-ఆదాయం,అప్పుల కోసం మద్యం అమ్మకాలు పెంచి మహిళల మాంగల్యాలు తెంచుతారా?
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పాడు. బెల్ట్ షాపులు తీసేశాను, లిక్కర్ షాపుల సంఖ్య తగ్గించేశాను అని ప్రచారార్భాటం చేశాడు. ప్రైవేటు షాపుల ప్లేస్ లో ప్రభుత్వ షాపులు పెట్టి జే బ్రాండ్ అమ్మకాలు చేపట్టాడు. మూడేళ్లలో మద్యం అమ్మకాలు తగ్గించకపోగా మద్యంపై ఆదాయాన్ని చూపించి వేలకోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాళా తీయించాడు.
ఇప్పటికే మద్యంపై వచ్చే 15 ఏళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రూ. 25 వేల కోట్లు అప్పులు తెచ్చారు. పాక్షికంగాకానీ, పూర్తిగాకానీ సంపూర్ణ మద్యపాన నిషేదం అమలు చేయనని స్టాక్ మార్కెట్లకు హామీ పత్నం రాసిచ్చింది వాస్తవం కాదా? మద్యంపై అప్పు తెచ్చుకుంటున్న జగన్ రెడ్డికి మద్యపాన నిషేదం గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టి లిక్కర్ తాగే వాళ్లను మనం ఇన్నాళ్లూ చూస్తూ వస్తున్నాం. అలాంటిది తాగుబోతులను తాకట్టు పెట్టి డబ్బు దండుకునే వారిని ఏమనాలి?
మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తానని నాడు గొప్పలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ మూడేళ్లకు బార్ల టెండర్లు ఇచ్చేందుకు సిద్ధమైపోయాడు. జగన్ అధికారంలో ఉండేది చట్టబద్ధంగా రెండేళ్లే . మరి మూడేళ్లకు ఇచ్చేసి కోట్లలో డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. పంచాయితీలయితే రూ. 5 లక్షలు, స్టార్ హోటల్ అయితే రూ. 50 లక్షలు. 10 కిలోమీటర్ల వరకూ బార్లు పెట్టుకోవచ్చని లైసెన్స్ లు ఇస్తున్నారు. పైగా 840 దుకాణాలేనని తక్కువచేసి చూపే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. మద్యం అమ్మకాలతో మహిళల తాళిబొట్లు తెంపేస్తూ ఇంకేం మొహం పెట్టుకుని షాపులు పెంచాతారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.
గత ప్రభుత్వంలో చంద్రబాబు చీప్ లిక్కర్ అమ్ముతున్నారని ప్రతిపక్షంలో హడావుడి చేసిన మంత్రి రోజా ఎక్కడ? ఏ కలుగులో దాక్కుంది? మద్యపాన నిషేదం చేశాకే 2024లో ఓట్లు అడుగుతామని మంత్రి విడదల రజనీ చెప్పింది. మద్యానికి గేట్లు బార్లా తీశారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయదా? మీకు మద్యమే కావాలి. నిషేదం అవసరం లేదు. చంద్రబాబుగారిని చెప్పుతో కొట్టాలని దుర్భాషలాడిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మద్యనిషేదానికి తిలోదకాలు ఇచ్చాడు. మాట తప్పిన జగన్ రెడ్డిని ఏం చేయాలి? మాట మార్చడమే కాదు నైతికంగా అధికారంలో ఉండటానికి జగన్ అనర్హుడు. సంపూర్ణ మద్యపాన నిషేదమని 50 శాతం మహిళలకు అబద్ధాలు చెప్పి చేయకపోవడం ద్రోహం కాదా ?
చంద్రబాబుకు మద్యపాన నిషేదం చేసే దమ్ము లేదు, వైసీపీ అధికారంలోకి రాగానే మద్య నిషేదం చేస్తుందని ఆనాడు విజయవాడ సభలో జగన్ చెప్పాడు. తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేశాడు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వ్యక్తి భారతదేశంలో జగన్ రెడ్డి ఒక్కడే. అధిక రేట్లకు మందు కొనుక్కోలేక చీప్ లిక్కర్ తాగి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 30 మంది చనిపోతే ఆ కుటుంబాలను పరామర్శించే తీరిక జగన్ కు లేదా? మృతుల కుటుంబాలను నేటికీ ఆర్థికంగా ఆదుకోలేదు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే డబ్బుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని అసెంబ్లీలో చెప్పిన జగన్ కు అసలు సిగ్గుందా? మద్యం అమ్మకాల్ని పెంచి మహిళల తాలిబొట్లు తెంచుతారా?
కరోనా సమయంలో మద్యం షాపులు తెరిచి అక్కడ ఉపాధ్యాయులను పెట్టిన ఘనత జగన్ కే దక్కింది. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చివేయడం జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనం. సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తానని అధికారంలోకి వచ్చాక తిలోదకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే అర్హత లేదు. జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు చంద్రబాబుగారి సభలకు వస్తున్న అశేష ప్రజాదరణే నిదర్శనం. మద్యానికి బానిసైన వారు కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. కుటుంబాల్లో చిచ్చుకు జగన్ రెడ్డి ధనదాహమే కారణం. మద్యపాన నిషేదం అమలు చేయనందుకు ముఖ్యమంత్రి వెంటనే రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలి. నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి సెప్టెంబర్ ఒకటి నుంచి మద్యపాన నిషేధం అమలుచేయాలి.