Suryaa.co.in

Political News

బలిపశువు

పల్లకిని మోసే బోయిలు…
తమకు దక్కని మకరందం కోసం కష్టించే తేనేటీగలు…
నాయకుల కోసం
తమ జీవితాల్ని ఫణంగా పెట్టే రాజకీయ పార్టీ కార్యకర్తలు…
ఒక గూటి జీవులే ఏనాటికి కూడ….!

ఎందుకంటే…
పార్టీలు ఏవైనా… గద్దెనెక్కినవారు ఎవరైనా…
లబ్ధి పొందేది ఒకరు అయితే….
చివరకు నిస్తేజులుగా మిగిలిపోయేది కార్యకర్తలే…!!

అటువంటి కార్యకర్తల మనోభావాలకు అక్షర రూపాన్ని ఇచ్చే ప్రయత్నమే “బలిపశువు” కధానిక…!!

“ఈరోజు నీ కూతురు పెళ్ళి చూపులు పెట్టుకుని ఎక్కడికిరా వెళుతున్నావు”…. అంటూ వెంకట్రావు మీద రుసరుసలాడుతోంది తల్లి మావుళ్ళమ్మ….
“ఈరోజు మా పార్టీ వాళ్ళు పబ్లిక్ మీటింగ్ ను నిర్వహిస్తున్నారు….. ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలి…ఆ విషయం నీకు తెల్సిందే ..మళ్ళీ మళ్లీ ఎందుకు అడుగుతున్నావు?…”… అంటూ తల్లి మీద కేకలు వేస్తున్నాడు వెంకట్రావు…!
ఓ రాజకీయ పార్టీ పట్టణస్ధాయి విభాగానికి కార్యదర్శి గా వ్యవహారిస్తున్నాడు వెంకట్రావు… తన కుటుంబ ఆర్ధిక స్తోమత అంతంత మాత్రమే..!.. అయినప్పటికికూడ తన రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో అంతా తానై వ్యవహారిస్తుంటాడు వెంకట్రావు…
“ మరి చిన్నదాని పెళ్ళి చూపుల ఏర్పాట్లు ఎవరు చుస్తార్రా”…అంటూ ఒకింత అసహానంగానే మావుళ్ళమ్మ తన కొడుకు వెంకట్రావును నిలదిస్తోంది…..
“ పెళ్ళి చూపుల ఏర్పాట్లకి తమ్ముడు మధు ఉన్నాడు…. వాడు అన్ని చూసుకుంటాడు… ఒకవేళ ఆ ఏర్పాట్లలో లోటు జరిగితే మన ఇంటి నాలుగు గోడల మధ్య ఆ విషయం ఉండిపోతుంది… కాని పార్టీసభ ఏర్పాట్లలో లోపం జరిగితే ప్రత్యర్ధి పార్టీలకు ఆయుధాన్ని ఇచ్చినట్టే అవుతుంది.. దరిమిలా నా పార్టీ భవిష్యత్ మసక బారుతుంది.. అంతేకాదు పార్టీ నమ్ముకుని ఉన్న నాయకులు..కార్యకర్తలకు సమాజంలో విలువలేకుండా పోతుంది… కాబట్టి ఏర్పాట్లకు సంబంధించి నేను అక్కడ ఉండాల్సిందే”…అంటూ తన మోపెడ్ పై రివ్వున బయటకు వెళ్ళిపోయాడు వెంకట్రావు….!!

“ ఓరి దేవుడా వీడు ఎప్పటికి మారతాడో… తన కుటుంబం భవిష్యత్ గురించి ఏమాత్రం చింత లేదు వీడికి…!!.. రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలడం..నాయకులతో మమేకం అయ్యి తిరగడం పొద్దుస్తమాను వీడికి ఇదే పని… దీన్ని సమాజంలో ఒక హోదా అనుకుంటున్నాడు.. !.

….. నేటి రాజకీయాలు మురిపిస్తూ కష్టాల ఊబిలోకి నెట్టెస్తాయి… ఆలాంటి రోజున ఏ ఒక్క రాజకీయ నాయకుడు పలకరించిన పాపన ఉండదు.. ఒక విధంగా రాజకీయం ఓ వ్యసనమే.. ఈ వ్యసనం నుండి ఎప్పటికి వీడు బయట పడతాడో”………అంటూ తన కొడుకు వెంకట్రావు గురించి మనస్సులోనే ఓ నిట్టూర్పు విడిచింది మావుళ్ళమ్మ”…!

“ గుండెపోటుతో ఈ రోజు పరమానందం పోయాడు…మీ అందరికి తెలిసిందా” అంటూ వెంకట్రావు తన తోటి నాయకులతో అంటున్నాడు…
“పాపం పరమానందం మంచోడు… రాష్ట్ర వ్యాప్తంగా తనపార్టీ దెబ్బదిన్నప్పటికి తన పెద్దరికంతో ఇక్కడ మాత్రం గెలుచుకొచ్చాడు”….అంటూ పార్టీ కార్యాలయంలో ఉన్న ఒక్కోక్కరు ఒక విధంగా అంటున్నారు….
“రాజకీయ ప్రత్యర్ధులం అయిన మనల్నీ కూడ అప్యాయంగా పలకరించేవాడు పరమానందం… కానీ ఆయన స్ధానంలో తాము రాజకీయ సారధ్యం వహించే అవకాశం కోసం కాచుకూర్చున్నారు అతని వారసలు… వారి వ్యవహార శైలి పరమానందానికి పలుమార్లు తలవంపులు తెచ్చింది”…. …అంటున్నాడు మరోకడు..

“నేటి రాజకీయాలు ఇట్లానే చచ్చాయి…. “నడి రోడ్డు మీద హత్య గావింపబడిన ఓ ప్రజాప్రతినిధి సంఘటన మొదలు… పెద్దాయన కుటుంబాన్ని ఏకాకి చేసి అధికారం కోసం తన్నుకున్న అల్లుళ్ల ఉదంతాన్ని చూసాం.. అంతేకాదు మరో పెద్దాయన శవం ముందే రాజకీయ వారసత్వం కోసం పడినపాట్లను కూడ చూసాం…

అందుకే అనిపిస్తోంది.. “రాజకీయ కుటుంబాలలోని ఒకరి చావు సంఘటన.. ఆ కుటుంబాలలోని మరొకరి రాజకీయ జీవితానికి ఊతం ఇచ్చే విధంగా ఉండాలి” ఆ మేరకు సమాజాన్ని ప్రభావితం చేసే సంఘటలతో ముడిపడి ఉండాలి ఆ చావు”.. అని వారసులు భావింపపడే విధంగా నేటి రాజకీయాలు దిగజారిపోతున్నాయి… అందుకే నేటి రాజకీయ తరంలోని వారిలో మచ్చుకైనా నైతిక విలువలు లేకపోవడానికి కారణం”…. అంటూ ఓపాత తరం నేత ఆవేదనతో అంటున్నాడు…

“రాజకీయాలపై మరీ ఇంత నిఘ్ఠరంగా మాట్లడటం సమంజసం కాదు”… అంటూ వారితో వాదనలకు దిగాడు వెంకట్రావు…
కానీ ఈ తరహా వాదనలు… ప్రతివాదనలు రివాజే ప్రతి నిత్యం అక్కడ…!

“కవులు, కళాకారులకు చట్ట సభల యోగం”……
”సినీ ప్రముఖులకు, మీడియా అధిపతులకు విలువైన భూముల ధారదత్తం” …,…
…అంటూ దిన పత్రికలోని అంశాలను పైకి చదువుతున్నాడు వాకిట్లోని పడకకూర్చిలో కూర్చుని ఉన్న వెంకట్రావు….!
“కవులు, కళాకారులు, ప్రజాసామ్యంలో ప్రజల గొంతుకలు…. పదవి అనే గంతలతో వారిని తమ పార్టీల వాకిట్లలో కట్టేసుకుంటే ఎట్లా?….పాలక పక్షాల తప్పిదాలను ఎలిగెత్తుతూ ప్రజల్ని చైతన్యపరిచేది ఇంకెవరు”… అంటూ నెమ్మదిగా తనలో తానే గోణుక్కుంటున్నాడు వెంకట్రావు….
“పాలనలో పస తగ్గి, ప్రజల్లో తమ కీర్తి ప్రతిష్టలు మసకబారుతున్నప్పుడు తమ విధానాలకు లేనిపోని నగీషీలను ఆపాదించడానికి, ఇట్లాంటి జిమ్మిక్కులకు పాల్పడం రాజకీయ పార్టీలకు మాములే… ఇందులో వింత ఏముంది”… అంటూ చేటలోని బియ్యాన్ని కాస్త విసురుగానే విసురుతూ తన భార్య రేణుక గొణగడం గమనిస్తున్నాడు వెంకట్రావు….
“అంతే కాదండోయ్…. ప్రజల సొమ్ము రాళ్ళ పాలు అన్నట్టుగా కోట్లు సంపాదిస్తున్న ప్రముఖ క్రీడాకారులకు భారీ ఎత్తున నగదు మరియు ప్రభుత్వ పురష్కారాల ప్రధానం.. అత్యున్నత ఉద్యోగాలలో వారి నియామకం దీనికి తోడు వారిని ప్రభుత్వ పధకాల ప్రచారకర్తలుగా కూడ నియమిస్తారట..” అని కూడ ఇంకో పేజిలో కూడ ఉంది… కాస్త దాన్ని కూడ చూడండి” అంటూ తన మూతిని తిప్పుకుంటూ భర్త కేసి చురచుర చూసింది రేణుక..
ఇలాంటి పరిణామాలకు మీవంటి రాజకీయ నాయకులే కారణం అనే భావం ఆచూపుల్లో తొణికిసలాడినట్లు అని పించింది ఆ క్షణంలో వెంకట్రావుకి……!!
“కాస్త తడబడుతూనే అమ్మో ఏమో అనుకున్నాను.. ఒంటింట్లో గరిట తిప్పడమే కాదు… సమాజ పోకడలను కూడ బాగానే వడగట్టేసున్నావు… మొత్తానికి నువ్వు గడుసుదానివే”….అంటూ చిరునవ్వు నవ్వాడు తన భార్యకేసి చూస్తూ వెంకట్రావు….
“ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అయ్యినట్టు…మీతో కాపురం చేస్తున్న నాకు ఆ మాత్రం తెలివితేటలు అబ్బవా ఏమిటి”…అంటూ భర్తను గేలి చేస్తున్నట్టుగా ముసిముసి నవ్వులు నవ్వుతోంది రేణుక…!
“ మీ లోకాభి రామాయణం బాగానే ఉంది…. ఇంట్లో సరుకులు నిండుకున్నాయి… ముందు కాస్త ఆ విషయం చూడు “…..అంటూ చేతి సంచిని తన కొడుకు వెంకట్రావు చేతుల్లో పెడుతూ చిరుకోపంతో చూసింది తల్లి మావుళ్ళమ్మ….
ఆ చూపుల్లోని అర్ధాన్ని పసికట్టినట్టుగా వెంకట్రావు వెంటనే కిరణా దుకాణానికి బయలు దేరాడు.

“నేను ఓ మాట చెబుతాను…ఏమి అనుకోను అంటే”… అంటూ కిరాణా దుకాణం షావుకారు పెద్దయ్య అనడంతో తలెత్తి చూసాడు వెంకట్రావు…
“అయ్యో…అనుకునేది ఏముంది పెద్దయ్య… నువ్వు మా నాన్నగారికి సమకాలికుడివి…. అంతేకాదు మొదటి నుండి నువ్వు మా కుటుంబం శ్రేయభిలాషివి…నువ్వు ఏమి చెప్పినా మా హితం కోరేవాడివాడివే….. ఏమి చెప్పదలచుకున్నావో చెప్పు పెద్దయ్య”….అంటూ వెంకట్రావు బదులిచ్చాడు…!

“రాజకీయాలు.. సమాజం బాగు వంటి విషయాలు కాస్త పక్కన పెట్టు.. నీ కుటుంబం గురించి వారి భవిష్యత్ కు చేయాల్సింది ఏమిటో ఓ మారు ఆలోచించు”…..ఇది అంతా ఎందుకు చెబుతున్నాను అంటే… రాజకీయాలలో నావారు-నీవారు అంటూ ఏది ఉండదు… “అధికారాన్ని చేపట్టడమే పరమావధిగా ఉంటుంది ఇక్కడ…!….
అసలు ఒకరు గద్దెనెక్కడం కోసం మనం ఎందుకు సమిధులుగా మారాలి??… గద్దెనెక్కేవారికి మన అవసరం ఉందా??….లేదా వారి అవసరం మనకి ఉందా?..విచక్షణతో ఓమారు ఆలోచించు…!
మనకి కూడ కుటుంబపరమైన బాధ్యతులు కొన్ని ఉంటాయి కదా… ఆ బాధ్యతలను నెరవేర్చడానికి మనం చేయాల్సింది ఆలోచించాలి కదా!?? ఇటువంటి ఆలోచనలను చేయనంత వరకు మన అందరం వారికి బానిసలమే….! మన బానిసత్వ భావనలే వారికి బలం కూడ…!! ఏదో విధంగా తాము లేదా తమ వారసులు, సామాజిక వర్గం వారు సమాజంపై ఆధిపత్యం చలాయించాలి అనేదే వీరీ ధ్యేయం….
…ఇలాంటి వారికోసం మన జీవితాలను పణంగా పెట్టడం సమంజసమా??… కాస్త ఆలోచించు”….అంటూ “షాపుకారు పెద్దయ్య” ఏకరవు పెట్టసాగాడు…

షావుకారు పెద్దయ్య అంటున్న మాటలు చాల సూటిగానే వెంకట్రావు మనస్సును తాకాయి..!… అతని మాటల్లో వాస్తవం ఉంది…కాని ఏమి చెప్పాలో పాలుపోలేని పరిస్ధితి ఆవహించింది ఆక్షణంలో వెంకట్రావుకి..!!…
…..వెంటనే చేతిసంచిలో సరుకులను సర్ధుకుని అక్కడి నుండి బయలుదేరాడు…..!!
కాల చక్రం తనపని తాను చేసుకుపోతోంది….
కాని పెద్దయ్య మాటల్లోని సారం వెంకట్రావు మనస్సును గుచ్చుతూనే ఉన్నాయి…

కలత నిద్రతో లేచి కూర్చున్నాడు వెంకట్రావు..
ఇంత కాలం తాను తన కుటుంబం గురించి అలోచించలేదన్న కలవరపాటే దానికి కారణం…
ఆదమరచి నిద్రపోతున్న కుటుంబ సభ్యులకేసి చూసాడు ఆక్షణంలో…!

ఇంటిపనులతో అలసి గాఢ నిద్రలో ఉన్న భార్య ఒకవైపు….
నిద్రలోనే భగవత్ స్మరణతో కలవరిస్తున్న ముసలి తల్లి మరోవైపు,
బాధ్యతలు తెలియని వయస్సులో
భవిష్యత్ గురించి కలలుకంటూ ఆదమరిచి నిద్రపోతున్న పిల్లలు ఇంకోవైపు…!!
వారందరిని చూసి కడుపు తరుక్కుపోయింది వెంకట్రావుకి…
……..అప్రయత్నంగానే కనీళ్లు వచ్చాయి వెంకట్రావుకు ఆక్షణంలో…!! …

నెమ్మది నెమ్మదిగా తెల్లవారుతోంది…
కాని ఆ ఇంటి దీపం ఆరిపోయింది అప్పటికే….!

“సుబ్బారావు అందరికి తలలో నాలుకలా వ్యవహారించేవాడు”…
“మంచి పరోపకారి…కాని తన కుటుంబాన్ని నిస్సహాయులను చేసేసి తాను మాత్రం వెళ్ళిపోయాడు”… “ పాపం నిద్రలోనే కన్నుమూసేసాడు”… అంటూ వెంకట్రావు దేహం చుట్టూచేరిన వారి మాటలు… విషాద వాతవరణం నిండుకుంది అక్కడ… !

మరోపక్క “దేహంపై ఓ పుష్ప గుచ్చం… పత్రికలకు ఓ సంతాప ప్రకటనతో“ తమపని అయిందని అనిపించారు” పార్టీలోని అగ్రనాయకులు…
“నాయకుల వరకు పార్టీలో ముగిసిన ఓ కార్యకర్త అధ్యాయం ఇది…!

అందుకే ఏరాజకీయ పార్టీ చరిత్ర పుటలను తిరగేసినా…
ఇలాంటి కార్యకర్తల కుటుంబ కన్నీటి కధలు ఎన్నో…
చిరస్మరణీయమైన వారి త్యాగాలు మరెన్నో అనేది ఎవరు కాదనలేని సత్యాలు..!!

-శ్రీపాద శ్రీనివాసు

LEAVE A RESPONSE