తెలంగాణ-ఆంధ్రా తమలపాకు తమాషా యుద్ధం
(మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణలో భారీ వరదలకు కారణం క్లౌడ్‌బరస్ట్ చేయడమే. ఇందులో విదేశీ కుట్ర ఉంది.
– తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణలో వదరలకు పోలవరం ఎత్తు పెంచడమే కారణం. తక్షణం ఆ 7 మండలాలు తిరిగి తెలంగాణలో విలీనం చేయాలి.
– తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్
ఇంతకూ వరదలకు కారణం కేసీఆర్ చెప్పినట్లు క్లౌడ్‌బరస్ట్ చేసిన విదేశీ కుట్రనా? లేక మంత్రి అజయ్ చెప్పినట్లు పోలవరం ఎత్తు పెంచడమా తేల్చాలి. ఇదంతా కాళేశ్వరం పంప్ హౌస్ మునకలో తన వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ఆడుతున్న డ్రామా.
– టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి
మరి పోలవరం ఎత్తు పెంచుతుంటే ఇంతకాలం కేసీఆర్ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా? కేసీఆర్ తన వైఫల్యాలను పక్కదారి పట్టించే రాజకీయ ఎత్తుగడ. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం కప్పిపుచ్చుకునే కుట్ర.
– తెలంగాణ సీఎల్పీ చీఫ్ భట్టి విక్రమార్క
హైదరాబాద్ లేకపోవడంతో మేం ఆదాయం కోల్పోయాం. కాబట్టి మాకు మళ్లీ హైదరాబాద్ రాజధాని కావాలని అడగగలం. ఏపీని తెలంగాణలో కలపాలని మేం డిమాండ్ చేస్తే ఎలా ఉంటుంది? విలీన గ్రామాల విలీన ప్రతిపాదన తెస్తే ఏపీలో హైదరాబాద్‌ను కలిపేయాలని డిమాండ్ చేస్తాం.
– ఏపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ
గతంలో భద్రాచలం మునగలేదా? పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర, ఎప్పుడో క్లియరెన్సు ఇచ్చింది. భద్రాచలం మాదంటే మీరు ఇచ్చేస్తారా?
– ఏపీ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు
రాష్ట్ర విభజన జరిగిన ఇన్నేళ్ల తర్వాత పోలవరం ఎత్తు గురించి మాట్లాడని టీఆర్‌ఎస్ ఇప్పుడే దాని గురించి ఎందుకు మాట్లాడుతోంది? రాష్ట్ర విభజన అంశంలో పోలవరం అంశం, 7 మండలాల విలీనం ఉన్నప్పుడు కేసీఆర్ ఎంపీగానే ఉన్నారు కదా? మళ్లీ ఇప్పుడు తెలంగాణ మంత్రి అజయ్ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
– టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు
పోలవరంను ప్రశ్నిస్తే తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లే. రాష్ట్ర విభజన అంశాన్ని తిరగతోడినట్లే
– ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు
ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తోంది? పోలవరం కేంద్రంగా మళ్లీ ఆంధ్రా-తెలంగాణ మధ్య పంచాయతీ మొదలవుతుంది. రెండు ప్రభుత్వాలు సీరియస్‌గా ఈ అంశాన్ని రచ్చ చేస్తాయి. దానివల్ల మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత మొదలవుతాయనిపిస్తుంది కదా? యస్. రోజూ మీడియాను ఫాలో అయ్యే వారికి, టీవీలు చూసేవారికెవరికయినా ఇలాంటి డౌటనుమానాలే వస్తాయి. టీఆర్‌ఎస్-వైసీపీ లక్ష్యం కూడా అదే. ఎందుకంటారా? రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీల సంకట పరిస్థితి అది. మరి వాటి నుంచి జనం దృష్టి మళ్లించాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇలాంటి పసలేని అంశాలు తెరపైకి తీసుకురావాలి. దానిపై కొద్దిరోజులు చర్చ జరగాలి. ఈలోగా తమ రాష్ట్రాల వైఫల్యాన్ని జనం మర్చిపోవాలి. తర్వాత పోలవరంపై గప్‌చుప్ అయిపోవాలి. ఇద్దరికీ కామన్ స్ట్రాటజిస్టు పీకే పహిల్వానే కాబట్టి కారణం సింపుల్. అదే రెండు పార్టీల అసలు లక్ష్యమన్నది బుద్ధిజీవుల విశ్లేషణ. అదెలాగో మీరే చూడండి.
తెలంగాణలో కేసీఆర్ స్వకపోతం నుంచి ఉద్బవించిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్ భారీ వరదకల్లో మునిగింది. దాని ఖర్చు కోట్లపైనే. ఇంజనీర్ అవతారమెత్తిన కేసీఆర్, పంప్‌హౌస్ మునగకుండా ఎందుకు డిజైన్ చేయలేకపోయారని విపక్షాలు నలుచెరుగులా దాడి చేస్తున్నాయి. అంతకుమించి.. భారీవరదలకు విదేశీ కుట్ర అని చెప్పి అభాసుపాలయిన తమ అధినేత వ్యాఖ్యలు, క్షేత్రస్థాయిలో చర్చనీయాంశం కాకుండా ఉండేందుకే అజయ్‌బాబు, కొత్తగా పోలవరం ఆటను ఆరంభించారంటున్నారు.
అటు ఏపీలో జగనన్న సర్కారు ముందుచూపు లోపం వల్లే, వరదల్లో భారీ నష్టం జరిగిందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. జులైలో భారీ వర్షాలు వస్తాయని అంచనా వేయకపోవడం వల్లే, ఇంత నష్టం జరిగిందంటూ ఎత్తిపొడుస్తున్నాయి. పైగా రోడ్లు మొత్తం కొట్టుకుపోయాయంటూ, జనసేన ‘గుడ్‌పమార్నింగ్ సీఎం’ అంటూ సోషల్‌మీడియా ఉద్యమం ప్రారంభించింది. దీనితో రెండు పార్టీలు సొంత రాష్ట్రాల్లో విపక్షాల విమర్శనాస్త్రాలకు క్షతగాత్రులవుతున్నాయి.
దానిని కొత్తమార్గం పట్టించేందుకు తెలంగాణ మంత్రి పువ్వాడ్ అజయ్ కొత్త ‘ఎత్తు’గడ వేశారని, అందులో భాగంగానే పోలవరం ఎత్తు పెంచడం వల్లే తెలంగాణకు నష్టం జరుగుతోందన్న కొత్త వాదన తెరపైకి తెచ్చారన్నది బుద్ధిజీవుల విశ్లేషణ. దానిని అందిపుచ్చుకున్న ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు మళ్లీ హైదరాబాద్ రాజధాని అంశాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారన్నది మరో విశ్లేషణ.
కావచ్చు. దానిని తప్పుపట్టలేం. కాదని తోసిపుచ్చలేం. ఎవరి రాజకీయ మనుగడ వారిది. భారీ వరదలకు విదేశీ కుట్ర అని ఆరోపించిన సీఎం కేసీఆర్.. స్వయంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధారాలివ్వాలని కోరినా, ఇప్పటిదాకా ఇవ్వలేదు. దానితో విపక్షాలు కేసీఆర్‌ను ఎద్దేవా చేయడం, సోషల్‌మీడియాలో వ్యంగాస్త్రాలు సంధిండం ప్రారంభించాయి. సహజంగా కేసీఆర్ వ్యాఖ్యలు ఒకట్రెండు రోజులే చర్చనీయాంశమవుతుంటాయి. కానీ ఈసారి కౌడ్‌బరస్ట్, విదేశీ కుట్రపై చేసిన వ్యాఖ్యలపై చర్చలు మాత్రం ఇంకా కొనసాగుతున్న ప్రజాక్షేత్రంలో హల్‌చల్ చేస్తున్నాయి.
నిజానికి రాష్ట్రవిభజన జరిగిన ఇన్నేళ్ల తర్వాత పోలవరం ఎత్తుపై ఎప్పుడూ రగడ జరిగింది లేదు. ప్రారంభంలో 7 మండలాలను ఏపీలో విలీనం చేయడంపైనే కొంత రాజకీయ రగడ జరిగిందే తప్ప, పోలవరం ఎత్తు గురించి తెలంగాణలోని ఏ రాజకీయ పార్టీ ప్రస్తావించిన దాఖలాలు లేవు. 7 మండలాలు విలీనం చేస్తే ఎంపీగా ఉన్న కేసీఆర్ ఏం చేస్తున్నారంటూ ఆనాడు విపక్షాలు విరుచుకుపడ్డాయే తప్ప, పోలవరం ఎత్తు గురించి ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత టీఆర్‌ఎస్ మంత్రులకు జ్ఞానోదయం రావడమే విచిత్రమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పోలవరం ఎత్తుపై టీఆర్‌ఎస్, వైసీపీ మాటల యుద్ధం ఒకరోజు విశ్రాంతి తీసుకున్న సమయంలో, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దానిని మళ్లీ తెరపైకి తెచ్చారు. పోలవరం గురించి మాట్లాడటమంటే, విభజనను ప్రశ్నించడమేనన్న కొత్త వాదనను తెరపైకి తెచ్చి, మరికొంత అగ్గిరాజేశారు. అంటే ఈ తమలపాకు యుద్ధంలో టీఆర్‌ఎస్-వైసీపీతో పాటు, తమకూ లబ్థి కలగాలన్న ఆశ వీర్రాజు వ్యాఖ్యలో కనిపిస్తోంది. మరి సోము వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. అసలు పోలవరంపై తలెత్తిన కొత్త వివాదంపై, ఇప్పటివరకూ తెలంగాణ బీజేపీ నేతలు పెద్దగా స్పందించింది లేదు.
గతంలో కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబర్ 203పై తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇలాగే కొద్దిరోజులు వివాదం సృష్టించాయి. వైసీపీ సీమ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆవేశపడటం, వారిపై మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురుదాడి చేయటంతో ఏదో జరుగుతుందన్న భ్రమలు కల్పించారు. జనం కూడా వారిద్దరి యుద్ధం నిజమేకామోసని అమాయకంగా నమ్మేశారు. తర్వాత ఆ అంశం హటాత్తుగా తెరమరుగయింది. ఆ తర్వాతనే ఏపీ సీఎం జగనన్న, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి భోజనం చేశారు కూడా. అమాయక జనాలకు చాలాకాలం తర్వాతగానీ అర్ధం కాలేదు. అది తమలపాకు యుద్ధమని!
ఎందుకంటే.. హైదరాబాద్‌లో ఉంటున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు, టీడీపీ సోషల్‌మీడియా యాక్టివిస్టులను, ఆంధ్రా పోలీసులు ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఎత్తుకెళుతూనే ఉన్నారు. అంటే టీఆర్‌ఎస్-వైసీపీలు ఆరకంగా ముందుకువెళుతున్నారని బుర్రలో గుజ్జున్న ఎవరికయినా సులభంగా అర్ధమవుతుంది. ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన పోలవరం ఎత్తు కథ కూడా.. శ్రీశైలం ప్రాజెక్టు వివాదం మాదిరిగానే, ‘ఇరు పార్టీల అవసరం తీరిన తర్వాత’, దానంతట అదే సమసిపోతుందన్నది రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య.
అయితే.. ఏ రాజకీయ పార్టీల ‘ఎత్తు’ ఎలా ఉన్నా.. ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు, అనుభవాల దృష్ట్యా.. ఇరు రాష్ట్రాల ప్రజలు గతంలో మాదిరిగా, రాజకీయ ఎత్తుగడలు నమ్మే పరిస్థితిలో లేరన్నది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. ఒక సినిమా సక్సెస్ అయితే తర్వాత వచ్చే సినిమాలన్నీ అదే పార్ములాతో వచ్చినా, అవి ఎలా సక్సెస్ కాలేవో.. రాజకీయాల్లో ఒకసారి పనిచేసిన ఫార్ములా మళ్లీ అక్కరకు రావంటున్నారు. పోలవరం ఎత్తు రగడతో ఇరు ప్రాంతాల ప్రజలు భావోద్వేగంతో స్పందిస్తే, అప్పుడు రెండు రాష్ట్రాల్లో తామే హీరోలు కావాలన్న పార్టీల పాత వ్యూహం ఇప్పుడు పనికిరావంటున్నారు. కాకపోతే ఇవన్నీ కొద్దిరోజులు టీవీ డిబేట్లకు, పత్రికల్లో కథనాల కాలక్షేపానికే పనికివస్తాయన్నది బుద్ధిజీవుల ఉవాచ. నిజమేనంటారా?