– పవన్ సీఎం అభ్యర్థిత్వంపై తేల్చాలంటూ జనసేన డెడ్‌లైన్
– జనసేన డెడ్‌లైన్‌పై బీజేపీ నేతల ఆగ్రహం
– పొత్తు తెంచుకునేందుకేనని బీజేపీ అనుమానం?
– జనసేన ప్రకటన వెనుక రహస్య అజెండా ఉందన్న మరో అనుమానం
– అందరి చూపూ కమల దళపతి నద్దా వైపే
– లొంగిపోతారా? లొంగదీస్తారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘ నాకు సీఎం కావాలన్న కోరికేమీ లేదు. మీరు పదే పదే నన్ను సీఎం అనవద్దు. మీరు నన్ను సీఎం సీఎం అంటారు. ఓట్లు మాత్రం వైసీపీకి వేస్తారు. రాష్ట్ర భవిష్యత్తే నాకు ముఖ్యం’
– గతంలో అభిమానులనుద్దేశించి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్య
‘ నేను సీఎం అభ్యర్ధినని బీజేపీ జాతీయ నేతలు నాకెప్పుడూ చెప్పలేదు. పత్రికా ప్రకటనలు నేను నమ్మను’
– మంగళగిరిలో పవన్ వ్యాఖ్య
– ‘నాకు రాష్ట్ర బీజేపీ నేతలతో పెద్దగా సంబంధాలు లేవు. సోము వీర్రాజుతో 2014తో మాట్లాడా’
– జనసేన దళపతి పవన్ వ్యాఖ్య
– ‘బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలా? ఒంటరిగా చేయాలా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. బీజేపీ-జనసేన-టీడీపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటుచేయాలా లేదా అన్నది ఒక ఆప్షన్. నేనయితే ఇప్పటికి చాలాసార్లు తగ్గాను. ఇకపై తగ్గేదేలే. వారే తగ్గాలి.’
– జనసేన అధ్యక్షుడు పవన్ వ్యాఖ్య
– ‘పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా రేపటిలోగా బీజేపీ అధ్యక్షుడు నద్దా ప్రకటించాలి’
– జనసేన నేత హరిప్రసాద్ తాజా డెడ్‌లైన్
* * *
అసలు తనకు సీఎం పదవిపై ఆసక్తి లేనేలేదని గతంలో ప్రకటించిన కల్యాణ్‌బాబు.. ఇప్పుడు నన్ను సీఎం చేయమని చెప్పకనే చెప్పిన తర్వాత.. జనసేన నేతలు మరో అడుగు ముందుకేసి, జాతీయ పార్టీ అయిన బీజేపీకి డైడ్‌లైన్ విధించే స్థాయికి చేరారు. ‘సోమవారం సాయంత్రం లోగా పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్ధిగా
నద్దా ప్రకటించాలి’ అని డైడ్‌లైన్ పెట్టి, బెదిరించే పరిస్థితికి రావడంపై, బీజేపీలో సరికొత్త చర్చకు తెరలేచింది. రాజకీయాలు తెలియవనుకుంటున్న పవన్.. నేరుగా తన మనోగతం చెప్పకుండా, తన పార్టీ వారితో బెదిరించే వరకూ ఎదిగారన్నది బీజేపీ అగ్రనేతల విశ్లేషణ.
దశాబ్దాల నుంచి ఏపీలో అధికారం కోసం త్యాగాలు చేసిన తాము, ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియని పవన్ కల్యాణ్‌ను సీఎంను చేసేందుకు పనిచేస్తున్నామా? జాతీయ పార్టీకి డెడ్‌లైన్ పెట్టే పరిస్థితి వచ్చిందంటే, పవన్ తమతో పొత్తు బంధం తెంచుకునేందుకు మార్గాలు వెతుకుతున్నారా? అసలు ఎన్నికలకు రెండేళ్లకు ముందే సీఎం అభ్యర్ధిత్వంపై జనసేన మాట్లాడటమంటే, ఏదో రహస్య అజెండా ఉందనదే అర్ధమన్నది కమలదళాల అనుమానం.
ఏపీలో బీజేపీకి ఠికాణా లేదు కాబట్టి.. పవన్ ఫేస్ మీదే ఓట్లు వస్తాయి కాబట్టి.. బీజేపీలో సీఎం అయ్యేంత సీన్ ఎవరికీ లేదు కాబట్టి.. తాము శాసించడంలో తప్పేమీలేదన్నది జనసైనికుల ఉవాచ. ఏపీలో జనం కూడా పవన్‌ను చూసే ఓట్లేస్తారు తప్ప మోడీ, సోము వీర్రాజును చూసి ఓటేయరన్నది వారి మరో వాదన. ఈ వాద-ప్రతివాదాల నేపథ్యంలో.. సోమవారం రాష్ట్రానికి రానున్న బీజేపీ దళపతి నద్దా ఏం చెబుతారు? జనసైనికుల డైడ్‌లైన్ మేరకు కల్యాణ్‌బాబును సీఎం అభ్యర్థిగా ముందస్తుగా ప్రకటించి లొంగిపోతారా? లేక పవన్‌ను లొంగదీసుకుంటారా? ఇవేమీ కాకపోతే ఆ ప్రస్తావన లేకుండానే నద్దా సాబ్ ఢిల్లీ ఫ్లైటెక్కేస్తారా అన్నది పొత్తు పార్టీల్లో ఉత్కంఠగా మారింది.
సోమవారం సాయంత్రం లోగా బీజేపీ చీఫ్ నద్దా, పవన్‌ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలంటూ జనసేన పసుపులేటి హరిప్రసాద్ పేరిట, సోషల్‌మీడియాలో వచ్చిన ప్రకటన కమలం పార్టీలో కలకలం రేపింది. ఉరుములేని పిడుగు మాదిరిగా, జనసేన ఈవిధంగా జాతీయ పార్టీ అయిన తమకు డెడ్‌లైన్ విధించడంపై, బీజేపీ అగ్రనేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఏపీలో సీఎం స్థాయి వ్యక్తులు బీజేపీలో ఎవరూ లేరని, ఆయన వ్యాఖ్యానించినట్లు సోషల్‌మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. అది అబద్ధమంటూ అర్ధరాత్రి వరకూ ఖండన రాలేదు. అంటే మౌనం అర్ధాంగీకారం అన్నట్లే లెక్క.
ఏపీలో సీఎం అయ్యే స్థాయి నేతలెవరూ లేరని హరిప్రసాద్ చేశార ంటూ వస్తున్న వార్తలు, కమలదళం కన్నెర్రకు కారణంగా తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, ఎమ్మెల్సీ మాధవ్, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, పురందీశ్వరి, ఎంపీ సీఎం రమేష్, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ టిజి వెంకటేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి వంటి హేమాహేమీలుండగా, సీఎం అయ్యే సీన్ బీజే పీలో ఎవరికీ లేదనడం ఆ పార్టీ నేతల ఆగ్రహానికి అసలు కారణంగా కనిపిస్తోంది.
పవన్‌కు తెలియకుండానే ప్రకటిస్తారా?..
‘ ఏపీలో అధికారంలోకి రావాలన్నది మా పార్టీ దశాబ్దాల కోరిక. దానికోసం మేం చాలా త్యాగాలు చేశాం. మా బలాన్ని ఇతర పార్టీలకు ధారాదత్తం చేశాం. అసలు మేం సొంతంగా ఎదగాలన్న ఆలోచన అప్పుడే చేసి ఉంటే ఈపాటికి అధికారంలో ఉండేవాళ్లం. ఎలాంటి బలం లేని అనేక రాష్ట్రాల్లో మేం అధికారంలోకి వచ్చాం. అలాంటిది ఉప రాష్ట్రపతి, కేంద్రమంత్రి, గవర్నర్, ఎంపీల పదవులు సాధించిన మేం, ఇప్పటిదాకా ఎందుకు అధికారంలోకి రాలేకపోయామంటే ఏపీపై జాతీయ నాయకత్వానికి సరైన అవగాహన, అంచనా లేకపోవడమే కారణం. ఇప్పుడు కూడా మళ్లీ జనసేనకు మేం తోకపార్టీగా ఉండాలనడం మా క్యాడర్‌కు నచ్చలేదు. అప్పుడు టీడీపీ, ఇప్పుడు జనసేన. ఎన్నాళ్లిలా మేం ఇంకొకరికి తోకపార్టీగా ఉండాలి? పవన్‌పై మాకు గౌర వం ఉంది. ఆ పార్టీతో పొత్తు వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమేం లాభపడ్డాం? ఆ ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలసి పోటీ చేశాయి. చివరకు మా అధ్యక్షుడు సోము వీర్రాజు సొంత జిల్లా తూర్పుగోదావరిలో కూడా, జనసేన రాజకీయ వ్యూహం వల్ల మా పార్టీ అభ్యర్ధులు ఓడిపోయి, జనసేన అభ్యర్ధులు గెలిచారు. జనసేన కార్యక్రమాలకు మమ్మల్ని పిలవరు. మా పార్టీ కార్యక్రమాల్లో వాళ్లు పాల్గొనరు. మళ్లీ పొత్తు అంటారు. మా భుజం మీద ఎక్కి అధికారంలోకి రావాలనుకుంటున్నారు. నిజంగా జనసేనకు అంత బలం ఉంటే పవన్ రెండు చోట్లా ఎందుకు ఓడిపోతారు? జనసేన తన బలాన్ని ఎక్కువగా ఊహించుకోవచ్చు. అది ఆ పార్టీ ఇష్టం. కానీ మాకు బలం లేదని, సీఎం అయ్యే స్థాయి నేతలెవరూ మా పార్టీలో లేరని చెప్పడానికి జనసేనకు ఏం అధికారం ఉంది? పవన్‌గారికి తెలియకుండానే ఆ పార్టీ నేతలు ఇలాంటి ప్రకటనలు ఇస్తారా?’ అని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
బయటకు వెళ్లేందుకు సాకులేనా?
కాగా.. రాష్ట్రంలో బలహీనంగా ఉన్న బీజేపీ చట్రం నుంచి బయటపడేందుకే , జనసేన ఇలాంటి సాకులు వెదుకుతోందని బీజేపీ అగ్రనేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘బహుశా మా పార్టీతో లాభం లేదనుకుని జనసేన ఈవిధంగా డెడ్‌లైన్ ప్రకటించినట్లుంది. పవన్ కల్యాణ్ గారికి మొదటి నుంచి మా అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంపై పెద్దగా సదభిప్రాయం లేదు. ఏపీ నాయకత్వం జగన్‌తో లాలూచీ పడుతోందన్న అనుమానం ఆయనలో లేకపోలేదు. జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, ఏపీ బీజేపీ నాయకత్వం బంతిపూలతో పోరాడుతోందన్న అనుమానం ఆయనకుంది. అందుకే ఆయన మా రాష్ట్ర పార్టీని ఎప్పుడూ పెద్దగా ఖాతరు చేయకుండా, నేరుగా ఢిల్లీ వాళ్లతోనే మాట్లాడుకుంటున్నారు. ఈ నాయకత్వంతో ఎన్నికలకు వెళితే, తానూ మునిగిపోతానన్న భయంతోనే బహుశా పవన్ గారు, మా పార్టీ నుంచి బయట పడేందుకు దారులు వెతుకుతున్నట్లున్నారు. అందులో భాగంగానే ఈ డెడ్‌లైన్ అని భావిస్తున్నాం. ఏదేమైనా మా పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. రేపు ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా చచ్చినట్లు మా మద్దతు తీసుకోవలసిందే’నని తూర్పు గోదావరికి చెందిన నేత ఒకరు, అసలు విషయం బయటపెట్టారు. కాగా రానున్న ఎన్నికల్లో సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉంటే, జనసేన బీజేపీతో కలసి పోటీ చేయడం కష్టమని.. ఢిల్లీ పెద్దలకు పవన్ ఈపాటికే స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
పవన్‌ను నమ్మేదెలా?
కాగా.. పవన్‌ను నమ్మి ఆయనను సీఎం అభ్యర్ధిగా ఎలా ప్రకటించాలన్న చర్చ బీజేపీలో జరుగుతోంది. ఎప్పుడేం మాట్లాడతారో తెలియని పవన్‌ను నమ్మి, ఆయనను సీఎం అభ్యర్ధిగా ఎలా ప్రకటించాలని బీజేపీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పవన్‌కు సినీ గ్లామర్, కులబలం ఉన్నప్పటికీ ఆ కార్డులేవీ పనికిరావని గత ఎన్నికల్లోనే తేలినందున.. ఇప్పుడు కొత్తగా ఆయనను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే.. వచ్చే అదనపు రాజకీయ ప్రయోజనం ఏమిటన్న చర్చ బీజేపీలో జరుగుతోంది. పైగా ఈ విధానం పార్టీకి జాతీయ స్థాయిలో మైనస్ అవుతోందంటున్నారు. ‘ఇప్పుడు జనసేన డెడ్‌లైన్ విధించినట్లు పవన్‌ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించామనుకోండి. రేపు వేరే రాష్ట్రంలో ఇలాంటి డిమాండునే చిన్నా చితకా పార్టీలు పెడితే పార్టీ పరువేం కావాలి? ఇలా షరతులు పెట్టిన వారికల్లా లొంగిపోతే, జాతీయ పార్టీ స్థాయి పరువు ఏం కావాలి? ఇలాంటి బె దిరింపులకు మా పార్టీ లొంగదనుకుంటున్నా’ అని అనంతపురం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
తొందరపడి ముందే కూస్తున్న పవన్
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా అప్పుడే పొత్తులపై పవన్ ఎందుకు తొందరపడుతున్నారో అర్ధం కావడం లేదని బీజేపీ సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. నిజానికి పొత్తులనేవి ఎన్నికలకు మూడు నెలల ముందు ఫిక్సవుతాయి. కానీ ఈలోగానే పవన్ సీఎం అభ్యర్ధిత్వం, పొత్తుల గురించి మాట్లాడటం వింతగా ఉంది. మొన్న ఆయన వేసిన ప్రశ్నలు ఎవరినుద్దేశించో చెబితే బాగుండేది. అసలు జనసేనకు పార్టీ సంస్థాగత బలం, పార్టీ నిర్మాణం ఉందా లేదా అన్నది ఒకసారి ఆలోచించుకుని ప్రకటనలు ఇచ్చి ఉంటే బాగుండేద’ని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
హరిప్రసాద్ ప్రకటనపై చర్చ
కాగా.. జనసేన నేత హరిప్రసాద్ అసలు అలాంటి ప్రకటనలు ఇచ్చారా అన్న అంశంపై బీజేపీలో మరో చర్చ జరుగుతోంది. బీజేపీ-జనసేన బంధాన్ని బలహీనపరిచేందుకు, వైసీపీ సోషల్ మీడియా చాలాకాలం నుంచి చేస్తున్న ప్రచారంలో అది కూడా ఒక భాగమేనని తాము అనుమానిస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ‘బీజేపీతో తాము కలసి నడుస్తామని మంగళగిరిలో పవన్ గారు స్వయంగా ప్రకటించిన తర్వాత హరిప్రసాద్ ఆవిధంగా బీజేపీకి డెడ్‌లైన్ విధాస్తారని మేం అనుకోవడం లేదు. ఇదంతా బీజేపీ-జనసేన మధ్య విబేధాలు సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న వ్యూహాత్మక ప్రచారమని అనుకుంటున్నాం’ అని విశాఖకు చెందిన బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.