Suryaa.co.in

Andhra Pradesh

బ్రాహ్మణ పురోహిత సమాఖ్య పరీక్షలతో దేవదాయ శాఖకు ఎటువంటి సంబంధం లేదు

-ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ పురోహిత సమాఖ్య నిర్వహించనున్న పరీక్షలతోదేవదాయ శాఖకు ఎటువంటి సంబంధం లేదు
– దేవదాయశాఖ కమీషనర్ వివరణ

ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ జూలై 24, 25వ తేదీలలో నిర్వహించనున్న పరీక్షలకు, వారిచ్చే సర్టిఫికెట్లకు ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖతో ఎటువంటి సంబంధమూ లేదు. దేవదాయ శాఖ వారి సహకారంతో, అనుమతితో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆ ప్రైవేట్ సంస్థ చేసుకుంటున్నప్రచారం గానీ, తదనుగుణంగా మీడియాలో వస్తున్న వార్తలు గాని పూర్తి అవాస్తవం. దీనిని దేవదాయ శాఖ నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది.

21-03-2022వ తేదీన బ్రాహ్మణ పురోహితసమాఖ్య ఓ ప్రైవేట్ సంస్థకు తాను అధ్యక్షుడు అని చెబుతూ వై. నరసింహమూర్తి, భీమవరం వారు దేవదాయ శాఖకు ఒక అభ్యర్థన సమర్పించి యున్నారు. తమ సమాఖ్య ఆధ్వర్యంలోపురోహిత పరీక్షల కోసం సిలబస్ తయారు చేశామని, జూలైలో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తామని, కావున వారు నిర్వహించే పురోహిత పరీక్షల సిలబస్ ని , వారుజారీ చేసే సర్టిఫికెట్లను దేవదాయ శాఖ వారు గుర్తించాలని వారి అభ్యర్థన సారాంశం.

అయితే దేవదాయ శాఖలోని ఏ దేవాలయం లో కూడా పురోహిత పోస్టులు లేవని, కేవలం అర్చకులు, వేదపండితుల పోస్టులు మాత్రమే ఉంటాయని, దేవాలయంలో స్వామివారి ఎదుట లోకహితం కోసమే చేసే పూజలకే దేవదాయ శాఖ పరీక్షలు నిర్వహిస్తుందని, అంతేకాని పూర్తిగా వ్యక్తిగతమైన పితృకర్మలు, ఇంటి వద్ద చేసుకునే కర్మలకు సంబంధించి దేవదాయ శాఖ పరీక్షలు నిర్వహింపదని , ఈ రకముగా పరీక్షల నిర్వహణ దక్షిణ భారత దేశంలో ఏ రాష్ట్రములోనూ లేదని, అందువల్ల సదరు ప్రైవేట్ సంస్థ వారి ఇష్టానుసారం రూపొందించుకున్న సిలబస్, పరీక్షలు, జారీ చేసే సర్టిఫికెట్లను దేవదాయ శాఖ గుర్తించే ప్రసక్తే లేదని సదరు ప్రతిపాదనను తిరస్కరిస్తూ 06-07-2022న ఈ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

వాస్తవం ఏమిటంటే పురోహితులు అనేవారు పితృకర్మలు జరిపించడం, ఇళ్లలో జరిగే క్రతువులు నిర్వహించడం, కళ్యాణ మండపాలలో జరిపేపూజలు,నది ఒడ్డున జరిగే పిండ ప్రదానాలు, మొదలైనవి వృత్తి ప్రధానంగా కలిగి ఉంటారు. వీరు దేవదాయ రూల్స్ ప్రకారం ‘ ఉల్తురాయి / ఆధ్యాత్మక సేవకుల’ కిందకి రారు. కావున దేవదాయ శాఖకు ఎటువంటి సంబంధం లేని పురోహిత పరీక్షల నిర్వహణ, సిలబస్ మరియు సర్టిఫికెట్ల గుర్తింపు అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ కారణం చేత ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య అభ్యర్థనను దేవాదాయ శాఖ తిరస్కరించడం జరిగింది.

ఎవరైనా దేవదాయ శాఖ పేరుచెప్పి డబ్బులు వసూలు చేయప్రయత్నం చేస్తే వారిపై నేరుగా పోలీసు ఫిర్యాదు జారీ చేయవలసినదిగా సదరు వ్యక్తులకు తెలియజేయడమైనది. ఈ వివరణకుప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మిత్రులువిస్తృత ప్రచారం కల్పించి అసత్యాలు, అర్థసత్యాలతో కూడిన ప్రచారానికిముగింపు పలకాలని మనవి.

LEAVE A RESPONSE