విశ్వకర్మలకు ఇచ్చిన హామీని నెరవేర్చండి

– విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ భవనాన్ని నిర్మించి తక్షణమే నిధులు కేటాయించండి
– రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్
– విశ్వకర్మలకు ఇచ్చిన మాట సీఎం తప్పారని వాపోయిన సంఘం నేతలు
– తాము చేసే పోరాటానికి మద్దతివ్వాలని కోరుతూ బండికి వినతి పత్రం అందజేత

విశ్వ కర్మ, విశ్వ బ్రాహ్మణులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అందులో భాగంగా హైదరాబాద్ లో విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ భవనాన్ని నిర్మించి ఆ సామాజికవర్గ అభివ్రుద్ధి కోసం తగిన నిధులను కేటాయించాలని కోరారు.

ఈరోజు విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎర్రోజు భిక్షపతి, నందిపేట రవీందర్ ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు కరీంనగర్ లో బండి సంజయ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.

కేసీఆర్ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘానికి ఇచ్చిన మాట తప్పిందని వాపోయారు. 4 ఏళ్ల క్రితం వరంగల్ సభలో విశ్వబ్రాహ్మణుల అభివ్రుద్ధి కోసం రూ. 250 కోట్లు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

దీంతోపాటు తమ సంఘం పేరిట హైదరాబాద్ లోని ఉప్పల్ భగాయిత్ లో 5 ఎకరాల స్థలంలో ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మిస్తామని సీఎంతోపాటు మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, పైగా సంఘాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేస్తున్నారని వాపోయారు. ఈ విషయంలో తాము చేస్తున్న పోరాటాలను వారు బండి సంజయ్ ద్రుష్టికి తీసుకొచ్చారు.

వెంటనే స్పందించిన బండి సంజయ్ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం నేతలు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఆత్మగౌరవ భవనాల పేరిట అనేక కుల సంఘాలకు హామీ ఇచ్చిన కే సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపడ్డారు.

అందుకే బీజేపీ పక్షాన సీఎం కేసీఆర్ బండారాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి విశ్వకర్మ సామాజికవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘంతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply