Suryaa.co.in

Andhra Pradesh

గ్రూప్ 1లో స‌ర్కారు వారి పాట ఎంత‌?

-ఏ 1 నిర్వ‌హ‌ణ‌లో గ్రూప్ 1 లో గూడుపుఠాణీ
-డిజిట‌ల్‌, మాన్యువ‌ల్ వాల్యుయేష‌న్‌లో భారీ తేడాలు
-అన్యాయ‌మైపోయిన తెలుగుమీడియం అభ్య‌ర్థులు
-స్పోర్ట్స్ కోటాలో కోత‌ల‌తో ఆందోళ‌న‌లో ఆశావ‌హులు
-డిజిట‌ల్‌-మాన్యువ‌ల్ వేల్యూయేష‌న్‌లో 202 మంది అవుట్
-అవ‌క‌త‌వ‌క‌ల‌పై గ‌వ‌ర్న‌ర్ దృష్టిసారించి న్యాయ‌విచార‌ణ జ‌ర‌పాలి
– టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ డిమాండ్‌ 

గ్రూప్ 1 ఇంట‌ర్య్వూల ఎంపిక‌ల‌లో అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వంద‌లాది మంది ప్ర‌తిభావంతుల‌కు తీర‌ని అన్యాయం చేసిన జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారువారి పాట ఆట‌క‌ట్టిస్తామ‌ని నారా లోకేష్ హెచ్చ‌రించారు. ముప్ప‌యికి పైగా సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1 నిందితుడిగా వున్న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి నిర్వ‌హ‌ణ‌లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా అవ‌క‌త‌వ‌క‌లతోనే సాగింద‌న్నారు. గ్రూప్ 1 ఇంట‌ర్య్యూల ఎంపికలో భారీ ఎత్తున చోటుచేసుకున్న అక్ర‌మాల‌పై గ‌వ‌ర్న‌ర్ దృష్టి సారించి న్యాయ‌విచార‌ణ చేయించాల‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ డిమాండ్ చేస్తూ మంగ‌ళ‌వారం మీడియాకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

అత్యంత పార‌ద‌ర్శ‌కంగా డిజిటల్ మూల్యాంకనం చేశామ‌ని గౌర‌వ కోర్టుకి నివేదించిన జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు.. డిజిట‌ల్ విధానంలో ఎంపికైన‌ 326 మందిలో 124 మంది మాత్ర‌మే మాన్యువ‌ల్ వేల్యూయేష‌న్‌లో ఎంపిక కావ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏంటో స్ప‌ష్టం చేయాల‌ని డిమాండ్ చేశారు. డిజిట‌ల్‌లో మాయాజాలం జ‌రిగిందా? మాన్యువ‌ల్‌లో అవ‌క‌త‌వ‌క‌లు చోటుచేసుకున్నాయా అనేది ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇవ్వాల‌న్నారు. గతంలో ఎంపికై తాజా జాబితాలో 202 మంది పేర్లు గ‌ల్లంతు కావ‌డంపై ఏం స‌మాధానం చెబుతార‌ని నిల‌దీశారు.

డిజిటల్ వేల్యూయేష‌న్‌లో 142 మంది తెలుగు మీడియం వాళ్లు ఎంపిక కాగా, మాన్యువ‌ల్‌లో 47 మంది మాత్ర‌మే సెలెక్ట్ కావ‌డం వెనుక ఏ జ‌గ‌న్ నాట‌కం న‌డిచిందో వెల్ల‌డించాల‌న్నారు. ప్ర‌శ్న‌లు-జ‌వాబులు మార‌న‌ప్పుడు ఈ స్థాయిలో డిజిట‌ల్ మాన్యువ‌ల్ వేల్యూయేష‌న్‌లో తేడాలు ఎవ‌రి కోసం తారుమారై వ‌చ్చాయో వెల్ల‌డించాల‌న్నారు. స్పోర్ట్స్ కోటాలో ఇంట‌ర్వ్యూకి 75 మంది ఎంపికైతే, మూడునెల‌ల్లో పూర్తి చేయాల్సిన‌ మాన్యువ‌ల్ వాల్యుయేష‌న్‌ని 8 నెల‌లు సాగ‌దీసి 48 మందికి కుదించ‌డం మొత్తం గ్రూప్‌1 ఎంపిక అవ‌క‌త‌వ‌క‌లమ‌య‌మ‌ని స్ప‌ష్టం అవుతోంద‌ని పేర్కొన్నారు.

గ్రూప్‌1 ఇంట‌ర్వ్యూ ఎంపిక‌ల్లో స‌ర్కారు ప్రాయోజిత అక్ర‌మాల‌పై గ‌వ‌ర్న‌ర్ దృష్టి సారించాల‌ని.. నిష్పాక్షిక‌మైన న్యాయ‌విచార‌ణ జ‌రిపించాల‌ని, అర్హులై ఉండి కూడా ఎంపిక‌కాని అభ్య‌ర్థుల‌కు న్యాయం చేయాల‌ని నారా లోకేష్ ఆ ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE