-నాన్న చనిపోతూ ఇచ్చిన ఈ జగమంత కుటుంబం ఏనాడూ నా చెయ్యి విడవలేదు
-13 సంవత్సరాల ప్రయాణంలో మన బాటలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం
-కుట్రలు, కుతంత్రాలకు నా గుండె బెదరలేదు.. నా సంకల్పం చెదరలేదు
-2019లో చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించాం
-అధికారం అంటే అహంకారం కాదు.. ప్రజల మీద మమకారం అని నిరూపించాం
-ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల కోసమే బతుకుతున్నాం
-మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 95 శాతం హామీలు నెరవేర్చాం
-వైయస్ఆర్ సీపీ అంటే ఆడిన మాటకు కట్టుబడి ఉన్నామని అర్థం తెచ్చిన పార్టీ
-ప్రతి ఒక్క రంగంలోనూ మనదైన ముద్ర వేయగలిగాం
-మంచి చేసిన చరిత్రగానీ, మాటకు విలువిచ్చిన నైతికత ప్రతిపక్షానికి ఉన్నాయా..?
-దుష్టచతుష్టయానికి ఎన్ని జలిసిల్ మాత్రలు ఇచ్చినా వారి కడుపుమంట తగ్గదు
-మాట కోసం, నిబద్ధత కోసం, విలువల వ్యవస్థ కోసం మన ప్రయాణం
-ప్లీనరీ ప్రారంభ ఉపన్యాసంలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి
‘‘13 ఏళ్ల క్రితం పావురాల గుట్టలో ప్రారంభమైన ఈ సంఘర్షణలో.. నాన్న గారి ఆశయాల సాధన కోసం, మనందరి ఆత్మాభిమానం కోసం, అవమానాలను సహించి, కష్టాలను భరించి, నన్ను అమితంగా ప్రేమించి ఈ ప్రయాణంలో నాతో నిలబడి, వెన్నుదన్నుగా నిలిచి.. మన పార్టీ జెండా తమ గుండెగా మార్చుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధులకు, కోట్లమంది మనసున్న మనుషులకు మీ జగన్ ప్రేమ పూర్వకంగా, హృదయపూర్వకంగా, కృతజ్ఞతా పూర్వకంగా, మీ వాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబ సభ్యులుగా సెల్యూట్ చేస్తున్నా’’ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు ఏఎన్‌యూ సమీపంలో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశాలను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష హోదాలో లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే..
‘‘ఒకసారి మన పార్టీ గురించి, ఎక్కడ నుంచి మొదలుపెట్టాం.. ఎక్కడకు వచ్చాం అనేది ఆలోచన చేస్తే.. సెప్టెంబర్ 25వ తేదీన 2009లో పావురాల గుట్టలో ఈ సంఘర్షణ (13 ఏళ్ల క్రితం) ప్రారంభమైంది. ఓదార్పు యాత్రలో ఓ రూపం సంతరించుకొని, 2011 మార్చిలో ఓ పార్టీగా ఆవిర్భవించింది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 11 ఏళ్ల క్రితం పుట్టిన ఈ పార్టీ కోసం, నాన్న గారి ఆశయాల సాధన కోసం మనందరి ఆత్మాభిమానం కోసం, అవమానాలను సహించి, కష్టాలను భరించి, నన్ను అమితంగా ప్రేమించి ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్క అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతీ తాతకు కూడా, ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతీ అభిమానికి మన జెండా తమ గుండెగా మార్చుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధులకు, కోట్లమంది మనసున్న మనుషులకు మీ జగన్ ప్రేమ పూర్వకంగా, హృదయపూర్వకంగా, కృతజ్ఞతా పూర్వకంగా, మీ వాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబ సభ్యులుగా సెల్యూట్ చేస్తున్నాను.
2009 నుంచి ఈరోజు వరకు 13 సంవత్సరాల ప్రయాణంలో మన బాటలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎన్ని ముళ్లు ఉన్నా, మన మీద ఎన్ని రాళ్లు పడినా కూడా ఎవరు పగబట్టినా, ఎన్ని వ్యవస్థలు మనమీద కత్తిగట్టినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా కూడా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. ఆ కట్టుకథలకు విలువలేదు.. నా గుండె బెదరలేదు.. నా సంకల్పం చెదరలేదు.
నాన్న చనిపోయిన తరువాత నాకు ఇచ్చిన ఈ జగమంత కుటుంబం ఏనాడూ నా చెయ్యి కూడా విడవలేదు. తోడుగా నిలబడ్డారు. అడుగులు వేయడంలో బలాన్ని ఇచ్చారు. కాబట్టే 2019లో అంటే మూడేళ్ల క్రితం చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా, కనీవినీ ఎరుగని మెజార్టీ, దేవుడి దయ, మీ అందరి అండ, ప్రజలగొప్పగా ఆశీర్వదించారు. ఆ ఆశీస్సులు, దేవుడి దయతో 175 స్థానాలకు ఏకంగా 151 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు.
ఒకవైపున 175 స్థానాలకు, 151 ఎమ్మెల్యే స్థానాలతో ప్రజలు మనకు అధికారం ఇవ్వగా.. మరోవైపున ఆ దేవుడి దయ చూడండి.. 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను కొన్నవారిని మాత్రం.. 23 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకే పరిమితం చేశాడు దేవుడు.. ప్రజలు అంతా కలిసి.
అధికారం అంటే అహంకారం కాదు..
అధికారం అంటే అహంకారం కాదు.. అధికారమంటే ప్రజల మీద మమకారం అని నిరూపిస్తూ.. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారం వచ్చిన ఈ మూడేళ్లలో ప్రజల కోసమే బతికాం. పేదలకోసమే బతికాం. సామాన్యుల కోసమే బతికాం. అన్ని ప్రాంతాల కోసమే, అన్ని వర్గాల కోసమే బతికాం. అనుబంధాల కోసమే బతికాం. చెప్పిన మాట నిలబెట్టుకునేందుకు ప్రతిక్షణం తపిస్తూ బతికాం.
మేనిఫెస్టోను చెత్తబుట్టకే పరిమితం చేసే చరిత్ర రాష్ట్రంలో చాలా చూశాం. అటువంటి పరిస్థితి నుంచి మేనిఫెస్టోను భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా భావించి పరిపాలన సాగించాం. కాబట్టే తన మేనిఫెస్టోను చూపించడానికి తానే భయపడిన ఆ పార్టీ టీడీపీ.. తన మేనిఫెస్టోను ఎవ్వరికీ దొరక్కుండా గతంలో మాయం చేసిన ఆ పార్టీ. తన వాగ్దానాలన్నీ కూడా ఎక్కడ ప్రజలు నిలదీస్తారేమోనని, యూట్యూబ్, వారి వెబ్సైట్ నుంచి సైతం తీసేసిన పార్టీ ఆ టీడీపీ.
ఇప్పుడు మన మేనిఫెస్టోలో చెప్పినవి 95 శాతం హామీలు ఇప్పటికే మూడేళ్లలోపే అమలు చేసి.. ఆ మేనిఫెస్టోను కూడా చూపిస్తూ గడప గడపకూ వెళ్లి, మనిషి మనిషిని కలుస్తూ.. అక్కా, అన్న ఈ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలన్నీ అందాయా అని అడుగుతుంటే.. ఆ అక్క, అన్న, చెల్లెమ్మ, అవ్వ, తాత, ఆ పిల్లాడు ఆనందంగా చిరునవ్వుతో అవును అందాయని ఆశీర్వదిస్తుంటే.. ఇప్పుడు ఆ పార్టీ మన మేనిఫెస్టోను చూడటానికి భయపడుతుంది. ఇది మన పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆడిన మాటకు కట్టుబడి ఉన్నామని అర్థం తెచ్చిన పార్టీ అని సగర్వంగా తెలియజేస్తున్నాను.
గుండె చెదరలేదు.. సంకల్పం మారలేదు
మూడు సంవత్సరాల పాలన.. అంతకుముందు మనం ప్రయాణం చేస్తూ చేసిన యుద్ధంలో అన్నింటా కూడా దేవుడి దయ పుష్కలంగా మనకు ఉండి.. ఎత్తిపట్టుకుంది. ఈరోజు ఒక్కసారి గమనిస్తే.. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏమిటో చూపించింది. ఇది గ్రామాన్ని, గ్రామ పరిపాలన వ్యవస్థను, ప్రజలకు చేరువగా, అనుకూలంగా, పారదర్శకంగా, అవినీతి లేకుండా, వివక్ష లేకుండా ఎలా చేయగలమో.. ఎలా మార్చామో చూపించింది.
రైతుల మీద మమకారం అంటే ఇలా ఉంటుందని పరిపాలనలో చేసి చూపించింది. ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య న్యాయం అంటే ఈ మాదిరిగా ఉంటుందని చేసి చూపించింది. ఇవి పరిపాలన సంస్కరణలు అంటే.. ఈ మాదిరిగా ఉంటాయని చేసి చూపించింది. అక్కచెల్లెమ్మల సాధికార అంటే ఇలా ఉంటుంది.. ఇలా పరిపాలన చేస్తే ఇలా ఉంటుందని చేసి చూపించింది. ఇది అవ్వాతాతల మీద మమకారం అంటే.. ఈ మాదిరిగా ఉంటుంది. ఇలా చేసి చూపించింది మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మన ప్రభుత్వం. ఇదీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా విధానం అంటే ఇది ఈ మాదిరిగా ఉంటుందని చేసి చూపించింది మన వైయస్ఆర్ సీపీ. వైద్య, ఆరోగ్య రంగం మీద ప్రేమ అంటే ఈ మాదిరిగా ఉంటుంది, పరిపాలనలో ఈ మాదిరిగా మార్పులు చేస్తుందని చేసి చూపింది మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేయడం అంటే ఈ మాదిరిగా మూడు సంవత్సరాల్లో చేసి చూపించింది మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవినీతికి తావులేకుండా, లంచాలు అడిగి పరిస్థితి లేకుండా, వివక్షకు తావులేకుండా పారదర్శక పాలన ఇలా చేస్తారని మూడు సంవత్సరాల్లో చేసి చూపించింది.. మన ప్రభుత్వం, మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా తెలియజేస్తున్నాను.
ఇలా ప్రతి ఒక్క రంగంలోనూ మనదైన ముద్ర వేయగలిగాం. మూడేళ్ల పాలనలో 2 సంవత్సరాలు కరోనా సవాలు విసిరినా కూడా ఆర్థికంగా, అంతకుముందు పాలకుడు చంద్రబాబు ఏకంగా రాష్ట్రాన్ని ముంచేసి పోయినా.. బకాయిలు పెట్టినా, ఆ బకాయిలను మనమే కట్టాల్సి వచ్చినా.. నవరత్నాల పాలనను అందిస్తామని మాట చెప్పాం.. ఆ మాటను తూచా తప్పకుండా అమలు చేశామని సగర్వంగా మీ బిడ్డగా, మీ అన్నలా, మీ తమ్ముడిగా తెలియజేస్తున్నాను.
2009నుంచి 2019 వరకు సాగిన ప్రయాణం, 2019 నుంచి 2022 నేటి వరకు జరిగిన పాలన.. ఇక మీదట జరగబోతున్న ప్రయాణం.. ఒక మాట కోసం, నిబద్ధత కోసం, విలువల వ్యవస్థ సాధించడం కోసం సాగుతోంది మన పాలన, మన ప్రయాణం.
ప్రజా జీవితంలో మన పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్‌గా ఏం చేశాం.. ఎలాంటి అడుగులు వేశాం. చరిత్రలో ఇలాంటి అడుగులు గతంలో ఎప్పుడైనా పడ్డాయా..? ఇంతటి మార్పు ఎప్పుడైనా చూశామా అనేది కళ్లెదుటే.. కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నా కూడా.. అసూయతో గిట్టనివారు విమర్శలు, నిందలు చేస్తున్నారు.
దోచుకో పంచుకో అన్నట్లుగా వ్యవహరించిన గజదొంగల ముఠా
మంచి చేసిన చరిత్రగానీ, మాటకు విలువిచ్చిన నైతికత గానీ, ఏనాడైనా ప్రతిపక్షానికి ఉన్నాయా అని సవాల్ విసురుతున్నాను. ఈ దుష్టచతుష్టం.. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీరికి తోడు దత్తపుత్రుడు. ఎల్లో మీడియా, ఎల్లో పార్టీల జాయింట్ గజదొంగల ముఠాను చూసి, వారి రాతలను, పైశాచిక మాటలను చూసి అన్ని రకాలుగా ఇంటింటికీ, ప్రతి కుటుంబానికి, ప్రతి సామాజిక వర్గానికి మంచి చేసిన మనం.. మన చేతలతోనే సమాధానం ఇస్తాం. చెప్పినవన్నీ కూడా ఈ మూడు సంవత్సరాల్లో ఇప్పటికే.. మేనిఫెస్టోలో 95 శాతం అమలు చేసిన పార్టీ మీద, చెప్పిన ఏ ఒక్కటీ చేయనివాడు, మోసం చేసినవాడు ఈ రోజున విమర్శలు చేస్తున్నారు. మూడేళ్లలో నవరత్నాల్లోని ప్రతి ఒక్క స్కీమ్‌ను కూడా అమలు చేసిన మన పార్టీ మీద, మన ప్రభుత్వం మీద.. 14 ఏళ్లు సీఎంగా చేసిన ఆయన పేరు చెబితే.. ఏ ఒక్క పథకానికి కూడా కేరాఫ్ అడ్రస్ కూడా కానీ వ్యక్తి నోరుపారేసుకుంటుంటే.. ఆ కట్టుకథలను, పచ్చిభూతులను, వాటికి అబద్ధాలను కూడా జోడించి ప్రచారం చేసేవాళ్లు ఈరోజు పత్రికలు, టీవీలు నడుపుతున్న పరిస్థితిని మన కర్మకొద్ది చూస్తున్నాం.
వీరంతా కూడా అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని గతంలో బాగా మెక్కేశారు.. బాగా నొక్కేశారు.. బాగా దోచుకొని పంచుకున్నారు. ఇప్పుడు ఆ పంచుకోవడం ఆగిపోయింది. అందుకే ఈ గజదొంగల ముఠాకు నిద్రపట్టడం లేదు. గతంలో మాదిరిగా దోచుకో, పంచుకో అనే పరిస్థితి లేదు కాబట్టే వీరికి కడుపుమంట ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. దుష్టచతుష్టయానికి ఎన్ని జలిసిల్ మాత్రలు ఇచ్చినా కూడా వీరి కడుపుమంట తగ్గదు. కారణం ఏంటంటే.. గజదొంగల ముఠాకు గతంలో మాదిరిగా వస్తుంది రావడం లేదు కాబట్టే ఈ మందు ఇచ్చినా కడుపుమంట తగ్గదు.
మనం మాత్రం జనం ఇంట ఉన్నాం. జనం గుండెల్లో ఉన్నాం. గజ దొంగల ముఠా ఎల్లో టీవీల్లో, ఎల్లో పేపర్లలో, ఎల్లో సోషల్ మీడియాలో మాత్రమే ఉంది. వారికి, మనకి పోలిక ఎక్కడ..? మన చేతల పాలనకు, వారి చేతగాని పాలనకు మధ్య పోటీనా..? మన నిజాలకు, వారికి అబద్ధాలకు మధ్య పోటీనా..? మన నిజాయితీకి, వారి వంచనకు మధ్య పోటీనా..? మనది నిండు గుండెతో మంచిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి వారి గుండెల్లో బద్ధలవుతున్నాయి.. మన గెలుపు ఆపడం వారి వల్లకాదు కాబట్టే రాక్షసదళాలన్నీ ఒక్కటవుతున్నాయి. ప్రజా జీవితంలో మంచి చేసిన చరిత్ర, వీరు చేస్తామంటే నమ్మే మనిషి గానీ, ఈరోజు లేరు కాబట్టే కులాల కుంపట్లు, మతాల మంటలు పెడుతున్నారు. పచ్చి అబద్ధాలతో దుష్ప్రచారాలు చేస్తున్నారు.
చంద్రబాబుకు మాదిరిగా.. నాకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుడ్రుడి తోడు ఉండకపోవచ్చు.. కానీ, నాకు ఉన్నది ఒక్కటే.. అది మీ జనమందరి తోడు అని గర్వంగా చెబుతున్నాను. ఆ దేవుడి దయ, మీ తోడు, ప్రజలందరి చల్లని దీవెనలు.. ఈ మూడింటి మీదనే మీ జగన్ ఆధారపడతాడని సగర్వంగా తెలియజేస్తున్నాను.
ఈ విషయాలన్నింటిపై మనమంతా ఆలోచన చేసేందుకు, ప్రజలకు ఆలోచన కలగజేసేందుకు ఈప్లీనరీలో తీర్మానాలు, చర్చలు, ప్రసంగాలు ఉపయోగపడతాయని కోరుకుంటూ.. ప్లీనరీ, మూడో మహాసభను ప్రారంభిస్తున్నాను. రేపు సాయంత్రం విస్తృతస్థాయితో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన.. వస్తున్న కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి.. రేపు సాయంత్రం సుదీర్ఘంగా మాట్లాడుతాను’’ అని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.