Suryaa.co.in

Features

‘బట్వాడా’కు బద్దకం!

– చెత్తకుప్పల్లో ఆధార్, పెళ్లికార్డులు, బ్యాంకులెటర్లు
– బట్వాడా చేయకుండా రోడ్డుపాలైన దారుణం
– పోస్టల్ అధికారుల నిర్వాకం
– జగ్గయ్యపేటలో రోడ్డున పడ్డ ‘పోస్టల్’

( మార్తి సుబ్రహ్మణ్యం)

అవి ప్రజల జీవితాలతో ముడిపడిన కీలక డాక్యుమెంట్లు. ఆధార్ కార్డుల వంటి అత్యవసర డాక్యుమెంట్లూ అందులో ఉన్నాయి. అవి ఒక్కటే కాదు.. పెళ్లికార్డులు, విద్యార్ధులకు అందించాల్సిన స్టడీ మెటీరియల్.. గుళ్ల నుంచి వచ్చిన ప్రసాదాలు.. బ్యాంకు లెటర్లు.. ఇంటర్వ్యూ కాల్‌లెటర్లు… లాయర్ నోటీసులు. ఇలా వందల సంఖ్యలో బట్వాడా చేయాల్సినవన్నీ ఇప్పుడు చెత్తకుప్పలు, ముళ్లకంచెల మధ్య సుఖనిద్ర పోతున్నాయి. సంబంధిత వ్యక్తులకు వాటిని సకాలంలో బట్వాడా చేయని పోస్టల్ శాఖ బద్దకానికి, వందలమంది బాధితులుగా మారిన నిర్లక్ష్యానికి ఇదే నిలువెత్తు నిదర్శన ం.

జగ్గయ్యపేట పోస్టల్ అధికారుల బద్దకానికి బలయిపోయిన వందల లెటర్లు, ఆధార్‌కార్డులు, బ్యాంకు లెటర్లు ఇప్పుడు జనం చేతికి చిక్కాయి. సకాలంలో బట్వాడా చేయని పోస్టల్ అధికారుల బద్దకంపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటిని సకాలంలో బట్వాడా చేయని పోస్టల్ అధికారులు, గుట్టుచప్పుడు కాకుండా తొర్రగుంటపాలెం ఆర్డీఓ ఆఫీసు వెనకాల ఉన్న ముళ్లచెట్ల వెనక పారేసి, చేతులుదులిపేసుకుని వెళ్లినా అవి జనం కంట పడ్డాయి.

కాగా తమకు సకాలంలో వాటిని అందించని పోస్టల్ అధికారులపై, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ‘వాటిని మేం చూడబట్టి సరిపోయింది. లేకపోతే అవి మరొకరి చేతుల్లో పడితే మా గతేం కావాలి? ఆధార్ కార్డుల వంటి కీలకమైన కార్డులపైనా ఇంత నిర్లక్ష్యమైతే ఎలా’ అని స్థానికులు కారాలు మిరియాలు నూరుతున్నారు.

 

LEAVE A RESPONSE