Suryaa.co.in

Telangana

భారీ వానల్లోనూ మొక్కలకు నీళ్లు పడుతున్న జీహెచ్​ఎంసీ సిబ్బంది..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది వ్యవహార శైలి పలుసార్లు వివాదాస్పదమైంది. ముఖ్యంగా ప్రజా ధనాన్ని జీహెచ్ ఎంసీ దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అందుకు తాజాగా మరో ఉదాహరణ బయట పడింది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా నాలుగైదు రోజుల నుంచి ముసురు కమ్ముకుంది. ఎడతెరిపి లేని వాన కారణంగా పలు కాలనీలో రోడ్లు జలమయం అయ్యాయి. హుస్సేన్ సాగర్ తో పాటు జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, గండిపేట రిజర్వాయర్లు నిండిపోయాయి. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లోనూ జీహెచ్ ఎంసీ సిబ్బంది మొక్కలకు నీళ్లు పోస్తూ తమ పనితనం ఏపాటిదో మరోసారి నిరూపించుకున్నారు. జోరు వానలో ఓ ఫ్లై ఓవర్ పక్కన ఉన్న చెట్లూ, మొక్కలకు నీళ్లు పోస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జీహెఎంసీ వాటర్ ట్యాంక్ తో ఇద్దరు సిబ్బంది చెట్లకు నీళ్లు పడుతుండగా.. ఓ వ్యక్తి వారిని ప్రశ్నించాడు.

ఓ వైపు వర్షం పడుతుండగా నీళ్లు పట్టాల్సిన అవసరం ఏముందని అతను ప్రశ్నించగా.. సిబ్బంది సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఈ వీడియోను పలువురు ప్రముఖ జర్నలిస్టులు సోషల్ మీడియాలో షేర్ చేసి జీహెచ్ఎంసీ తీరును ఆక్షేపించారు. ప్రజాధనం ఇలా దుర్వినియోగం చేస్తున్న జీహెచ్ ఎంసీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది ఎంత పనిమంతులో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనమని అంటున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A RESPONSE