Suryaa.co.in

Editorial

దొరకునా ఇటువంటి సేవ?

– ఏపీలో ముర్ము మేడమ్ గెలిచిందెట్టిదనిన..
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ
సోపాన మధిరోహరణము సేయు త్రోవ
రాగాలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
నాదాత్మకుడవై.. నాలోన చెలగి
నాప్రాణ దీపమై నాలోన వెలిగే
నినుకొల్చు వేళ దేవాదిదేవా’’
‘శంకరాభరణం’ సినిమాలో జెవి సోమయాజులు భక్తితో, తాదాత్మ్యంతో భగవంతుడిని స్మరిస్తూ ఆర్తిగా ఆలపించిన గీతమిది. గుర్తుందా?

అలాంటిదే మరొకటి…
‘‘ఆనతినీయరా.. హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా
సన్నిధి జేరగా
నీ ఆన లేనిదే రచింపజాలున వేదాలవాణితో విరించి
విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా ఆ యోగమాయతో మురారి
దివ్యపాలనం
వసుమతిలో ప్రతిక్షణం పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివా’’
‘స్వాతికిరణం’ సినిమాలో మంజునాధ్ నాయకర్.. శివుడిని ఆర్తితో కీర్తిస్తూ, గురుకృప కోసం ప్రార్ధిస్తూ ఆలపించిన గానమిది.
శంకరాభరణం, స్వాతికిరణం రెండు సినిమా కథలు వేరేయినప్పటికీ, దర్శకుడు మాత్రం కె.విశ్వనాధ్.
* * *
ఎప్పుడో 30, 40 ఏళ్ల క్రితం నాటి సిన్మా పాటలు ఇప్పుడెందుకు పాడుతున్నట్లు? అసలు ఏ సమయం-సందర్భం ఏడ్చిందని, ఈ పాట కచేరి? ఓవైపు రాష్ట్రపతిగా ముర్ము మేడమ్ బంపర్ మెజారిటీతో గెలిచి, దేశమంతా పటాసులు పేల్చుకుంటుంటే.. దొరకునా ఇటువంటి సేవంటూ ఈ ఈ-సేవా ప్రోగ్రామేంటి? ఈ వర్షాకాలం సీజన్‌లో, అంతకుమించి.. క్లౌడ్ బరస్ట్ కాలంలో ఈ శివానందలహరి ఏమిటనే కదా చిరాకు? సరే.. సూటిగా పాయింటులోకి వచ్చేద్దాం. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము మేడం బంపర్ మెజారిటీతో అంటే.. అద్భుత: అద్భుతస్య, అద్భుతోస్య లెవల్లో అన్నమాట. ఇది పెద్ద వార్తనా? అహ ఇది పెద్ద వార్తనా అంట.
యస్. కానే కాదు.

ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఉప్పు-నిప్పుగా ఉండే రెండు పార్టీలు, కూడబలుక్కున్నట్లు.. భాజపా నిలబెట్టిన అభ్యర్ధిని.. భక్తితో, అనురక్తితో, అచంచల విశ్వాసంతో, అకుంఠిత ప్రేమతో ఒక్క ఓటు కూడా పొల్లుపోకుండా ఓటేసి గెలిపించారే… అది కదా వార్తంటే! అది కదా అద్భుతమంటే!!

పోనీ ఆంధ్రాలోని అధికార వైకాపా, విపక్ష తెదేపా ఏమైనా భాజపాకు వేలు, కాలు విడిచిన రాజకీయ మేనమామలా? క్యాబేజీ, కందగడ్డ లాంటి కజిన్ బ్రదర్సా? కానేకాదు. పోనీ ఏమైనా బయటనుంచి మద్దతునిచ్చే అధికార మిత్రపక్షాలా? అదీ కాదు. అదీకాకపోతే ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలా? కాదంటే కాదు. మరి ఎందుకలాగ?

ఇద్దరూ పోటీలు పడి.. మోదీజీ గారిని ఆర్తితో, ఆర్ధ్రతతో కీర్తిస్తూ ఆయన నిలబెట్టిన ముర్ము మేడమ్‌ను గెలిపించింది ఎందుకు? అసలు ఇది ఎవరి గొప్పతనం? ఒక్క ఓటు కూడా పొల్లు పోకుండా ఓట్లేసినmurmuవైకాపా-తెదేపాదా? ఓట్లు వేయించుకున్న భాజపాదా?.. ఖచ్చితంగా ఓట్లు వేయించుకున్న భాజపాదే. అవును. నిస్సందేహంగా ఆ క్రెడిట్ అంతా భాజపా ఖాతాలోకే వెళుతుంది.

ఎందుకంటే..
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు పొమ్మని కేంద్రంలోని భాజపా సర్కారు నిర్మొహమాటంగా చెప్పేసింది. పోలవరం ప్రాజెక్టుకు రావసిన బకాయిలపై మెట్టుదిగేది లేదని తెగేసి చెప్పింది. విభజన హామీల సంగతి గుర్తు చేస్తే, ఆ ఊసే ఎత్తొద్దని కన్నెర్ర చేసింది. లోటు సంగతి అడిగితే ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని గుడ్లురిమింది. రైల్వే పెండింగ్ ప్రాజెక్టులడిగితే ఇచ్చింది తీస్కోండని నోరుమూసేసింది. మరి కనీసం తెలంగాణతో పంచాయతీనయినా తేల్చండని అడిగితే, అది మీరూ మీరూ మాట్లాడుకోండని ఉచిత సలహా పారేసింది. జగనన్న ఢిల్లీకి పోయినప్పుడల్లా చాంతాండంత రాసిన ఉత్తరాలు ఇస్తే, వాటితో చలికాచుకుంది. పార్లమెంటులో అడక్కుండానే అన్ని బిల్లులకూ జై కొడుతున్నాం కదా అని అంటే, అది మీ అవసరం అని లెక్కలేనితనంగా జవాబిస్తోంది. అప్పులడిగితే, ‘అవసరమైనప్పుడు ఇస్తున్నాంగా అవే తీసుకోండి. మీ పక్క తెలంగాణకు అది కూడా ఇవ్వడం లేదు. సంతోషించండ’ని కట్ చేస్తోంది.
అయినా…మరి వైకాపా ఎందుకు బీజేపీ అభ్యర్ధి ముర్ముమేడమ్‌కు మద్దతునిచ్చింది?

గత ఎన్నికల్లో తనపై కాలుదువ్విన పాపానికి టీడీపీని లేవనంతగా దారుణంగా శిక్షించింది. ఇంతవరకూ మోదీ అపాయింట్‌మెంట్ లేదు. పార్లమెంటులో అన్ని బిల్లులకు అడక్కుండానే మద్దతునిస్తున్నా, రాష్ట్రంలో వైకాపాకు అపరిమిత సేవ చేస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా మోదీ ఘనతను కొనియాడుతున్నా దేకే దిక్కులేదు. కేంద్రం గ్యాస్, పెట్రోల్ రేట్లు పెంచినా మాట్లాడటం లేదు. అసలు టీడీపీ వైపు చూడ్డానికే అన్ని అంగుళాల చాతీ ఉన్న పెద్దాయన ఇష్టపడటం లేదు.అయినా..
మరి టీడీపీ కూడా భాజపా అభ్యర్ధికి ఎందుకు మద్దతునిచ్చినట్లు?

ఇవన్నీ భేతాళ ప్రశ్నలేవీ కాదు. వాటికి విక్రమార్కుడే సమాధానం చెప్పనక్కర్లేదు. బుర్రలో కొంచెం గుజ్జుంటే చాలు.
ఈడీ, సీబీఐ, ఐటి వంటి సంస్థలున్నంతకాలం.. గతంలో జగనన్న మాటల్లో చెప్పాలంటే, అవి కేంద్ర పంజరంలో చిలకగా ఉన్నంతకాలం.. ఇంకొన్ని పేరుగొప్ప రాజ్యాంగబద్ధ సంస్థలు, కేంద్రం గుప్పిటలో ఉన్నంతకాలం.. ప్రాంతీయ పార్టీలు తమ ఉనికి కోసం, దొడ్డిదారిలో డబ్బులు పోగేసుకోనంతకాలం.. కేంద్రంలో ఉన్న పార్టీతో దోస్తీ కట్టనంతకాలం.. కేంద్రాన్ని ప్రశ్నించనంతకాలం.. ఇలాంటి లొంగుబాటు రాజకీయాలు విజయవంతంగా కొనసాగుతూనే ఉంటాయన్నది పెద్దలమాట. మరి పెద్దల మాట చద్దన్నం మూట కదా?!

మరి రాష్ట్రంలో సీబీఐ కేసులను చూసి నత్తలు కూడా ఎందుకు నవ్వుకుంటున్నాయ్? కీలక కేసులు తెలుగు టీవీ సీరియల్ జీడిపాకం మాదిరిగా ఎందుకు కొన‘సాగుతున్నాయ్’? సీఎస్‌లకు కావలసినప్పుడల్లా ఎందుకు పొడిగింపులు వస్తున్నాయ్? అన్న లేనిపోని లాజిక్కులకు మాత్రం విక్రమార్కుడే సమాధానం చెప్పాలి.
అప్పటి వరకూ..
‘‘దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ
సోపాన మధిరోహరణము సేయు త్రోవ’’ అంటూ భక్తితో, అనురక్తితో మోదీగానం ఆలపించడమే. ఇప్పుడు అర్ధమయిందా?.. ఏపీలో ముర్ము మేడమ్‌కు గంపగుత్తగా ఓట్లన్నీ ఎందుకు వచ్చాయో?!

LEAVE A RESPONSE