– కేసీఆర్, కేటీఆర్ చర్యలు తీసుకోవాలి
– లేకపోతే మోదీని కలుస్తా
– కేసీఆర్ సోదరుడి కూతురు రమ్యారావు ఆరోపణ
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువు అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ పై సీఎం కేసీఆర్ సోదరుడి కూతురు రేగులపాటి రమ్యారావు సంచలన ఆరోపణలు చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంతోష్ పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడుతున్నాడని అన్నారు. హైదరాబాద్ లో వారు మీడియాతో మాట్లాడారు.
2007లో ఎలగందులలో తాను 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశానని తెలిపారు. అయితే ఆ భూమిని ఎంపీ సంతోష్ ఆక్రమించాడని ఆరోపించారు. ఆ భూమిలో గ్రానైట్ వ్యర్థాలను నింపుతున్నారని చెప్పారు. 2007లో సంతోష్ ఆస్తులు రూ. 7 కోట్లు అని… 2013లో ఆయన గ్రానైట్ క్వారీ భాగస్వామ్యాన్ని తీసుకున్నారన్నారు. 2015లో మిడ్ మానేరు ముంపు బాధితుడిగా 2 గుంటల పట్టా తీసుకున్నారని… ఇప్పుడు కోకాపేట వంటి ప్రాంతాల్లో ఆయనకు 200 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు. ఇదంతా ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మాఫియా సంతోష్ అండదండలతోనే సాగుతోందని తెలిపారు. తన భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి అక్రమాలకు పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించామన్నారు. కానీ ఆక్రమణదారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తనలాంటి బాధితులు వందల మంది ఉన్నారన్నారు.
సీఎం కేసీఆర్ లక్ష కోట్లు అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నారని… అయితే సంతోష్ అండతో కొందరు చెరువులు ఆక్రమిస్తున్నారన్నారు. ఎలగందులలో కూడా చెరువులు ఆక్రమణకు గురయ్యాయని చెప్పారు. సంతోష్ పై నిజనిర్ధారణ కమిటీ వేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంతోష్ అక్రమాలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చర్యలు తీసుకోవాలని అన్నారు. తనకు న్యాయం జరగకపోతే ప్రధాని మోడీని కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.