Suryaa.co.in

Andhra Pradesh

జగనన్న విదేశీవిద్యతో మోసం

– గత ప్రభుత్వం మాదిరిగా అమలు చేయాలి
– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.బుచ్చిరాంప్రసాద్

జగనన్న విదేశీవిద్య పథకంతో విద్యార్థులను, యువతను రాష్ట్ర ప్రభుత్వం పచ్చిగా మోసం చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె బుచ్చిరాంప్రసాద్ అన్నారు.

టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..”జగనన్న విదేశీవిద్యపై విడుదల చేసిన జీఓ 39 విద్యార్థులకు నిరుపయోగం. పథకాన్ని అమలు చేయాలనే చిత్తశుద్ధి వైసీపీ ప్రభుత్వానికి లేదు. అందుకే షరతులతో కూడిన జీఓ 39ను విడుదల చేసింది. ఫీజులు కట్టకుండా ఉండేటువంటి యూనివర్శిటీలను ఎంచుకుని, వాటికి టాప్ 100 యూనిర్శిటీలు అని ప్రభుత్వం పేరుపెట్టి విద్యార్థులను, యువతను మోసం చేస్తోంది.

ప్రభుత్వం చెబుతున్న యూనివర్శిటీల్లో 27యూనివర్శిటీలు అమెరికాలో ఉన్నాయి. వాటిలో చదువుకునే విద్యార్థులకు ఆ యూనివర్శిటీలే స్కాలర్ షిప్ అందిస్తాయి. కానీ వీటిలో ఫీజులు మేం కడతామని ప్రభుత్వం అసత్య ప్రచారం చేసుకుంటోంది. మెడిసిన్ చదివేందుకు అత్యధికంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఉక్రెయిన్, చైనా, పిలిప్ఫైన్స్ వెళుతున్నారు. అక్కడి యూనివర్శిటీలకు అమలు చేయకుండా, అతి తక్కువ మంది వెళ్లే యూనివర్శిటీలకు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడం దారుణం.

కేవలం ఉన్నతవర్గాలకు చెందిన వారి పిల్లలు మాత్రమే విదేశాల్లో చదువుతున్నారని, పేద పిల్లలకు విదేశీవిద్య అందని ద్రాక్షాలా ఉండడం గమనించిన చంద్రబాబు విదేశీవిద్యను ప్రారంభించారు. 2014-2019 మధ్య 4,900మంది విద్యార్థులకు విదేశీవిద్యను అందించారు. ఈ విద్యార్థులు తమకు ఇష్టమొచ్చిన యూనివర్శిటీలో, తమకు నచ్చిన కోర్సులను చదివారు. ఒక్కో విద్యార్థికి రూ.15లక్షల నుండి రూ.20లక్షలు వరకు ఖర్చు చేశారు. ఒక కుటుంబంలో ఒక్కరికే విదేశీవిద్య అని వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో పేర్కొంది.

కానీ టీడీపీ హయాంలో కుటుంబలో ఎంత మంది చదువుకుంటే అంతమందికి పథకాన్ని అందించాం. వైసీపీ ప్రభుత్వానికి విదేశీవిద్యను అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వంలో అమలైన విధంగా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు ఉన్న పెండింగ్ బకాయిలు చెల్లించాలి. చెల్లించని పక్షంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక పెండింగ్ బకాయిలు చెల్లిస్తాం”అన్నారు.

LEAVE A RESPONSE