చిలకమర్తి సాహిత్యం..
అలా మార్మోగుతూనే ఉంటుంది అనునిత్యం..
ఆయన విరచిత గయోపాఖ్యానం..
లక్షకు పైబడి ప్రతులు
చెల్లిన మహాభారత
ఉపఖ్యానం..
అద్భుతమంటూ
మహామహుల వ్యాఖ్యానం!
ఈ నాటకం రాసే సమయానికి నరసింహం
ఇరవై రెండేళ్ల బుడతడు..
గయోపాఖ్యానానికి ఇప్పుడు
వందేళ్లు..ఆ పద్యాలు
ఎప్పటికీ నాటకప్రియుల
చెవుల్లో మారుమ్రోగే
తప్పెటగుళ్ళు..!
రేచీకటి కమ్మినా..
కుమ్మే కలం ఆగలేదు..
దేశమాత పత్రిక
దొరల పాలనపై
తిరుగుబాటు వీచిక..!
బాపూ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే హరిజనోద్ధరణకు
నడుం కట్టిన సంస్కర్త..
వారి విద్యకోసం
బడి పెట్టిన యుగకర్త..
కష్టమే ఇష్టమై
సామాజిక అసమానతలను
దునుమాడిన యోధుడు..
చిలకమర్తి నరసింహుడు!
అసామాన్య ధారణ..
అనన్య సామాన్య భావవ్యక్తీకరణ..
చక్కని వక్త..
మంచి ప్రవక్త..
నో ఫియర్..
పేరేమో ఆంధ్రా షేక్స్ పియర్!
హాస్యం బహులాస్యం..
మనిషి ఉల్లాసం..
మాట సరసం..
కవులకు అక్షరలక్షలిచ్చెడి
కాలము గతించి
పద్యమునకు పకోడినిచ్చెడి
దుర్దినములు వచ్చినవని
స్నేహితులతో చలోక్తి..
నల్లినీ వస్తువుగా చేసుకున్న
చిలకమర్తి హాస్యోక్తి సాగిందిలా..
శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటినుంట
రాజీవాక్షుండ అవిరళముగ
శేషునిపై పవళించుట
నల్లి బాధపడలేక సుమీ..
ఇలా అసువుగా చెప్పిన కవి
రవి అస్తమించని సామ్రాజ్యానికే చుక్కలు చూపిన తెలుగు రవి..
భరత ఖండము
చక్కని పాడియావు..
హిందువులు లేగదూడలై
ఏడ్చుచుండ తెల్లవారను
గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు
బిగియగట్టి..
ఇలాంటి పదసంపదలెన్నో ఇచ్చారు చిలకమర్తి
మనకి మూటకట్టి..!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286