– మోదీ సర్కారును సాగనంపాల్సిందే
– ధనికులకే తప్ప పేదలకు స్థానం లేదా?
సామాన్య ప్రజలపై మోయలేని పన్నుల భారాన్ని వేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంను గద్దె దింపేందుకు ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో పాటు ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు కూడ రూపొందించుకొని, ఇప్పటి నుండే ప్రజా క్షేత్రం లోనికి దుమికి కృషి చేయవలసిన అవసరం ఎంతో వుంది. పెట్రోలు, డీజెల్, వంటగ్యాస్ ధరలను అడ్డగోలుగా పెంచడమేకాక తాజాగా బియ్యం, గోధుమలు, పాలు ,పెరుగు కూరగాయలు, సేంద్రియ బియ్యం మున్నగు వాటిపైన 5 శాతం జి.యస్.టి విధించేందుకు నిర్ణయం తీసుకోవడం కడు దుర్మార్గం.
సి.బి.ఐ ,ఐ.టి ,మున్నగు శాఖల అధికారాలను దుర్వినియోగం చేస్తూ ప్రైవేటు రంగం లోని వేలాది కోట్ల విలువైన ఎయిర్ పోర్టు లు ,నౌకాశ్రయాలు ,గనులు ,విద్యుత్ సంస్థలు మున్నగు వాటిని గౌతం అదానికి కట్టబెట్టడమేకాక.లాభాల తో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా, కారుచౌకగా ఎంతమాత్రం బిడియం లేకుండా కట్టబెడుతూ వుంది. గత ఎనిమిది సంవత్సరాలలో బడా కార్పొరేట్ సంస్థల బ్యాంక్ బకాయిలు రూ.10.50 లక్షల మేరకు రద్దు చేసింది.
చిన్న, మద్యతరహా పరిశ్రమలకు సకాలంలో సరిపడ రుణాలు అందించకుండా ,రుణవసూలులో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న వాణిజ్య బ్యాంకులు తామే ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులని పేర్కొన్న కార్పరేట్ సంస్థల రూ. 56,000 కోట్ల బాకీలను రద్దు కావించాయి.వీటన్నింటిని ఆమోదించిన మోడీ ఇటీవల పేదలకు ఉచిత పధకాలు అమలు చేయడం తప్పని,ఎన్నికల హామీలు ఇవ్వరాదని సెలవిచ్చారు.
స్వతంత్ర భారత చరిత్రలోనే ఇంత దుర్మార్గంగా పేదల నోట్లో మన్ను కొడుతూ అత్యంత ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి దోహదపడుతున్న నరేంద్రమోదీ ప్రభుత్వంను గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైంది. 2024లో మోడీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, మన దేశంలో కూడా రష్యాలో వలె ఏకపక్ష నియంతృత్వం ,జీవితకాలం మోడీ-అమిత్ షాల పాలనకు దారితీస్తుంది.
ఎందరో మహానుభావుల ఎనలేని త్యాగాల ఫలితంగా సాధించుకొన్న స్వేచ్ఛ-స్వాతంత్ర్యాలు ,భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాధమిక హక్కులు-ఆదేశిక సూత్రాలు, కోల్పోవలసివుంటుంది.మన దేశంలో అత్యధిక కాలం అధికారంలో వున్న కాంగ్రెసు పాలనలో కొందరు నాయకులు చేసిన అవినీతి వలన ఆ పార్టీ కి చెడ్డపేరు వచ్చింది. ఇప్పుడు బిజెపి పాలనలో అంతకు మించిన అవినీతి జరుగుతూవుంది.అంతే కాక స్వయాన ప్రధాని, హొం మంత్రి గౌతం అదానిని ప్రపంచంలో ప్రధమ కుబేరునిగా తయారు చేయు పనిలో ఉన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఆహార భద్రతా చట్టం, జాతీయ ఉపాధి హామీ చట్టం, వినియోగదారుల చట్టం,2013 భూసేకరణ చట్టం, సమాచార హక్కు చట్టం మునగు ప్రజోపయోగ చట్టాలు చేయబడ్డాయి. కానీ ఈరోజు నాయకత్వ లేమితో కాంగ్రెస్ సరిగ్గా సమర్ధ ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతూ వుంది. అందువలన భావసారూప్యత వున్న ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి సామాన్య ప్రజలు, రైతులు, కార్మికుల ఉమ్మడి ప్రయోజనాలు కాపాడేందుకు ,భారత రాజ్యాంగం లో పేర్కొనబడిన అంశాలకు కట్టుబడి వుండెదమన్న హామీతో ప్రజల ముందుకు రావలసిన సమయం ఆసన్నమైంది.
బియ్యం, గోధుమలు మున్నగు నిత్యా వసరాలపై విధించిన 5 శాతం జి.యస్.టి ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా మొన్న16వ తేదీన రైస్ మిల్లులు మూతపడ్డాయి. మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఇకనుండైనా మన రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలి. కార్యకర్తలు నాయకత్వంపై ఒత్తిడి తేవాలి.

(మాజీ మంత్రి)