేంద్రమోదీ చేపట్టిన అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. అనంతరం బండి సంజయ్ సమక్షంలో తక్కశిల గ్రామానికి చెందిన దాదాపు 80 మంది యువకులు, టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వారందరికీ కాషాయ కండువా కప్పి స్వాగతం పలికిన బండి సంజయ్ ప్రజా సమస్యల పరిష్కారంపై నిరంతరం పోరాటం చేయాలని కోరారు.

 

LEAVE A RESPONSE