Suryaa.co.in

Andhra Pradesh

ఏకలవ్య స్కూళ్ళలో వంద శాతం పాస్

-రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

ఆంధ్రప్రదేశ్‌లోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ళలో 2020-21 విద్యా సంవత్సరంలో పది, పన్నెండో తరగతి విద్యార్ధులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్‌ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో అడ్డతీగల, రంపచోడవరంలో కొత్తగా ఏర్పాటు చేసిన వాటితో సహా మొత్తం 28 ఏకలవ్య పాఠశాలలు ఉన్నట్లు తెలిపారు.

2019-20 విద్యాసంవత్సరంలో ఏకలవ్య సూళ్ళ నుంచి ఉత్తీర్ణులైన వారిలో 64 శాతం మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌, 7 శాతం ఇంజనీరింగ్‌, 1.6 శాతం మెడికల్‌, 9 శాతం మెడికల్‌ సంబంధిత సర్వీసులు, 6 శాతం ఇతర వృత్తి విద్యా కోర్సులలో చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని పేర్కొన్నారు. ఏకలవ్య విద్యార్ధులకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించేందుకు నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (ఎన్‌ఈఎస్‌టీఎస్‌) మేనేజీరియల్‌ ఇన్ఫర్మేషన్‌ వ్యవస్థను అభివృద్ది చేసినట్లు మంత్రి తెలిపారు.

గిరిజన మంత్రిత్వ శాఖ, ఫేస్‌ బుక్‌ సంయుక్తంగా గోల్‌ (గోయింగ్‌ ఆన్‌లైన్‌ యాజ్‌ లీడర్స్‌) అనే వినూత్న కార్యక్రమం ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజన యువత, మహిళలు డిజిటల్‌ ప్రక్రియలో సాధికారిత సాధించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఆన్‌లైన్‌ శిక్షణా విధానాల ద్వారా గిరిజన యువతీయువకులలో డిజిటల్‌ లిటరసీ, లైఫ్‌ స్కిల్స్‌పై శిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం గోల్‌ ఉద్దేశంగా మంత్రి పేర్కొన్నారు.

ఏపీలో ప్యాక్స్‌ కంప్యూటరీకరణ
వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లోని 1922 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరీకరణ చేయనున్నట్లు సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. రాజ్యసభలో బుధవారం విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. కంప్యూటరీకరణ ద్వారా దేశంలోని 63 వేల ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాల సామర్థ్యాన్ని పెంపొందించి, వివిధ రకాల సేవలు అందుబాటులోకి తేవడం, పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం కంప్యూటరైజేషన్‌ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. రాష్ట్ర సహకార బ్యాంక్‌ల జాతీయ సమాఖ్య (నాప్స్‌కాబ్‌) లెక్కల ప్రకారం 2019-20 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 1,992 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వాటిలో 1922 సంఘాలలో ఇప్పటికే నాబార్డ్ సర్వే చేసింది. ఈ మొత్తం సంఘాలలో ఎన్నింటిని కంప్యూటరీకరణ చేయాలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.

LEAVE A RESPONSE