ఉత్తరాది రాష్ట్రాల్లో మత ఘర్షణలపై ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు ఆందోళన
విజయవాడ: మతం ఆధారంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయాలు అంతిమంగా దేశంలో విచ్ఛిన్నకర పరిస్థితులకు దారితీస్తాయని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాల కారణంగా దేశానికి ఉన్న లౌకికవాద ముద్ర గుర్తింపు కోల్పోయే పరిస్థితులు సమీపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లో ఇటీవల హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన మత హింసకు ఆధ్యం పోసేలా బీజేపీ వ్యవహరిస్తోందని రుద్రరాజు దుయ్యబట్టారు. భారతదేశ రాజ్యాంగంలోనే అన్ని మతాలకు సమాన ప్రతిపత్తి, గౌరవం రాజ్యాంగ నిర్మాతలు కల్పించారని గుర్తుచేశారు.
ప్రస్తుత పాలకులు రోజురోజుకు పెరుగుతున్న ధరలను నియంత్రించలేకనే రోజుకో కొత్త సమస్యను సృష్టిస్తూ ప్రజల ఆలోచనలను తప్పదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని మతాలకు సమాన గౌరవం కల్పించారని, కాంగ్రెస్ పార్టీ ఏనాడూ మత రాజకీయాలకు పాల్పడడంగానీ, ఒక వర్గానికి వ్యతిరేకంగాను, అనుకూలంగాను వ్యవహరించలేదన్నారు. మైనార్టీల మతాల పట్ల ఉదార స్వభావం చూపిందే తప్ప బుజ్జగింపు రాజకీయాలు నడపలేదని రుద్రరాజు పేర్కొన్నారు.