రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థి దొరక్క విపక్షాలు తలపట్టుకుంటున్నాయి. తాము ఎన్నికల్లో పోటీ చేయలేమని ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. దీంతో, విపక్షాలు అనుకున్న ముగ్గురు వ్యక్తులు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేసినట్టయింది.
ఈ సందర్భంగా గోపాలకృష్ణ గాంధీ మాట్లాడుతూ, దేశ అత్యున్నత పదవికి పోటీ చేయాలని చాలా మంది గొప్ప నేతలు తనను అడగడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. వారందరికీ తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత… రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి విపక్షాల ఐక్యతతో పాటు యావత్ దేశ ఏకాభిప్రాయాన్ని సాధించే వ్యక్తి అయి ఉండాలని అనిపించిందని చెప్పారు. ఈ విషయంలో తనకంటే మెరుగైన వ్యక్తులు ఉన్నారనిపించిందని… అందుకే తాను పోటీ చేయాలనుకోవడం లేదని తెలిపారు.
గోపాలకృష్ణ గాంధీ పేరును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించిన సంగతి గమనార్హం. విపక్షాలు అనుకున్న ముగ్గురు కూడా పోటీకి ఆసక్తి చూపకపోవడంతో… ఇప్పుడు ఎవరిని నిలబెడతారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.