గతంలో… ఇళ్లల్లోని వారు… ఆడంగులు, మగంగులు ; పిల్లలు… పెద్దలు…ఎవరైనా సరే…పొద్దున్నే నిద్ర లేవగానే, తమ అర చేతులు చూసుకోవడమో….తమ ఇష్ట దైవాన్ని తలుచుకోవడమో చేసి ; మంచాలు దిగి, దైనందిన పనులకు ఉపక్రమించేవారు .
ఇప్పుడు రోజులు మారాయ్. అలవాట్లూ మారాయ్. కరివేపాకు కాస్తా కొరివేప్రాక్ అయింది. కొత్తిమీర కాస్తా…. క్రొత్తిమీర అయింది.
ఈ రోజుల్లో ఆడంగులైనా, మగంగులైనా ; ముసలైనా… ముతకైనా….అత్తలైనా…కోడళ్ళయినా, ఆసుపత్రుల్లో బెడ్ మీద ఉన్నా … బెడ్లు ఖాళీ లేక వరండాల్లోని పడుకునే రోగులయినా…. కనక దుర్గ గుడి మెట్ల కింద కూర్చుని అడుక్కునే వారైనా… ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారైనా….పొద్దున్నే నిద్రలోంచి మెలుకువ రాగానే…. పక్కలోనే పెట్టుకుని ఉన్న మొబైల్ ఫోన్ ను ఆన్ చేసి, ఫేస్ బుక్ కాసేపు, వాట్సాప్ మెసేజీ లు కాసేపు చూసికానీ మంచాలు దిగడం లేదు. పనిలో పనిగా యూ ట్యూబ్ వీడియోలు కూడా !
మరీ తెలివైన వారిలో కొంతమంది అయితే …. బాత్ రూమ్ /వాష్ రూమ్ ల్లోకి కూడా మొబైల్స్ తీసుకు వెడుతున్నారు(ట) . అవి చేతుల్లో లేకపోతే , వెళ్లిన పని శుభ్రం గా జరగడం లేదని. పైపెచ్చు ; ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో అన్న చింత ఒకటి .
పెళ్లి పీటల మీద కూర్చున్న వారు కూడా… మధ్య మధ్యలో మొబైల్ లో మెసేజ్ లు చూసుకుంటున్నారు…. అలాగే, మంత్రాలు చదివేవారూను! విధి వశాత్తు నూతనంగా దంపతులైన వారు…. మొబైల్స్ లేకుండా శోభనం గదిలోకి కూడా వెళ్లడం లేదని ఓ పంతులు గారు మొన్నొకసారి చాలా ‘ ఇదై’ పోయారు. యూ ట్యూబ్ లో ఆ వీడియోల సాయం కూడా తీసుకోవచ్చట….
మనిషి జీవితం తో ఈ ఫేస్ బుక్, వాట్సాప్, యూ ట్యూబ్ అంతగా పెనవేసుకు పోయాయి.
‘ ఫేస్ బుక్’ అంటే…., పండుగ రోజుల్లో దర్శనమిచ్చే విజయవాడ బస్ స్టేషన్ ప్లాట్ ఫార్మ్ లాటిది. ఎవరి గోల వారిది.
అందుకే, ఫేస్ బుక్ అంటే…. జనం పడి చచ్చిపోతారు . రూపాయి ఖర్చు లేకుండా…ఎవరు ఏమి కామెంట్స్ పెట్టారో…. చూసేయాలి అనే కుతూహలమే(దురద )… ఫేస్ బుక్ ను నడిపిస్తున్నది . దానిని చూడడం అనేది మన దేశ జనాభాలో దాదాపు సగం మందికి ఒక వ్యసనం గా మారిపోయింది. మాస్ జనం దానిని ఓపెన్ గా…. ఎక్కడ బడితే అక్కడ చూస్తుంటే ; తాము క్లాస్ అనుకునే వారు సీక్రెట్ గా చూస్తారు .
మొత్తం మీద చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న వారు, ఫేస్ బుక్ చూడకుండా ఉండ లేరు . దాని రీచ్ అంత విస్తృత స్థాయిలో ఉన్నప్పటికీ ; ప్రజల దృష్టికి తీసుకురావలసిన పాలనా పరమైన అంశాలను వివరించడానికి, ప్రభుత్వ వ్యవస్థలు సంప్రదాయ మీడియా పైన ఆధార పడుతుంటాయి. ప్రెస్ మీట్ అనో, ప్రెస్ రిలీజ్ అనో, ప్రకటనల రూపం లోనో….తెగ హైరానా పడిపోతుంటాయి.
అయితే ; రాష్ట్రం (ఏపీ) లోని పోలీస్ యంత్రాంగం మాత్రం… ప్రజలకు చేరువ కావడానికి , సంప్రదాయ మీడియా కంటే ; ఫేస్ బుక్ మాధ్యమాన్నే అద్భుతంగా వినియోగించుకుంటూ , మిగిలిన ప్రభుత్వ వ్యవస్థలకు దారి చూపిస్తున్న తీరు ఆశ్చర్యం గొలుపుతోంది. ఫేస్ బుక్ ను రాష్ట్ర పోలీస్ శాఖ దత్తత తీసుకున్నదా అనిపిస్తున్నది.
రాష్ట్ర హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి అయిన ఐపీఎస్ అధికారి… బిశ్వజీత్ కుమార్ స్వయంగా ఫేస్ బుక్ లో ఓ ఖాతా నిర్వహిస్తారు, తన పోలీస్ హోదాతో సంబంధం లేకుండా. దానిలో… ఆయన, తన భావాలను, కవితలను ,భావావేశాలను తన ఫాలోయర్స్ తో పంచుకుంటారు. కాకపోతే ; అదంతా హిందీలో . కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ “ కడప జిల్లాలో రౌడీలు వేషాలు వేస్తే ఊరుకోమ్. మీ కంటే మేం పెద్ద రౌడీలం …” అంటూ ముద్దుముద్దుగా తెలుగులో చేసిన హెచ్చరిక చాలా ఎఫెక్టివ్ గా కనిపించింది .
నచికేత్ మహారాష్ట్రకు చెందిన మన రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ . ముందు ఒడిశా కు కేటాయించారు గానీ, అదే బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి నిధి మీనా ను వివాహం చేసుకోవడంతో ; సెవెన్ -ఓ – క్లాక్ బ్లేడ్ లాటి నచికేత్ ను ఏపీ క్యాడర్ కు బదిలీ చేశారు. ఒడిశా నష్టం…. ఏపీ లాభం అన్న మాట.
“కడప రౌడీ “లకు ఆయన సందేశం గట్టిగానే చేరి ఉంటుంది . మామూలుగా అయితే ; మీడియా మీట్లు, స్టేట్మెంట్లు వగైరాలతో పోలీసులు ఈ సందేశాన్ని ప్రజల్లోకి బలం గా పంపడానికి నానా శ్రమలూ పడవలసి వచ్చేది.చాలా జిల్లాల్లో ఇలా… ప్రో -పీపుల్ ఎస్ పీ లే ఉన్నారు. (గతం లో ‘ప్రో – వైసీపీ’ ఎస్ పీ లు ఉండేవారు అనేది జనం మాట. కాకినాడ లో అప్పుడు ఎస్పీ గా పనిచేసిన రవీంద్రబాబు, బందరులో పనిచేసిన జాషువా…, తిరుపతిలోను, ఆ తరువాత వైసీపీ కోసం ఒంగోలు లోనూ ఎస్పీ గా పనిచేసిన పరమేశ్వర్ రెడ్డి, చిత్తూరు జిల్లాలో పనిచేసిన రిషాంత్ రెడ్డి వంటి వారు ఇందుకు నిదర్శనం
ఇప్పుడు “చంద్రలోక్” ప్రభుత్వం( అంటే చంద్రబాబు…. నారా లోకేష్ ప్రభుత్వం అని అర్ధం ) లో … పోలీస్ శాఖ … ప్రజలకు చేరువ కావడానికి ఫేస్ బుక్ మాధ్యమాన్ని అందిపుచ్చుకున్నట్టు ఉంది. ఇందుకు, డీజీపీ హరీష్ కుమార్ గుప్త ఇనీషియేటివ్ ముఖ్య కారణం.నిజానికి, పోలీస్ శాఖ ప్రదర్శిస్తున్న ‘విజిబుల్ పోలీసింగ్’ ఇది. (కూటమి నేతలు సైతం… ఆయా జిల్లాలలో పోలీసులతో కొంత సభ్యతగా వ్యవహరిస్తున్నారు.)
జిల్లాల వారీగా పోలీస్ యంత్రాంగం ఈ ఫేస్ బుక్ పేజీలు నిర్వహిస్తున్నాయి. నేరాల దర్యాప్తులు, దర్యాప్తుల ఆధారంగా వెలువడే కోర్టు తీర్పులు, ఆయా సందర్భాలలో పోలీస్ అధికారులు జనానికి చేసే హెచ్చరికలు, చెప్పే హితవులు….జాగ్రత్తలు, దారితప్పిన పోలీసులపై తీసుకునే క్రమశిక్షణ చర్యలు… అన్నీ ఫేస్ బుక్ లో దర్శనం ఇస్తున్నాయి. వీటికి లక్షల సంఖ్య లో ఫాలోయర్స్ ఉండడం మరో ఆశ్చర్యకరం .
ఉదాహరణకు… అనంతపురం , నెల్లూరు పోలీసుల ఫేసుబుక్ పేజీకి 50 వేల మంది వంతున ఫాలోయర్స్ ఉంటే…., కాకినాడ జిల్లా పోలీస్ ఫేసుబుక్ పేజీ కి సుమారు ఇరవై వేల లైక్స్ ఉన్నాయి.
ఫాలోయర్స్ ను ఆకర్షించడంలో కొన్ని జిల్లాల పోలీసు యంత్రాంగాలు ఇంకా దృష్టి పెట్టి కృషి చేయాల్సిన అవసరం ఉన్నట్టు కనబడుతున్నది. మాట వరుసకు – విజయనగరం, విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ,బాపట్ల, గుంటూరు, పల్నాడు మొదలైన జిల్లాల పోలీస్ యంత్రాంగాలు నిర్వహించే ఫేస్ బుక్ పేజీలు… కాకినాడ జిల్లా పోలీస్ యంత్రాంగం నిర్వహించే ఫేస్ బుక్ పేజీ కంటే కూడా జనాకర్షణ లో బాగా వెనుకబడి ఉన్నాయి.
అయితే, నాలుగైదు జిల్లాల పోలీస్ పేజీలు మాత్రం లక్షల్లో లైక్ లు అందుకుంటున్నాయి.
ఉదాహరణకు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ పేజీకి దాదాపు లక్షా ఎనభై వేల లైక్స్ ఉంటే ; ప్రకాశం జిల్లా పోలీస్ పేజీకి లక్షా ముప్పయ్ ఐదు వేలకు పైబడిన అభిమానులు ఉన్నారు. కడప జిల్లా పేజీ కి లక్ష పైబడి లైక్స్ కనబడుతున్నాయి.
గోప్యతకు, తల బిరుసు తనం, సమాజం పట్ల చిన్న చూపు తో కూడిన వ్యవహార శైలికి….పెట్టింది పేరైన పోలీస్ శాఖ… ఫేస్ బుక్ ద్వారా ప్రజలకు చేరువకావడాన్ని ఒక ఉద్యమం లాగా చేపట్టడం…. ఓ ఆహ్వానించ దగిన పరిణామం అనడం లో సందేహం లేదు. ప్రభుత్వానికి ఇదొక ప్లస్ పాయింట్.
2004 లోనే ఫేస్ బుక్ అందుబాటు లోకి వచ్చినప్పటికీ ; ప్రజలకు చేరువ కావడానికి ఇంతకు మించిన ప్రచార సాధనం లేదని పోలీస్ యంత్రాంగం గుర్తించడం మాత్రం… “చంద్రలోక్ ” పాలనతోనే మొదలేమో.
గతం లో మూడుసార్లు చంద్రబాబు పాలనను తెలుగు ప్రజలు టేస్ట్ చేసినప్పటికీ ; అప్పుడు పోలీస్ యంత్రాంగం ప్రజలకు చేరువ కావడానికి ఫేస్ బుక్ మాధ్యమాన్ని ఇంత విస్తృతంగా వినియోగించినట్టు గుర్తు లేదు. వైసీపీ పాలన లో… పోలీస్ లకు ఫేస్ బుక్ తో పని ఏముండేది? అప్పటి పోలీస్ ఓరియంటేషన్ వేరు కదా!
ఫేస్ బుక్ ను విస్తృతంగా వినియోగించడం వల్ల, సమాజానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
*పోలీస్ పట్ల ప్రజలలో సహజంగా ఉండే నెగిటివ్ ఇమేజ్, సినికల్ ఫీలింగ్స్, అసహనం కొంత తగ్గుతాయి..
*ఈ శాఖ పని తీరుపై ప్రజలలో కొంత సద్భావన కలగడానికి అవకాశం ఉన్నది.
*పోలీస్ పని తీరులో ఎంతో కొంత పారదర్శకత పెరుగుతుంది. అందువల్ల, నిజాయతీగా పని చేయాలనే ధృక్పథం, ఎస్పీలతో పాటు ; పోలీస్ స్టేషన్లలో కూడా పొడచూపుతుంది.
*కొంత బాధ్యతాయుతం గా వ్యవహరించాలనే స్పృహ సిబ్బందిలో ఉదయస్తుంది. జిల్లాలలో పోలీసులు ఏమి చేస్తున్నారో… పోలీస్ ఉన్నతాధికారులు పైనుంచి మానిటర్ చేయగలుగుతారు.
*ప్రజలు కూడా తెలుసుకోగలుగుతారు . *దేశవ్యాప్తంగానో, ప్రపంచ వ్యాప్తంగానో ఉండే తెలుగు వారు…. తమ తమ స్వంత జిల్లాలలో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో ఈ ఫేస్ బుక్ పోస్టింగ్ ల ద్వారా తెలుసుకోగలుగుతారు.
*ఇవన్నీ చేయడానికి పోలీసు శాఖ ప్రత్యేకం గా ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన పని లేదు. కొంచెం బాధ్యతాయుతం గా వ్యవహరిస్తూ, ప్రజలను ప్రేమించే లక్షణాలు కలిగిన యువ ఐపీఎస్ అధికారులు ఎక్కువ సంఖ్యలో … ఈ సమయం లో జిల్లా ఎస్పీలుగా ఉండడం ఆయా జిల్లాల అదృష్టం అనిపించింది :కొన్ని జిల్లాల ఎస్పీల పనితీరు పరిశీలించినప్పుడు . ఉదాహరణకు, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ఎస్పీల పని తీరుపై ఆయా జిల్లాల్లో…. ప్రజల్లో సద్భావన గట్టిగా వ్యక్తమవుతున్నది.
జిల్లా కార్యాలయం లో తులసి వనమా?
మామూలుగా, జిల్లా పోలీస్ కార్యాలయం అంటే… అదో ” ఖాకీ వనం ” అనుకుంటూ … అటుగా వెళ్లే జనం… ఓ రకమైన సినికల్ భావన తో చూస్తుంటారు. అటువంటి ఆవరణలో “తులసి తోట ” ను పోలీసులు ప్రత్యేకం గా పెంచడం గతం లో ఎక్కడా చూడలేదు. ఎవరైనా చెప్పగా వినలేదు. ఐతే, ఏ పని మీద అయినా , ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోకి అడుగు పెట్టినవారికి …., ముందుగా దర్శనం ఇచ్చేది మాత్రం…. పచ్చగా, కనువిందు చేసే తులసి తోట.
అన్ని తులసి మొక్కలతో ఒక వనం లాటిది ఏర్పాటు చేసి ; వాటి చుట్టూ ఇనుప కంచె వేశారు. ఆ తులసి వనాన్ని ఏర్పాటు చేయించింది మాత్రం ఎస్పీ – హర్షవర్ధన రాజు అని ఒంగోలు మీడియా మిత్రులు కొందరు చెప్పారు. ఒంగోలు పోలీస్ మైండ్ సెట్ కు ఈ తులసి వనం అద్దం పడుతుందని వారు అన్నారు. ముందుగా తులసి కోట వద్ద కారు దిగి, తులసి మాతకో వందనం సమర్పించి, తరువాతనె ఎస్పీ తన కార్యాలయానికి వెడతారని ఆ మిత్రులు చెబుతుంటే ఆశ్చర్యం వేసింది.,
జిల్లాలో పనిచేసే పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు…. ఇలా ఎవరైనా – ముందు తులసి వనాన్ని దర్శించుకున్న తరువాతే , ఎస్పీ కార్యాలయ దర్శనం చేసుకుంటారట.
అటువంటి ఐపీఎస్ యువ అధికారులను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది ప్రభుత్వ పెద్దలే . మాట వరుసకు కాకినాడ జిల్లా కు ఇప్పుడు ఎస్పీ గా పని చేస్తున్న బిందు మాధవ్ ను పల్నాడు జిల్లాలో వైకాపేయులు ఎన్ని ఇబ్బందులకు గురి చేశారు ? ఇప్పుడు కాకినాడ జిల్లా ఎంత ప్రశాంతం గా ఉన్నది ?
చాకుల్లాంటి యువ అధికార్లను ఎస్పీలు గా నియమించి ; ఫేస్ బుక్ ద్వారా పారదర్శకం గా ప్రజలకు చేరువకావడానికి కృషి చేస్తున్న
“చంద్రలోక్ “ప్రభుత్వం, హోమ్ శాఖ మంత్రిగా పని చేస్తున్న వంగలపూడి అనిత, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి బిశ్వజిత్ కుమార్,డీజీపీ హరీష్ కుమార్ గుప్త అభినందనీయులు అనడం లో సందేహం లేదు.
యూట్యూబ్ లోకి కూడా రావాలి !
ప్రజలకు చేరువ కావడానికి ఫేస్ బుక్ ను ఒక సాధనం గా చేసుకున్న రాష్ట్ర పోలీసు శాఖ , ( ముఖ్యం గా డీజీపీ హరీష్ ) యూట్యూబ్ టీవీ ద్వారా కూడా జనం ముందుకు రావాలి . దానివల్ల , “ విజిబుల్ పోలీసింగ్ “ మరింతగా పెరుగుతుంది . వీక్షకుల అభిప్రాయాలు … పోలీస్ ఉన్నతాధికారులకు క్షణాల్లో తెలుస్తాయి . దీనివల్ల , పోలీసింగ్ లో పారదర్శకత ఊహాతీతంగా పెరుగుతుంది . ప్రజల అభిమానాన్ని మరింతగా చూరగొనగలుగుతారు.
ఏ ప్రజాస్వామిక పాలకవర్గాన్నయినా… ముంచేదిగానీ, తేల్చేది గానీ పోలీసే.
పోలీస్ శాఖలాగానే ; రెవిన్యూ శాఖ ( అంటే జిల్లా కలెక్టర్ల వ్యవస్థ ) , పౌర సంబంధాల శాఖ మొదలైనవి … ఫేస్ బుక్ ను , యూట్యూబ్ ను విస్తృతంగా వినియోగించుకోవచ్చు .
ముఖ్యమంత్రి, ఐటీ శాఖమంత్రి కూడా… మీడియా వాళ్ళు కంట బడగానే పులకించి పోయేకంటే ; తమ భావాలను ప్రజలతో…. పార్టీ సభ్యులతో, అయిన వారితో…, కానివారితో నేరుగా పంచుకోడానికి ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి మాధ్యమాలను వినియోగించుకుంటే… కోట్లలో ఖర్చు తగ్గుతుంది.
వారి సందేశం కోట్ల మందికి చేరుతుంది.ప్రజలతో ఇప్పుడున్నదని అనుకుంటున్న గ్యాప్ కూడా బాగా తగ్గుతుంది. కార్యకర్తల్లో, శ్రేయోభిలాషుల్లో వారి పట్ల గుడ్ విల్ పెరుగుతుంది.టెక్నాలజీ ని వినియోగించుకోవడం అంటే …. ఇదే కదా మరి! ఇలా తొలిసారి పోలీసును ప్రజలకు చేరువ చేస్తున్న డీజీపీ హరీష్గుప్తాను అభినందించాల్సిందే.
– భోగాది వేంకట రాయుడు