– నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని రేవంత్ ప్రభుత్వం అధికారంలో కొనసాగే అర్హత కోల్పోయింది.
– ఉద్యోగం వ్యక్తిగత అవసరం కాదు — వ్యవస్థ అవసరం
– తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిరుద్యోగ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ సమస్య పైన రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ — ఉద్యోగం ఒక వ్యక్తిగత అవసరం మాత్రమే కాదు, అది వ్యవస్థ అవసరం కూడా అని స్పష్టం చేశారు. ఒక యువకుడు ఉద్యోగస్థుడైతే అతను వ్యవస్థ నిర్మాణంలో భాగస్వామి అవుతాడు, రాష్ట్ర అభివృద్ధికి ఇంధనంలా తోడ్పడతాడు అని పేర్కొన్నారు.
పాలకులు ఉద్యోగ కల్పనను వ్యక్తిగత సమస్యగా కాకుండా రాష్ట్ర బలోపేతానికి అవకాశంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 నుండి 45 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా పట్టణ నిరుద్యోగం బాగా పెరిగింది. దీనికి ప్రధాన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు.
కానీ ఉపాధి కల్పించాలి. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి. నైపుణ్యాభివృద్ధి చేయాలి. ఇవేవీ చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యువతను నిరాశకు గురిచేస్తోందని డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు అన్నీ గాలిలో కలిసిపోయాయి అభయహస్త మేనిఫెస్టోలో, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌లో ప్రియాంక గాంధీ స్వయంగా ప్రకటించిన వాగ్దానాలు ఇవి:
* మొదటి నెలలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
* మొదటి ఏడాదిలోనే SC, ST, BC, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ
* ప్రతి ఏడాది జూన్ 2కి జాబ్ క్యాలెండర్ ప్రకటన; సెప్టెంబర్ 17లోపు నియామకాల పూర్తి
* ఉద్యోగం వచ్చే వరకు నెలకు ₹4,000 నిరుద్యోగ భృత్తి
* TSPSC ప్రక్షాళన; యూత్ కమిషన్ ఏర్పాటు
* ప్రభుత్వ సహాయంతో ప్రైవేట్ కంపెనీల్లో 75% స్థానికులకు ఉద్యోగాలు
* 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు; మెగా DSC; స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు
* తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు; ₹25,000 పెన్షన్
ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. “ఓడమల్లయ్య బోడమల్లయ్య” అన్న సామెత అక్షరాలా నిజమైంది — గద్దె ఎక్కంగానే నిరుద్యోగులకు కేసులు, లాఠీలు, జైళ్ళు బహుమానంగా వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
67,000 ఉద్యోగాల నిజానిజాలు — ప్రభుత్వ మోసం బట్టబయలు
అసెంబ్లీలో 67,000 ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. వాస్తవానికి ఆ 67,000 ఉద్యోగాల్లో కేవలం 17,000 మాత్రమే ఈ ప్రభుత్వం నోటిఫై చేసినవి. మిగతా అన్నీ కేసీఆర్ ప్రభుత్వం ఆరంభించి అర్ధాంతరంగా ఆగిపోయిన భర్తీ ప్రక్రియలు. వాటిని తమ ఖాతాలో వేసుకొని మోసపూరితంగా లెక్కలు చెప్తున్నారని డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు.
వైట్ పేపర్ విడుదల చేయండి — ఖాళీలు ఎన్నో చెప్పండి.
రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. ఏ డిపార్ట్మెంటులో ఎన్ని ఖాళీలున్నాయో, రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఏ ఏ ఉద్యోగాలు వస్తాయో తెలిపే ఒక వైట్ పేపర్ విడుదల చేయమని డాక్టర్ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. కొత్త RDOలు, DSPలు, CTOలు, సెక్షన్ ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్లు — ఏ పోస్టులు ఎన్ని వస్తాయో కనీసం ప్రకటించమని కోరారు. అది చేయలేని ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని స్పష్టం చేశారు.
జాతీయ సగటుకు మించి ఉద్యోగాలు ఇవ్వొచ్చు — రాజకీయ సంకల్పం లేదు
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల శాతం వర్క్‌ఫోర్స్‌లో 3.8% మాత్రమే. జాతీయ సగటు 6%. కర్ణాటకలో 4.8%, మహారాష్ట్రలో 4.9%. ఈ ప్రభుత్వానికి నిజంగా సంకల్పం ఉంటే జాతీయ సగటుతో సమానంగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పెంచవచ్చు, లక్షల ఉద్యోగాలు ఇవ్వవచ్చు అని ఆయన వివరించారు.
పెట్టుబడులు, కంపెనీలు — 70% తగ్గిపోయాయి
TS-iPASS ద్వారా నమోదైన కంపెనీలు మరియు పెట్టుబడుల గణాంకాలు ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరూపిస్తున్నాయి:
* 2023-24: 2,659 కంపెనీలు నమోదు; పెట్టుబడులు ₹28,100 కోట్లు
* 2024-25: 2,050 కంపెనీలు; పెట్టుబడులు ₹13,000 కోట్లకు పడిపోయాయి
* 2025-26: కేవలం 915 కంపెనీలు; పెట్టుబడులు ₹4,869 కోట్లకు పతనం — దాదాపు 72-73% క్షీణత
ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించే కంపెనీలు రావడం లేదు. ఫార్మాసిటీని రద్దు చేసి 50,000 ఉద్యోగాలు పోగొట్టారు. నిరుద్యోగం, నిరాశ, ఆత్మహత్యలు — ఇదే రేవంత్ రెడ్డి పాలన ఫలితమని ఆయన ఆరోపించారు.
డిమాండ్లు
* వెంటనే వైట్ పేపర్ విడుదల చేసి డిపార్ట్మెంట్ వారీగా ఖాళీల వివరాలు ప్రకటించాలి
* హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ వెంటనే అమలు చేయాలి
* అశోక్ నగర్ నిరుద్యోగులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించాలి
* అమర వీరుల కుటుంబాలకు ఉద్యోగాలు, ₹25,000 పెన్షన్ అందజేయాలి
* నిరుద్యోగ భృత్తి వెంటనే అమలు చేయాలి
* ఉద్యోగ సంపద సృష్టించలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీనామా చేయాలి
ఉద్యోగం రావాలంటే రేవంత్ పోవాలి — ఈ నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళాలని, నిరుద్యోగులు తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలని డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ పిలుపు నిచ్చారు.