– సీఎంకు టీడీపీ యువనేత లోకేష్ లేఖ
చేనేత రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని చేనేత కార్మికులందరికి నేతన్న నేస్తం అమలు చేయడంతో పాటు, టిడిపి హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి లేఖ రాసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ చేనేత రంగాన్ని కోవిడ్ కోలుకోలేని దెబ్బ తీసింది. డిమాండ్ తగ్గి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతన్నలు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది, ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే సుమారుగా 5 వేల మంది చేనేత మగ్గాలు,అనుబంధ పనుల పై ఆధారపడి జీవిస్తున్నారు.
కోవిడ్ చేనేత కార్మికులను కోలుకోలేని దెబ్బతీసింది. పనులు లేక అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సిన దుస్థితి నెలకొంది.కోవిడ్ కు ముందు, ఇక్కడి నేతన్నలు నెలకు 15 నుండి 25 చీరలను తయారు చేసేవారు. ఒక్కో చీరపై వారికి రూ. 450- రూ. 550వరకూ మిగిలేది.
దైవంగా భావించే చేనేత వృత్తి మానుకోలేక, కుటుంబాన్ని పోషించలేక నేతన్నలు పడుతున్న మానసిక క్షోభకు గురవుతున్నారు.చేనేత ముడిసరుకులైన చిలపలనూలు, సిల్క్, పట్టు ,రంగులు రసాయనాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.వైసీపీ ప్రభుత్వ పాలన లో చేనేత రంగానికి ఎలాంటి ప్రయోజనమూ దక్కడం లేదు.
సబ్సిడీలు, సంక్షేమ ప్రయోజనాలు, రుణ మద్దతు, పొదుపు నిధుల వడ్డీ రేట్లు, ఆప్కో ద్వారా ఉత్పత్తుల కొనుగోలు సక్రమంగా జరగడం లేదు.ప్రభుత్వ నేతన్న నేస్తం పథకం అమలులో లోపాల వలన కార్మికుల కష్టాలు మరింతగా పెరిగాయి.పథకం అమలు కోసం రూపొందించిన మార్గదర్శకాలు నిజమైన లబ్ధిదారుల ఎంపికకు ఉపయోగపడటం లేదు.
పథకం అమలులో రాజకీయ జోక్యాలు నివారించి నిజమైన అర్హులకు లబ్ది చేకూరేలా చూడాలి. సమస్య పరీష్కారానికి ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి.
చేనేత రంగంలో నిమగ్నమైన ప్రతి వృత్తి నేత కార్మికుడితో సహా స్పిన్నర్లు మరియు ఇతర కార్మికులకు ‘నేతన్న నేస్తం’ కింద రూ.24000 తప్పనిసరిగా ఇవ్వాలి.రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలు, మాస్టర్ వీవర్ల కింద పనిచేస్తున్న 3 లక్షల కుటుంబాలను నేతన్న నేస్తం కింద చేర్చాలి.
పథకం కింద అర్హత నిబంధనలను “సొంత మగ్గంతో నేత” నుండి “నేత”గా మార్చాలి.క్లిష్ట సమయాల్లో చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి ఒక్కొక్కరికి రూ. 1.5 లక్షల సబ్సిడీ రుణాన్ని అందించాలి.APCO వద్ద అందుబాటులో ఉన్న మొత్తం స్టాక్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసి, బకాయిలను వెంటనే చెల్లించాలి.
చేనేత కార్మికుల ఆర్థిక స్థితిగతులను పెంపొందించే సహకార సంఘాలకు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పావలా వడ్డీ పథకాన్ని
పునరుద్ధరించాలి.టిడిపి హయాంలో చేనేత సహకార సంఘంలో ఉన్న వారికి ఒక్కో బారుకు రూ.1,000 వరకు ప్రోత్సాహకం ఉండేది.అంటే ఏటా 40-50 వేల రూపాయల వరకు ప్రోత్సాహకం అందేది.ఈ ప్రోత్సాహకాన్ని వైసీపీ ప్రభుత్వం ఆపేసింది. ఈ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలి.
చేనేత రంగం అభివృద్ధికి, కార్మికులకు భరోసా కల్పించేందుకు టీడీపీ ప్రభుత్వం త్రిఫ్ట్ ఫండ్(ఉద్యోగులకు పీఎఫ్ లాంటిది)ను 8 శాతం నుంచి 16 శాతానికి పెంచింది. దీనిని కూడా వైసిపి ప్రభుత్వం ఆపేసింది. వెంటనే తిరిగి ప్రారంభించాలి. చేనేత సమస్యలను ప్రాధాన్యతా ప్రాతిపదికన పరీష్కరించాలి. వృత్తి పై నేతన్నలకు నమ్మకం కలిగేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.