నేను న్యాయాన్ని
కడలి చుక్కలకంటే
ఎక్కువ కన్నీళ్లు చూసినోన్ని
నేను నీతిని
విశ్వమంతా వ్యాపించిన
నైతిక ఖ్యాతిని
నేను ఎదురీదే హృదయాల
అక్షర ఇంధనాన్ని
నేను ఆకలి పేనిన మోకుని
హక్కుల పొలికేకని
నేను పేదవాడి గూడుని
యుద్ధం చేసే వెలివాడని
నేను సామాజిక సమరాన్ని
సాంఘిక ప్రళయాన్ని
నేను చీకటిలో శిరమెత్తిన
వెలుగు కిరణాన్ని
నేను సిర్రెని
శివాలెత్తే సిటెకని
బ్రతుకనే చురకత్తుల చుంబనంలో
మొలకెత్తిన మాదిగ ఉద్యమాన్ని