శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు,
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్
విషయం: ఆక్వా హాలీడే ప్రకటించకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.
సీఎంగారూ,
మీరు పదవీప్రమాణ స్వీకారం చేసిన నుంచీ ఒక్కో రంగం సంక్షోభంలో కూరుకుపోవడం, యాధృచ్చికమో, మీ ప్రభుత్వ నిర్లక్ష్యమో తెలియదు కానీ లక్షలాది మందిపై దీని ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఇసుక పాలసీ మార్చి భవననిర్మాణరంగాన్ని, దానికి అనుబంధంగా వున్న 130కి పైగా వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసేశారు. వందలాది మంది భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారకులయ్యారు. అనాలోచిత విధానాలతో విద్యుత్ కోతలు ఆరంభించి పరిశ్రమలకి పవర్‌హాలీడే ప్రకటించేలా చేశారు. విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులు అన్నీ పెరిగి మద్దతు ధర తగ్గిపోయిన గడ్డు పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతులు పంటలు వేయకుండా క్రాప్‌హాలీడే పాటిస్తున్నారు. అన్నదాతల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో వుండటం వ్యవసాయరంగం దుస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఒక్కో రంగం కుదేలవుతున్నా మీ ప్రభుత్వం కనీస ఉపశమన చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ఆక్వా రంగం కూడా సంక్షోభంలో పడింది. విద్యుత్ చార్జీల పెంపు, ఫీడ్ ధర అధికం కావడం, రొయ్యల ధర తగ్గిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్వా హాలీడే ప్రకటించాలని రైతులు తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించకపోవడం విచారకరం. ఫీడ్ కేజీకి రూ.20, మినరల్స్, ఇతర మందుల ధరలు 30 శాతం పెరిగినా మీదృష్టికి ఈ సమస్య రాకపోవడం విచిత్రమే. రొయ్యల రేటు మాత్రం ఏ కౌంటు అయినా కేజీ సుమారు 70 నుంచి 150 వరకూ తగ్గినా మీ నుంచి స్పందన శూన్యం. ఆక్వారంగానికి మేలు చేస్తానని హామీలు ఇచ్చిన మీరు అధికారంలోకి వచ్చాక తెచ్చిన తరువాత ఫీడ్-సీడ్ యాక్ట్ లతో
రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఆక్వారంగంలో డబుల్ డిజిట్ గ్రోత్ వుండాలని నిర్దేశించిన అప్పటి సీఎం చంద్రబాబు గారు రెండు విడతల్లో (ఒకసారి 0.77పైసలు, మరోసారి రూ. 1.86 పైసలు) యూనిట్ విద్యుత్‌పై రూ. 2.63 పైసలు తగ్గించడంతో అప్పటివరకూ ఆక్వా రైతులు 1 యూనిట్‌కి రూ. 4.63 పైసలు చెల్లించే విద్యుత్ చార్జీలు రూ.2కి తగ్గడంతో భారం తగ్గి మేలు చేకూరింది. ప్రతిపక్షనేతగా పాదయాత్రలో మీరు ఆక్వా రైతులకి యూనిట్ విద్యుత్ ను రూ. 1.50 పైసలకే ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకొచ్చాక 0.50 పైసలు తగ్గించి, మళ్లీ రూ. 2.36 పైసలు పెంచి దారుణంగా మోసగించారు. ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ పేరుతో 80 శాతం మందికి సబ్సిడీలు ఎత్తివేయడం ముమ్మాటికీ ఆక్వారైతులకు ద్రోహం చేయడమే సీఎం గారూ. చంద్రబాబు గారు ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు విద్యుత్ సబ్సిడీలు ఇచ్చారు. ఉచితంగా ట్రాన్స్‌ఫార్మర్లు అందజేశారు. రొయ్యల ధరలు పతనమైతే ఎగుమతి దారులతో మాట్లాడి ప్రతి కౌంట్ కేజీకి అదనంగా రూ.20 పెంచేలా చర్యలు తీసుకున్నారు. రొయ్యల సాగులో ఉపయోగించే యంత్రాలు ఎస్సీఎస్టీలకు 90 శాతం, చిన్నసన్నకారు రైతులకు 50 శాతం సబ్సిడీతో అందజేశారు. టిడిపి ఇన్నిరకాలుగా ఆక్వారంగానికి ప్రోత్సాహం అందిస్తే, మీరు సబ్సిడీలు ఎత్తేసి సంక్షోభానికి కారకులయ్యారు.
మేము రైతుకు సబ్సిడీలో రూ.1,14,000కే 40 KVA ట్రాన్స్ఫార్మర్ అందిస్తే, అదే ట్రాన్స్‌ఫార్మర్‌కి రూ. 3,37,000 వసూలు చేయడం ఆక్వారంగానికి అదనపు భారం అయ్యింది. మీ ప్రభుత్వం ఏర్పడిన నుంచీ ఈ మూడేళ్లలో ఆక్వా రంగానికి అత్యవసరమైనటువంటి ఐస్ ప్లాంట్స్ గాని, ప్రోసెసింగ్ ప్లాంట్స్ గాని, కోల్డ్ స్టోరేజులు కొత్తగా ఒక్కటి కూడా నిర్మించలేదు. నిర్మించేవాళ్లకు ప్రోత్సాహం అందించలేదు. మా సర్కారు రొయ్యల పెంపకానికి సరఫరా చేసే 1000 లీటర్ల నీటికి రూ.1.20 పైసలు వసూలు చేయగా, ఈ రోజున అదే నీటికి రూ. 120 వసూలుచేయడమేనా మీరిచ్చే ప్రోత్సాహం? మీ అధ్వాన విధానాలతో రోజుకి ఐదారుగంటలు విద్యుత్ కోత వల్ల జనరేటర్లు నడిపించి ఆక్వా ఉత్పత్తులను కాపాడుకోవాల్సి దుస్థితి నెలకొంది. ఆక్వారంగం పట్ల మీ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికైనా కళ్లుతెరిచి ఆక్వా రైతుల డిమాండ్లన్నీ తక్షణమే నెరవేర్చకపోతే పరిశ్రమలు, వ్యవసాయరంగం దారిలోనే ఆక్వా హాలీడే కూడా తప్పకపోవచ్చు. ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా విద్యుత్ యూనిట్‌కి రూ. 1.50నే కొనసాగించాలి. క్వాలిటీ సీడ్ సరఫరా చేయాలి. విపరీతంగా పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలి. కనీసం 15 రోజులపాటు రొయ్యల రేటు పడిపోకుండా నిలకడగా వుండేలా చూడాలి. పెంచిన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సెస్ ని తగ్గించాలి ధరలు పడిపోతే ప్రభుత్వం నుంచి మద్దతు అందించాలి. ఈ ప్రోత్సాహాకాలు ప్రభుత్వం నుంచి ఆక్వా రంగానికి అందకపోతే..కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే పరిశ్రమ కూడా హాలీడే తప్పకపోవచ్చు. దయచేసి మీరు ఆక్వారంగం సంక్షోభంలో పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.