-సిబ్బందితో మాట్లాడిన సీపీ స్టీఫెన్ రవీంద్ర
-గుండె పోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించిన సీపీ
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని శంషాబాద్ జోన్ షాద్ నగర్ డివిజన్ లోని పలు పోలీస్ స్టేషన్లను ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా సీపీ కొత్తూరు, నందిగామ, షాద్ నగర్, కేశంపెట్ పోలీస్ స్టేషన్లను సందర్శించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీపీ వెంట శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, షాద్ నగర్ ఏసీపీ కుషాల్కర్ ఉన్నారు.
ఈ సందర్భంగా సీపీ పోలీసు స్టేషన్ల పరిసరాలను సందర్శించి పోలీసుస్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణపై నిశితంగా పరిశీలించారు. విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర ప్రతీ రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఫంక్షనల్ వర్టీకల్స్ వారీగా సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాల విషయంలో ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటించాలని తెలియజేశారు. శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా విధులుండాలని ఆదేశించారు. పోలీసులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలన్నారు. లా అండ్ ఆర్డర్, నేరాల నివారణ వ్యూహాలపై సీపీ సిబ్బందితో చర్చించారు. ఏదైనా నేరం జరిగినప్పుడు సరైన సమాచారాన్ని, ఆధునికతను ఉపయోగించి నేరస్తులను గుర్తించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలనన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. స్టేషన్ లోని సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. పోలీస్ సిబ్బంది దినచర్యలో వాకింగ్, షటిల్ ఏదైనా మీకిష్టమైన ఒక వ్యాయామాన్ని భాగంగా చేసుకుంటే ఫిట్ గా ఉంటారన్నారు. సమాయనుకూలంగా పోష్టికాహారము తీసుకోవడం, మంచి నిద్ర, వ్యాయామం, యోగా, మేడిటేషన్ తో ఒత్తిడిని జయించవచ్చన్నారు. సిబ్బంది యొక్క ఆరోగ్య సమాచారాన్ని పేరుపేరునా అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, ప్యాట్రోలింగ్లను పెంచాలన్నారు. పోలీస్ స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ట్రాఫిక్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సిబ్బంది సంక్షేమం వంటి విషయాలను నేరుగా సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నేరాల నివారణకు, ట్రాఫిక్ దృష్ట్యా కచ్చితమైన నూతన ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. అలాగే రానున్న రోజుల్లో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో అవసరమున్న ఆఫీసర్స్, కానిస్టేబుళ్లను త్వరలోనే నియమిస్తామని స్పష్టం చేశారు.
అదే విధంగా ట్రాఫిక్ సమస్య తమ దృష్టికి వచ్చిందని, దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. అంతే కాకుండా షాద్‌నగర్ జాతీయ రహదారిపై ప్రమాదాలను అరికట్టడంతో పాటు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఒక సబ్ ఇన్ స్పెక్టర్ ర్యాంక్ అధికారితో బృందాన్ని ఏర్పాటు చేసి హైవే ప్యాట్రోల్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణీకుల భద్రత తో పాటు దారి దోపిడీలను అరికట్టవచ్చన్నారు.
నందిగామ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని పరిశీలించిన సీపీ , త్వరలోనే నూతన భవనం ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటానన్నారు. సీపీ వెంట శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, షాద్ నగర్ ఏసీపీ కుషాల్కర్, షాద్ నగర్ ఇన్ స్పెక్టర్ నవీన్ కుమార్, నందిగామ ఇన్ స్పెక్టర్ రామయ్య, కొత్తూర్ ఎస్ఐ శేఖర్, కేశంపేట్ రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించిన సీపీ
కేశంపేట పోలీస్ స్టేషన్ లో కోర్టు కానిస్టేబుల్ ( షాద్ నగర్ కోర్ట్ లో) గా విధులను నిర్వర్తించే జయప్రకాష్ (42) ఈరోజు గుండెపోటు రావడంతో ప్రాథమిక చికిత్స కోసం కేశంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం షాద్ నగర్ తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ సీపీ కేశంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సీపీ గారు కానిస్టేబుల్ భౌతిక కాయానికి పూలమాలతో నివాళులర్పించారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని అందిజేస్తామన్నారు.