సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస కాండను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది ఆవేశపూరిత చర్య కాదు.. ముమ్మాటికీ పక్కా పథకం ప్రకారం జరిగిన దాడి అని స్పష్టమవుతోంది.ఆర్మీ పరీక్ష కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ప్రశాంతంగా నిరసన తెలపాలనుకున్నరు. కానీ, వారి ముసుగులో కొన్ని సంఘ విద్రోహ శక్తులు చేరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించాయి.
ఈ విధ్వంసకాండను పసిగట్టడంలో, నిరోధించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వేల మంది స్టేషన్ దగ్గర గుమిగూడుతుంటే… రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఆర్మీ అభ్యర్థుల మాటున దుండగులు పెట్రోల్ బాటిళ్లు, ఐరన్ రాడ్లు తీసుకొచ్చి స్టేషన్లోకి ప్రవేశించినా పోలీస్ వ్యవస్థ ఎందుకు గుర్తించకలేపోయింది?
ఇన్ని వేల మంది ఏకధాటిగా దాడి ఎలా చేస్తారు? అన్ని విషయాల్లో ముందస్తుగానే నివదికలిస్తూ హెచ్చరించే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు? మొత్తంగా ఈ ఘటన పూర్వాపరాలను చూస్తుంటే ఈ విధ్వంసకాండకు ఎవరు సహకరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
ఒకవైపు భారత దేశంలో అద్భుతమైన రైల్వే స్టేషన్లలో ఒకటిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను కేంద్రం తీర్చిదిద్దింది. వందల కోట్ల రూపాయలతో స్టేషన్ ను ఆధునీకరించింది. గంట వ్యవధిలో స్టేషన్ మొత్తం
ధ్వంసమైంది. ఆ యువకులను రెచ్చగొట్టిందెవరు? వారి వెనుక ఉన్న కుట్రదారులెవరో తేలాలి.ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి కడుపుమండి విధ్వంసం చేస్తున్నారంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం దుర్మార్గం. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, గౌరవెల్లి బాధితులు సహా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపట్ల కూడా కడుపు మండి ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఈ ఆందోళనకు, ‘అగ్నిపథ్’ కు సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు. దేశభక్తి ఉన్న యువకులకు భరతమాత సేవ చేసుకునే అవకాశం ఇప్పించే గొప్ప పథకం ‘‘అగ్నిపథ్’’. ఆర్మీలో చేరాలనుకునే యువకులకు ఇదొక గొప్ప వరం. ఈ విధ్వంసానికి, అగ్నిపథ్ కు ముడిపెట్టి మాట్లాడటం సిగ్గు చేటు.