Suryaa.co.in

Andhra Pradesh

తిరుమల మాడవీధులను మూసివేయకండి

– అది అరిష్టమంటున్న వేదపండితులు
– తిరుమలలో రోజుకొక వివాదం
– ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలంటున్న భక్తులు

తిరుమల మాడవీధుల మూసివేత అంశం కొత్త వివాదానికి తెరలేపింది. దీనివల్ల ఒక్క తిరుమలకు మాత్రమే కాకుండా, రాష్ట్రానికే అరిష్ఠమని వేదపండితులు హెచ్చరిస్తున్నారు. నిజానికి నాలుగువైపులా మాడవీధులుండటం కొప్ప వాస్తు ధర్మమని స్పష్టం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే టీటీడీ ఈఓ ధర్మారెడ్డి లుంగీ,టీషర్టుతో విధులు నిర్వహిస్తూ దర్శనమిచ్చిన విమర్శలు సర్దుమణగకముందే.. మాడవీధుల మూసివేత వ్యవహారం మరో వివాదానికి తెరలేపినట్టయింది.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ మాడవీధులను మూసి వేయవద్దని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు కోరుతున్నారు. తిరుమల ఆలయం చుట్టూ నలువైపులా మాడవీధులు ఉన్నాయి. అయితే భక్తుల దర్శనాల దృష్ట్యా ఒకవైపు మాడ వీదులను మూసి వేస్తున్నారు. ఇది అరిష్టమని వేద పండితులు కూడా పేర్కొంటున్నారు.

వాస్తవానికి నాలుగు వైపులా మాడవీధులు ఉండడం గొప్ప వాస్తు ధర్మమని వారు చెబుతున్నారు. అలాగే మాడవీధులలో నిరంతరం ఉత్సవమూర్తులు సంచరిస్తూ ఉంటారు. అలాంటి మాడవీధుల లో భక్తులు కూడా ప్రదక్షిణలు చేస్తారు. కానీ దర్శనాల పేరుతో మాడవీధులను మూసి వేయడం తగదని భక్తులు పేర్కొంటున్నారు. దీనివల్ల రాష్ట్రానికి, తిరుమలకు అరిష్టమని, ఈ నిర్ణయం తీసుకున్న వారికి కష్ట నష్టాలు తప్పవని వేద పండితులు హెచ్చరిస్తున్నారు. తిరుమలలో రోజుకొక అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆగ్రహిస్తారని భక్తులు పేర్కొంటున్నారు.

టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇటీవల లుంగీ, టీ షర్టుతో విధులు నిర్వహించడం పట్ల కూడా ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలపై దేవుడు బొమ్మలను తొలగింప చేయడం, శివాజీ బొమ్మలను చెరిపేయడం వంటి కార్యక్రమాలకు పాల్పడడం పట్ల, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా, కొంతమంది పనితీరు సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగా తాజాగా తిరుమల మాడవీధులను మూసివేయడం మరో వివాదానికి తెర తీసింది. వెంటనే టీటీడీ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టి, మాడ వీధులను యధావిధిగా ఉంచాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై పులివెందుల కు చెందిన వైకాపా నేత దంతలూరి కృష్ణ కూడా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి విజ్ఞప్తి చేశారు. టీటీడీ వ్యవహారాల్లో ఇటీవల నిర్లక్ష్యం, సంప్రదాయాలను, ఆచారాలను తుంగలో తొక్కడం రకరకాల పనికిమాలిన పనులను చేపట్టడం పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ దృష్టి సారించి, వాటికి అడ్డుకట్ట వేయించి హిందువుల మనోభావాలను కాపాడాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

LEAVE A RESPONSE