-జగనన్న ఇళ్ల లబ్దిదారులతో భేటీ
-విద్యార్థులతో మాటామంతీ
-రైతుభరోసా కేంద్రానికి అభినందనలు
-జిల్లా కేంద్రాసుపత్రి సందర్శన
విజయనగరం, ఏప్రెల్ 26 ః కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖామంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ జిల్లా పర్యటన విజయవంతంగా పూర్తయ్యింది. ఆయన రెండోరోజు మంగళవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ప్రజలతో భేటీ అయి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పర్యటన ఆద్యంతం సంక్షేమ పథకాల గురించి, ప్రభుత్వ కార్యక్రమాల గురించి కేంద్రమంత్రికి, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వివరించారు. మంత్రి వెంట ఎంఎల్‌సి పివిఎన్ మాధవ్, ఆర్డిఓ బిహెచ్ భవానీశంకర్, లైజనింగ్ అధికారులు డిఆర్డిఏ పిడి డాక్టర్ ఎం.అశోక్ కుమార్, విక్రమాధిత్య, ఆయా శాఖల అధికారులు, బిజెపి జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు
కేంద్రమంత్రి మన్సుఖ్ మంగళవారం ఉదయం విజయనగరం పట్టణంలోని పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో, సంప్రదాయభద్దంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
ఇళ్ల లబ్దిదారులతో భేటీ
విజయనగరం పట్టణ పేదలకోసం గుంకలాం వద్ద రూపొందించిన అతిపెద్ద జగనన్న కాలనీని, కేంద్రమంత్రి మన్సుఖ్ సందర్శించారు. అక్కడి ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. లేఅవుట్ గురించి, లబ్దిదారులకు ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి జెడ్పి ఛైర్మన్ శ్రీనివాసరావు, కలెక్టర్ సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ వివరించారు. లేఅవుట్లోనే ఇసుక, సిమ్మెంటు, ఇనుము అందజేస్తున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీటిని కూడా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం కేవలం ఇళ్లను కాకుండా, ఊళ్లనే నిర్మిస్తోందని జెడ్పి ఛైర్మన్ అన్నారు. జిల్లాలో మొదటివిడత 82వేల ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం రూ.1.80లక్షలు ప్రోత్సాహాకాన్ని ఇవ్వడమే కాకుండా, అదనంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.35వేలను బ్యాంకు నుంచి రుణంగా ఇప్పించడం జరుగుతోందని కలెక్టర్ చెప్పారు.
ఇళ్ల లబ్దిదారులతో కేంద్రమంత్రి భేటీ అయ్యారు. వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారులు షేక్ ఆయేషా, జగదాంబ, సూరిశెట్టి ఈశ్వరమ్మ కేంద్రమంత్రితో మాట్లాడారు. తమకు ప్రభుత్వం అన్నివిధాలా ఎంతగానో ప్రోత్సహాన్ని అందిస్తోందంటూ లబ్దిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్వి రమణమూర్తి, మెప్మా పిడి సుధాకరరావు, తాశీల్దార్ బంగార్రాజు, మున్సిపల్, హౌసింగ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నాడూ-నేడు పనుల పరిశీలన
బొండపల్లి మండలం గొట్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కేంద్రమంత్రి మాండవీయ సందర్శించారు. నాడూ-నేడు మొదటి దశ క్రింద చేపట్టిన అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. నాడూ-నేడు మొదటి జిల్లాలో అభివృద్ది చేసిన 1060 పాఠశాలల గురించి, జిల్లాలోని 2,31,000 మంది విద్యార్థులకు అందజేసిన విద్యాకానుకలపైనా, సమగ్ర శిక్ష ద్వారా నిర్వహిస్తున్నభవిత కేంద్రాల ద్వారా అందజేస్తున్న సహిత విద్య గురించి ఏర్పాటు చేసిన ప్రదర్శనలను మంత్రి తిలకించారు. జగనన్న విద్యాకానుకల గురించి, రామవరం జెడ్పి హైస్కూల్ విద్యార్థులు, గంట్యాడ కెజిబివి విద్యార్థులు మంత్రికి వివరించారు. 780 పాఠశాలలకు స్మార్ట్ టివిలను, 860 పాఠశాలలకు ఆర్ఓ ప్లాంట్లను అందజేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఒంపిల్లి పాఠశాల ఆర్ట్స్ టీచర్ వర్రి సురేష్, అక్కడిడక్కడే కేంద్రమంత్రి చిత్రపటాన్ని గీసి బహూకరించారు. ఆ ఉపాధ్యాయుడిని మంత్రి అభినందించారు. ఈ పర్యటనలో డిఇఓ డాక్టర్ ఎఎం జయశ్రీ, ఆర్విఎం ఏపిపి డాక్టర్ స్వామినాయుడు, బొండపల్లి మండల ప్రత్యేకాధికారి శాంతకుమారి, తాశీల్దార్ మిస్రా తదితరులు పాల్గొన్నారు.
రామతీర్ధం ఆలయ సందర్శన
నెల్లిమర్ల మండలం రామతీర్ధంలోని శ్రీ సీతారామస్వామి వారి ఆలయాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సందర్శించారు. ఆయనకు ఆలయ పూజారులు, సంప్రదాయభద్దంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు మంత్రికి ఆశీర్వచనం పలికి, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పలనాయుడు, తాశీల్దార్ రమణరాజు, ఎంపిడిఓ రాజ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆర్‌బికె పనితీరు భేష్
పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో కేంద్రమంత్రి పర్యటించారు. గ్రామంలోని సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని, హెల్త్ వెల్నెస్ సెంటర్‌ను సందర్శించారు. సచివాలయం ద్వారా సుమారు 540 రకాల సేవలను, ప్రజల ముంగిటే అందజేయడం జరుగుతోందని కలెక్టర్ వివరించారు. ఆయా సేవల గురించి, సచివాలయ వ్యవస్థ గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. వలంటీర్ల వ్యవస్థ పనితీరు, వారు అందిస్తున్న సేవలను జెడ్పి ఛైర్మన్ వివరించారు. రైతు భరోసా కేంద్రం పనితీరును కేంద్రమంత్రి మనుసుఖ్ ప్రశంసించారు.
రైతులకు ఎరువులతో పాటు ఇతర సేవలను నేరుగా, గ్రామంలోనే అందించడాన్ని ఆయన అభినందించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కియోస్క్‌ను ఆశక్తిగా తిలకించారు. పేదల ఇంటింటికీ నిత్యావసరాల సరుకులను అందించే ఎండియు యూనిట్‌ను మంత్రి పరిశీలించారు. సమీపంలోని హెల్త్ వెల్నెస్ సెంటర్‌ను సందర్శించి, అక్కడ రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ పర్యటనలో నెల్లిమర్ల ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పలనాయుడు, డిపిఓ సుభాషిణి, తాశీల్దార్ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. మన్ సుఖ్ మాండవీయ స్థానిక మహారాజ ఆసుపత్రిలో యాక్ట్ (అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్) సౌజన్యంతో ఏర్పాటు చేసిన మాడ్యులర్ పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్ ను లాంఛనంగా ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం స్థానిక ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్.ఎస్.డి. సీడీ సర్వే, అభ జెనరేషన్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్సు, ఏ.ఎన్.ఎం. హెల్త్ ఆప్స్, ఫ్రైడే డ్రై డే తదితర అంశాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు.
స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అంశాల సారాంశాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ నివాస్, జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి కేంద్ర మంత్రికి వివరించారు. వైద్యారోగ్యశాఖ ఆర్డిడి అనురాధ, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఎస్. వి. రమణ కుమారి, జిల్లా మలేరియా అధికారి తులసి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సీతారామరాజు ఇతర వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.