కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్పకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. భూ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అవినీతి కేసులో యెడ్డీపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసేందుకు 2020లో కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ఆ సందర్భంగా హైకోర్టు జడ్జి జాన్ మైఖేల్ మాట్లాడుతూ, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసు విచారణలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2013లో యెడియూరప్పపై ఈ కేసు నమోదయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెల్లందూర్, దేవరబీసనహల్లి తదితర ప్రాంతాల్లో ఐటీ పార్క్ కోసం 400 ఎకరాల స్థలాన్ని సేకరించారు. అయితే ఈ భూమిలో కొన్ని భాగాలను ప్రైవేట్ ఓనర్లకు యెడ్డీ కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనపై అవినీతి ఆరోపణలతో కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టవద్దని ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశించడంతో 79 ఏళ్ల యడ్యూరప్పకు ఊరట లభించినట్టయింది.