వైసీపీ ప్రభుత్వం పంటల బీమా చెల్లింపుల్లో అసలైన రైతులకు మొండిచేయి చూపుతోంది.పంటల బీమా లబ్ధిదారులు 30 లక్షల మంది ఉంటే.. 15 లక్షల మందికి మాత్రమే పరిహారం చెల్లించారు. పంటల బీమా చెల్లింపుల్లో జగన్ రెడ్డి మసిపూసి మారేడుకాయ చేశారు. అసలైన కౌలు రైతులకు పంటల బీమా అందలేదు. లంక భూములు చేస్తున్న ఏక్ సాల్ లీజు కౌలు దారులకు పంటల బీమా అంద లేదు. సొసైటీ భూములు సాగుచేస్తున్న దళిత రైతులకు పంటల బీమా సాయం అంద లేదు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులను మోసం చేశారు. ఆలయ భూములు సాగుచేస్తున్న కౌలు దారులకు పంటల బీమా సాయం అందలేదు. అసైన్డ్ భూములు సాగుచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర అగ్ర కులాల్లో పేద రైతులకు పంటల బీమా శూన్యం. ఈ-క్రాప్ బుకింగ్ ఆర్బీకేల్లో సక్రమంగా జరగలేదు. లబ్ధిదారుల జాబితాను ఎక్కడా ప్రదర్శించలేదు. పంటలు సాగుచేయని వైసీపీ వారికి పంటల బీమా సొమ్ము అందింది. నిజమైన రైతులకు జగన్ రెడ్డి మొండి చేయి చూపారు. పంటల బీమా లబ్ధిదారులు 30 లక్షల మంది ఉంటే.. 15 లక్షల మందికే పరిహారం అందించామని స్వయంగా జగన్ రెడ్డే అంగీకరించారు.
జగన్ రెడ్డి అబద్ధాలు వల్లె వేశారు. 2014-18 మధ్య టీడీపీ ప్రభుత్వం పంటల బీమా కింద రూ.4,007 కోట్లు రైతులకు చెల్లించినట్లు జగన్ రెడ్డి ప్రభుత్వ అధికారులు ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆర్టీఐకి ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి విరుద్ధంగా జగన్ రెడ్డి అనంతపురం సభలో అబద్ధం చెప్పారు. ఇన్ పుట్ సబ్సీడీ టీడీపీ ప్రభుత్వం రూ.3,750 కోట్లు ఇవ్వగా.. జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.1,612 కోట్లు మాత్రమే ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాం కన్నా ఈ ప్రభుత్వ హయాంలోనే అధికంగా ప్రకృతి విపత్తులు జరిగాయి. అయినా ఇన్ పుట్ సబ్సీడీ తక్కువ ఇచ్చి, ఎక్కువ ఇచ్చినట్టుగా అబద్ధాలు చెప్పారు. పైగా కేంద్ర విపత్తు సహాయ నిధులు రూ.1,100 కోట్లు దారి మళ్లించి రైతుల్ని దగా చేశారు. 2,112 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా.. కేవలం 718 మందికి మాత్రమే పరిహారం చెల్లించి దాదాపు 1400 మంది రైతులకు అన్యాయం చేశారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ 3వ స్థానంలోనూ, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉందని నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో రికార్డులు స్పష్టం చేస్తు్న్నాయి. ధాన్యం బకాయిలు ఒక్క రబీలోనే రూ.3,000 కోట్లు బకాయిలు పెట్టారు. మూడు నెలలు దాటినా బకాయిలు చెల్లించలేదు. టీడీపీ ప్రభుత్వం వారంలోనే బకాయిలు చెల్లించింది.
గడచిన మూడేళ్లలో ధాన్యం దిగుబడులు సుమారు 400 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ప్రభుత్వం సేకరించిన ధాన్యం సుమారు 220 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. 180 లక్షల మెట్రిక్ టన్నులు రైతులు ఎంఎస్ పి కన్నా తక్కువ ధరకు తెగనమ్ముకోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ధరల నిర్ణయాక కమిటి(సీఏసీపీ) ప్రకారం ఏపీలో రైతులు ఒక మెట్రిక్ టన్నుపై ఎంఎస్ పి కన్నా రూ.230 తక్కువకు అమ్ముకున్నారు. 2020-21లో ఒక ఏడాదే తెలంగాణ ప్రభుత్వం కోటి 40 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేయగా.. జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 61 లక్షల టన్నులు మాత్రమే సేకరించింది. వ్యవసాయ విద్యుత్ 6-7 గంటలే ఏపీలో ఇస్తున్నారని కేటీఆర్, మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇది వాస్తవం కూడా. అయినా 9 గంటలు ఇస్తున్నట్లు జగన్ రెడ్డి అనంతపురం సభలో అబద్ధాలు చెప్పారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరి బిగించబోతున్నారు. మూడేళ్లలో జగన్ రెడ్డి 3,800 ట్రాక్టర్లు ఇవ్వగా, చంద్రన్న ప్రభుత్వం 23 వేల ట్రాక్టర్లు ఇచ్చింది.
రైతు రుణమాఫీ ఎగనామం పెట్టారు. అన్నదాత సుఖీభవ ఉంటే రూ.15వేలు వచ్చి ఉండేది. రైతు భరోసాలో రూ.7,500 మాత్రమే ఇచ్చి రైతును దగా చేస్తున్నారు.
2014-18 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిన పంట బీమా 4007.59 కోట్లు. జగన్ రెడ్డి ప్రభుత్వమే ఇచ్చిన ఆర్టీఐ వాస్తవాలకు విరుద్ధంగా నేటి ప్రభుత్వ యాడ్ లో బీమా వాస్తవాలను తారుమారు చేశారు.
జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. రైతు భరోసా కింద ఏడాదికి ఒకేదఫాలో రూ.12,500 ఇస్తామని హామి ఇచ్చి 3 దఫాల్లో రూ.7,500 మాత్రమే చెల్లిస్తున్నారు. కేంద్రం ఇచ్చే రూ.6వేలను కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. ఒక్కో రైతుకు ఏడాదిరి రూ.6 వేలు చొప్పున ఐదేళ్లకు రూ.30 వేలు నష్టపోతున్నారు. రైతు రుణమాఫీ రద్దు చేసి అన్నదాతలకు ద్రోహం చేశారు.
అన్నమయ్య ప్రాజెక్టుకు అదనపు గేట్లు పెట్టాలని సిఫార్సు చేసినా నిర్లక్ష్యం వహించారు. దీంతో ప్రాణనష్టానికి కారకులయ్యారు.చంద్రన్న ప్రభుత్వం అందించిన విపత్తుల సహాయాన్ని జనం మరచిపోలేనిది. ఫ్లడ్ మేనేజ్ మెంట్ లో జగన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. ఆర్టీజీఎస్ ను సరిగా ఉపయోగించుకోలేదు.. టీడీపీ హయాంలో.. హుదూద్, తిత్లీ, లైలా వంటి తుఫాన్లు సంభవించినా.. చంద్రబాబు బస్సులోనే ఉంటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యలను స్వయంగా పరిశీలించారు. వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వారందరికీ గంటల వ్యవధిలో పరిహారం అందించడం చంద్రబాబు గారికే చెల్లింది.
తిత్లీ, పెథాయ్ తుఫాన్లలో పంట దెబ్బతిన్న ధాన్యం రైతులకు హెక్టారుకు పరిహారం రూ 15 వేల నుంచి రూ.20 వేలకు పెంచి అందజేశారు.. ఇందుకు రూ.3,608 కోట్లు వెచ్చించడం జరిగింది. పంటల బీమా పథకం ద్వారా నష్టపోయిన రైతులు రైతు భరోసా కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తోంది. పంటల బీమా వచ్చే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.