– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
దశాబ్దాల పాటు ప్రజా ప్రతినిధిగా ఉండి కూడా తన సొంత ఊరికి కరెంటు సౌకర్యం కల్పించలేని ద్రౌపతి ముర్ము గిరిజనులకు మేలు చేస్తుందంటే ఎలా నమ్మాలి? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సందేహం వెలిబుచ్చారు.
ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్ గా పనిచేసే కూడా తన సొంత ఊరు అభివృద్ధిని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విస్మరించడం విచారకరం. ఇన్నేళ్లు పట్టనట్లుండి ఇప్పుడు మీడియాలో కథనం రావడంతో ఆగమేఘాల మీద ఆ ఊరికి కరెంట్ ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. గతంలో ద్రౌపది ముర్ము మంత్రిగా ఉండగా ఆ ప్రాంతంలో ఎస్టీలపై పోలీసులు కాల్పులు జరిపిన సందర్భంలో కూడా కనీసం ఆమె పరామర్శకు కూడా వెళ్లకపోవటం ద్రౌపది ముర్మ్ నిస్సహాయతకు అద్దంపడుతోంది.
తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటన సందర్భంగా ఎస్సీ వర్గానికి చెందిన రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు విజ్ఞప్తులు పంపినప్పటికీ స్పందించలేదు. దేశంలో అధికారం మొత్తం మోడీ, అమిత్ షాలా చేతుల్లో మగ్గుతున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలను సైతం శాసించే నిర్ణయాలు మోడీ, అమిత్ షాలు చేయటం దుర్మార్గం. ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారిని పీఠాలకు పరిమితి చేసి, నిర్ణయాధికారాలు మాత్రం మోడీ, అమిత్ షాలు చేస్తున్నారు. దీనిని బట్టి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థులకు ఏమాత్రం స్వ నిర్ణయాలు, అధికారాలు ఉండవని అర్థమవుతోంది.
ఇప్పుడు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయితే గిరిజన వర్గాలకు మేలు జరుగుతుందా? కేవలం నరేంద్ర మోడీ, అమిత్ షాల చేతుల్లో రబ్బరు స్టాంపుగా మిగులుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.