Suryaa.co.in

Andhra Pradesh

వైసిపి కార్పొరేటర్‌ వేధింపులకు దళిత మహిళ ఆత్మహత్యాయత్నం

– ఇష్టారాజ్యంగా వేధింపులకు గురిచేస్తే కోర్టుకీడుస్తాం: వర్ల రామయ్య హెచ్చరిక

అనంతపురం పట్టణం 5వ డివిజన్‌ (ఖాజానగర్‌)లో సుజాత (ఎస్సి- మాదిగ) 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. వీరు నివాసం ఉంటున్న ఇంటికి మున్సిపాలిటీ పట్టా కూడా ఇవ్వడం జరిగింది. 5వ డివిజన్‌లో టిడిపి ఎస్సీ విభాగంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సుజాతపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా వైసిపి కార్పొరేటర్‌ జయలలిత సోదరుడు పవన్‌ కుమార్‌ రెడ్డి ఒత్తిడి మేరకు సుజాత ఇంటిని కూల్చేందుకు సచివాలయ సిబ్బంది పూనుకోవడం జరిగింది.

దీనిలో భాగంగా సుజాత నివాసం వెనుక డ్రైనేజి ప్రధాన కాలువ ఉండటంతో డ్రైనేజి కాలువను ఉదేశ్యపూర్వకంగా సుజాత ఇంటిలో నుంచి డ్రైనేజి కాలువను కలుపుతామని, ఇంటిని ఖాళీ చేయాలని సచివాలయ సిబ్బందితో ఒత్తిడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 25-07-2022న వైసిపి కార్పొరేటర్‌ జయలలిత సోదరుడు పవన్‌ కుమార్‌ రెడ్డి, స్ధానిక వైసిపి నాయకురాలు భారతి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు సుజాత ఇంటికి వెళ్లి ఇల్లు ఖాళీ చేయాలని గొడవకు దిగడం జరిగింది. సుజాత ఒప్పుకోకపోవడంతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో సుజాత చెయ్యి చూపుడు వేలు విరగ్గొట్టారు.

వైసిపి నాయకుల దాడితో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం జరిగింది. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సుజాత పరిస్థితి విషమంగా ఉంది. సుజాత చేసిన ఫిర్యాదులో వైసిపి కార్పొరేటర్‌ జయలలిత పేరు తొలగించాలని స్థానిక సిఐ సుజాత కుమారుడిపై ఒత్తిడి చేస్తున్నారు.

ఇష్టారాజ్యంగా వేధిస్తే కోర్టుకీడుస్తాం
రాష్ట్రంలో ఎవరినైనా వైసిపి నేతల అండ చూసుకొని అధికారులు దళితులపై ఇష్టారాజ్యంగా వేధింపులకు పాల్పడితే వారిని కోర్టుబోను నిలబెట్టి తీరుతామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య హెచ్చరించారు. అనంతపురంలో జరిగిన ఘటనలో ఎస్సీ కమిషన్ ను కూడా లేఖరాస్తామని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుజాతను ఫోన్‌లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్లరామయ్య, రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, నియోజకవర్గ ఇంచార్జి ప్రభాకర్‌ చౌదరి పరామర్శించి దళిత మహిళపై దాడిని, అక్రమంగా ఇంటిని తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు.

LEAVE A RESPONSE