Suryaa.co.in

Telangana

ఆ పని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: విజయశాంతి

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో, ‘సాలు మోదీ-సంపకు మోదీ’ అంటూ టీఆర్ఎస్ ప్రచారం చేస్తుండడం తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ…నీ పార్టీని, నీ ప్రభుత్వాన్ని మోదీ గారు చంపనక్కర్లేదు… ఆ పనిచేసేందుకు ప్రజలే సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

ప్రజలే కేసీఆర్ ను ‘సాలు దొర-సెలవు దొర’ అంటున్నారని, ఆ మేరకు ప్రజల మనోభావాలనే బీజేపీ తెలంగాణ కార్యాలయం వద్ద బోర్డు రూపంలో ప్రతిబింబించడం జరిగిందని విజయశాంతి పేర్కొన్నారు. కేసీఆర్ కు నిజంగా పౌరుషం ఉంటే, ప్రజల్లో తనపై ఉన్న ఈ ప్రతికూల భావనలను తొలగించుకునేలా పనిచేయాలని కానీ, ఇలా పోటీగా ‘సాలు మోదీ-సంపకు మోదీ’ అంటూ పోస్టర్లు పెట్టరని పేర్కొన్నారు. కేసీఆర్ తీరు చూస్తుంటే అలిగి ఏడ్చే చిన్నపిల్లల తరహాలో ఉందని విమర్శించారు.

ఇది చాలదన్నట్టుగా, బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ రప్పించి పోటీ బైక్ ర్యాలీ పెట్టించారని విజయశాంతి ఆరోపించారు. ఇదంతా వాపును చూసి బలుపు అనుకోవడమే తప్ప మరేం కాదని ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE