– సర్పంచులను ఇబ్బందులకు గురి చేయడం తగదు
– నిధులు విడుదల చేయకుంటే పోరాటం తప్పదు
– ప్రభుత్వాన్ని హెచ్చరించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
సమాజ సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తున్న సర్పంచులు చేసిన పనులకు నిధులు ఇవ్వకుండా అప్పుల పాలు చేసి వారి కుటుంబాలను రోడ్డుపాలు చేయడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క టిఆర్ఎస్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఎన్నుకున్న ప్రజల సమస్యలను పరిష్కరించాలని సొంత నిధులు ఖర్చు పెట్టి సర్పంచులు, ఎంపీటీసీలు అభివృద్ధి పనులను చేయించి నెలల తరబడి అవుతున్న ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల ఆర్థిక మంత్రి హరీష్ రావు, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లు రూ. 280 కోట్లు విడుదల చేస్తామని ప్రకటన చేశారన్నారు. మిగతా పెండింగ్ బిల్లులు కూడా వెంటనే విడుదల చేసి సర్పంచులను ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు.
స్థానిక సంస్థలకు ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లులు విడుదల అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులకు అండగా ఉంటుందని తెలిపారు. పల్లె ప్రగతి ప్రారంభించే లోగా స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, లేనిపక్షంలో వారిని ఏకం చేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.