Suryaa.co.in

Andhra Pradesh

అధికారులు అప్రమత్తతతో భక్తులకు సేవలు అందించాలి

– రద్దీ విపరీతంగా ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలి
– టీటీడీ ఈవో ధర్మారెడ్డి

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నందువల్ల అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో సేవలు అందించాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శుక్రవారం క్యూ లైన్ ఆస్థాన మండపం దాటిందని చెప్పారు. శనివారం కూడా రద్దీ క్రమేపీ పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు సదుపాయాల కల్పనలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత కొన్ని నెలలుగా గురువారం నుంచి ఆదివారం వరకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోందని ఈవో వివరించారు. ఇందుకై ఆలయంలో, సన్నిధి నుండి వెండి వాకిలి, వెండివాకిలి నుండి మహద్వారం వరకు అదనంగా అధికారులను నియమించి, షిఫ్ట్ ల వారీగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.

రద్దీ రోజుల్లో రోజుకు 90 వేల మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారని ధర్మారెడ్డి చెప్పారు. క్యూ లోని భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదాలు ఇబ్బంది లేకుండా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యూ లైన్ల నిర్వహణ లో టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యాధికారి తిరుమల లో పరిశుభ్రతతో పాటు భక్తులకు నిరంతరాయంగా తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రిసెప్షన్ అధికారులు గదుల కేటాయింపులో అలస్యం లేకుండా చూడాలన్నారు. క్యూ లైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, మరియు 2 , నారాయణ గిరి ఉద్యానవనంలో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు, అన్నప్రసాదాలు అందించాలని చెప్పారు.

తిరుమల లో వాహనాల రాక పోకల వల్ల ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణకట్టలో రోజుకు సుమారు 40 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారని, రద్దీ కి తగినట్లు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. చీఫ్ ఇంజినీర్నా గేశ్వరరావు, ఎస్ ఈ 2 శ్రీ జగదీశ్వర రెడ్డి ,విజిఓ బాలిరెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE