అమరావతి,21 ఏప్రిల్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు,ఐటి,మౌలిక సదుపాయాలు,పెట్టుబడులు మరియు వాణిజ్య శాఖామంత్రిగా గుడివాడ అమర్నాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గురువారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులో వేద పండితుల ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ముందుగా తనకు పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈసందర్భంగా ఐదు దస్త్రాలపై తొలి సంతకాలు చేయగా వాటిలో రామాయపట్నం పోర్టుకు సంబంధించి భూసేకరణకు నిధులు విడుదల,కాకినాడ యాంకరేజి పోర్టులో పనులకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 48 కోట్లు,రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సంబంధించిన,తదితర దస్త్రాలపై సంతకం చేశారు.ఈసందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్నిపారిశ్రామికంగా,ఐటి రంగం పరంగా మరింత ముందుకు తీసుకు వెళ్ళేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.అలాగే విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవా(ఇండస్ట్రీయల్ కారిడార్)పనులను మరింత వేగవతం చేస్తానని చెప్పారు.
పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నవిశాఖపట్నాన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పధంలో నడిపి దేశంలోని టైర్-1 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని మంత్రి అమర్నాధ్ పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 970 కి.మీ.ల పొడవైన సముద్రతీరం కలిగి ఉండి 4 ప్రధాన పోర్టులు,మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగి ఉండడం తోపాటు అనేక రకాల సహజవనరులు ఉన్నందున పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు అనేక అవకాశాలున్నాయని చెప్పారు.
తూర్పుగోదావరి బలభద్రపురంలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతున్న కాస్టిక్ సోడా తయారీ పరిశ్రమతో 2 వేల 700 మందికి ఉపాధి కలుగుతుందని మంత్రి అమర్నాధ్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు పాల్గొని మంత్రి అమర్నాధ్ కు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే పరిశ్రమలు శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.సి.నాగరాణి తదితర అధికారులు మంత్రి అమర్నాధ్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.