-రూపాయి ఎందుకిలా … ఎన్నాళ్లిలా!
రూపాయి… రూపాయి… ఎక్కడికెళ్లినా ఇదేగోల. ఆర్థిక మూలాల్లో తల మునకలైన వారి సంగతి సరే సరి. మనదైనందిన వ్యవహారాల్లో రూపాయి నిత్యావసరమై ఉండటం దీనంతటికి కారణం భారత జీవన విధానంలో ప్రతిదీ రూపాయల్లో కొలవడం, ఆ రూపాన్నే మనం ఆచరించటం కద్దు. మునుపెన్నడూ లేని విధంగా డాలరుతో పోల్చితే 80లో చేరి రూపాయి విలువ సకల జనాన్నీ కలవరపరుస్తోంది. ఈ పతనం మన డబ్బులకు ఉన్న ఉనికిని, విలువను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇప్పుడెందుకిలా జరుగుతోంది? రూపాయికేమైంది? ఈ అంతులేని పతనావస్థకు కారణాలు ఏమిటి? అనేది మనందరం తెలుసుకోవాల్సిన అంశమే.
సూక్ష్మంగా పరిశీలిస్తే… రూపాయి ఎన్నో రూపాంతరాలు చెందింది. ప్రస్తుతం కేవలం నాణేల రూపంలోనే లభిస్తోంది. గతంలో కాగితాలుగా ఉండేది. కాలానుగుణంగా ఆ నోట్ల రూపం చెరిగిపోయింది. ప్రతిదీ రూపాయల్లో ప్రామాణికంగా లెక్కించడం, అదే రూపాయి విలువ దిగజారి పోవడంతో అసలు ఈ కరెన్సీ లేదా నాణేల ఉనికే గగనమౌతోంది. నిజం చెప్పాలంటే గతంలో వాడుకలో చెలామణి అయిన రూపాయి నోట్లు ఇప్పటితరం వారికి తెలుసా అంటే ఎలా ఉంటుందన్న ప్రశ్న ఉద్భవించడం సహజం. ప్రస్తుతం నాణేల్లోనే రకరకాలుగా చూస్తున్నాం. కాలం మార్పుకు అతీతంకాదన్న చందాన రూపాయి రూపాంతరం పేర్కొనదగినదే.
రూపాయి పతనం జనులందరి జీవితాల పైన ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుత రూపాయి మారకం విలువ దేశ ఆర్థిక వ్యవస్థ పైనే పెనుప్రభావం చూపుతోంది. కారణాలు ఒక్కొక్కటిగా చూస్తే… అన్ని దేశాల కరెన్సీలు డాలరుతోనే ముడివేయబడి సహజీవనం సాగించడమే. ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రదేశంలో డాలరుకేమైనా జరిగిందంటే ఆ ప్రభావం మిగతా యావత్ ప్రపంచానికి ఓ గుదిబండలా మారిపోవడం తదుపరి వంతవుతోంది. అమెరికాలోని స్టాక్ మార్కెట్లు గీచిందే గీటుగా ప్రపంచ ఆర్థిక వ్యవహారాలు నడుస్తున్నాయి. షేర్లు, స్టాక్ మార్కెట్ల పై అవగాహన ఉన్న వారికి ఈ క్రతువును చూస్తే ఇస్తే అర్థమౌతుంది. ఈ రూపాయి పతనావస్థ ఎటు దారితీస్తోందోనన్న ఆందోళనలు కోటలు దాటుతున్నాయి. ఇక సాధారణ జనానికీ ఆర్థికశాస్త్రం ఒంట బట్టేలా ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. అమెరికా కారణంగా భారత్‌తో పాటు పలుదేశాల స్టాక్ మార్కెట్లు గత ఏడెనిమిది నెలలుగా ఒడిదుడుకుల్లో ఉన్నాయి.
అన్ని దేశాలకు అన్నగా వ్యవహరించే అమెరికా దీనంతటికీ మూల మన్నదే చివరి మాటగా వినవస్తోంది. కారణం మిగతా ప్రపంచమంతా ఆ దేశ చెప్పు చేతల్లోనే ఉండటం, అక్కడ ఆర్థికం ఉచ్ఛ స్థితిలో ఉండి డబ్బుల దేశంగా పేరు తెచ్చుకోవడం మనకు ఎరుకే. అలాంటి అమెరికాలోనే అయిదు సార్లు స్టాక్ మార్కెట్లు నేలను తాకాయి. క్రూడాయిల్ ఇతర ఇంధన ధరలు మన రూపాయి విలువను మరింతగా తొక్కేశాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగి పెరిగి శతకానికి రెడీ అవుతున్నాయి. ఇందులో రూపాయి విలువ పతనం నిగూఢమైందన్నది తెలియంది కాదు.
భారత్ ఎగుమతులు ఇతోధికంగా హెచ్చితే ఈ చమురు ధరల పెంపును ఏమాత్రం లెక్కచేసే వాళ్లం కాదు. దిగుమతుల చిట్టా చాంతాడై కరుస్తోంది. ఆ స్థాయిలో మనం వెనకబడటంతో రూపాయి పతనం కళ్లారా చూస్తున్నాం. మన రూపాయి మెరుగేనని రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉవాచ. వర్థమాన దేశాల కరెన్సీతో పోలిస్తే మన రూపాయి తక్కువగా పడిందని చెబుతున్నారాయన. మన జనానికి ఎకనామిక్స్ (ఆర్థికం) తెలియదు గనక ఆయన మసిబూసి మారేడు కాయ చేసినా చెల్లుతుంది. వాస్తవానికి జనానికి కావాల్సింది రేటు తగ్గిందా? లేదా? ఇదొక్కటే చూస్తారు మిగతావన్నీ చెవికెక్కవు. కారణం సంపాదనలో, దినచర్యలో రూపాయికున్న అనుబంధం, అవసరం అలాంటిది.
భారత్‌లో ప్రస్తుత కాలంలో డాలర్ శకం నడుస్తోందనే అనుకోవచ్చు. రాను రాను ఇక్కడా డాలర్ బతుకులు కావాలని కలలు కంటున్నారు. అందుకేనేమో గతం కన్నా కేవలం అయిదేళ్లలో అమెరికా పయనాలు ఎక్కువయ్యాయి. ఎక్కడ చూసినా అమెరికాలో దేశీలు (ఇండియన్లు) దర్శనమిస్తున్నారు. అంతెందుకు వలసలను వడపోస్తే భారత్ ఆ అమెరికాలో మంచి స్థానంలో ఉంది. వీసాలు, చదువులు ఇలా ఒకటేమిటి అన్నింట్లోనూ భారత్ శకం బలపడుతోంది. ఇదంతా పరోక్షంగా ఆదేశానికి విదేశీ మారకం రూపంలో ఆదాయాన్ని సమకూర్చి పెడుతోంది. మన వారి సంపాదన ఉపాధి సంగతెలా ఉన్నా అక్కడ డాలరుకు ఏమైనా జరిగిందంటే ఇక్కడ ఆర్థికం ఢమాల్ అవుతోంది. ఇదివరకు అమెరికాలో చదువుకోవటానికి వెళ్లే విద్యార్థులు కొన్ని లక్షలో ఖర్చుపెట్టే వారు. ఒక్క ఎంబీఏ కోర్సు చదివే విద్యార్థే ఈ రోజు మంచి కాలేజీలో చదువుకోవాలంటే ఏడాదికి 10 లక్షల రూపాయలు అధికంగా మూల్యం చెల్లించుకోవాల్సి రావటం దురదృష్టకరం దీనంతటికీ కారణ భూతం రూపాయి విలువ పడిపోవడం. మనం డాలర్ల రూపంలో వారికి (అమెరికాకు) చెల్లించడమే. ఇదే ధోరణి ఇలాగే కొనసాగితే భారత విద్యార్థులు ఆ పక్కకెళ్లోద్దురో అని అనుకుంటారేమో! ఇంగ్లీషు మాట్లాడే ఇతర దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ లాంటి దేశాలకు రూటు మార్పునకు ఆలోచించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
డాలర్ విలువను బట్టే అంతర్జాతీయ మార్కెట్లలో కరెన్సీ మారకపు విలువను లెక్కిస్తారు. డాలర్ డిమాండ్ రోజు రోజుకోలా పెరుగుతోంది. కొనుగోలుదారులు పెరిగి సరఫరా ఆ మేరకు లేకపోవడంతో డాలర్ విలువ పెరుగుతోంది. ఈ కారణంగానే రూపాయి విలువ లేకుండాపోతోంది. వాస్తవానికి 1947 స్వాతంత్య్రం వచ్చేనాటికి ఒక డాలరు విలువ ఒక రూపాయికి సమానంగా ఉండేది. ఇప్పుడు 80కి చేరింది.
మనదేశ జనావసరాలకోసం ఇంధనం, వంట నూనెలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం వగైరా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం. రూపాయి విలువ పతనంతో ఈ దిగుమతుల కోసం మనం కొంత ఎక్కువ చెల్లిస్తున్నామన్నది తెలిసిందే. రూపాయి మారకం రేటును నిలకడగా ఉంచాలంటే రిజర్వు బ్యాంకు మరిన్ని విదేశీ మారక నిల్వలను అమ్మాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం ఇప్పుడే తెరపైకి వస్తుంది. ద్రవ్యోల్బణం కట్టడి చేస్తేనే ధరలు తగ్గుతాయి. ద్రవ్యోల్బణం నియంత్రించాలంటే వడ్డీ రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచాల్సి ఉంది. వడ్డీ రేట్లు పెంచితే పెట్టుబడుల క్రమం మందగిస్తుంది.
ఇటీవలి కాలంలో అమెరికా పలుదేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించింది. తన చెప్పు చేతల్లో ఏ దేశమైనా ఉండాల్సిందేననే మంకుపట్టుతో వ్యవహరిస్తోంది. ఈ ట్రేడ్‌వార్ ఎటు దారితీస్తుందోననే ఆందోళనలు సర్వత్రా ఉన్నాయి.
అమెరికాలో వడ్డీ రేట్లు గతంలో తక్కువగా ఉండటంతో మనదేశంవైపు పెట్టుబడిదారులు క్యూ కట్టారు. అయితే ఈ మధ్య అమెరికాలో వడ్డీ రేట్లు ఆశాజనకంగా ఉండటంతో అమెరికాలోని బ్యాంకుల్లోనే దాచుకోవాలను కుంటున్నారు. భారత్ స్టాక్‌మార్కెట్లు సంపాదన సమకూర్చనందున ఇక్కడ పెట్టుబడి పెట్టిన విదేశీ మదుపుదారులు తమ బాండ్లు, షేర్లను తరలించుకుపోతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 80 రూపాయలకు చేరడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 ఏళ్ళలో ఇప్పటిదాకా రూపాయి మారకం విలువ 25 శాతం క్షీణించింది. 2014లో రూపాయి మారకం విలువ 63.33గా ఉండగా 2022 జులై నాటికి 80.00 కి చేరింది. ఇంకోవైపు రష్యా, ఉక్రెఇయన్ యుద్ధ పరిణామాలు… చమురు ధరలు పెరగడం కూడా రూపాయి విలువపై ప్రభావాన్ని చూపాయి. అందుకే భారత్ నుంచి విదేశీ పెట్టుబడుదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం లేదా తగ్గించుకోవడం జరుగుతోంది. ఈ ఏడాదిలో 14 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు తరలిపోయినట్లు ఆర్థిక గణాంకాల్లో తేలుతోంది.
చమురు దిగుమతులను తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్ళలో ఉన్న ఉత్పత్తిని కూడా కొనసాగించలేని స్థితిలోకి చమురు సంస్థలను నెట్టింది. చమురు దిగుమతి బిల్లు 202021లో ఏడాదికి 62.2 బిలియన్ డాలర్లుంటే 202122కు అది 119.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2014లో మనదేశంలో ఉత్పత్తి చేసిన ముడి చమురు 35.9 మిలియన్ టన్నులు. 20202021 నాటికి 29.1 మిలియన్ టన్నులకు చేరింది. 20212022లో ఎంత వరకు చేరుతుందో చూడాల్సి ఉంది.
విదేశాల్లో చరువుకోవాలనే విద్యార్థులపై రూపాయి పతనం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏడు నెలల్లోనే సగటున ఫీజుల ఖర్చు లక్ష రూపాయలు పెరిగింది. ఏటా దేశంలో నుంచి 2 లక్షల మంది అమెరికా వెళుతున్నట్లు అంచనా. అమెరికాలో ఉంటున్న వారిలో 18శాతం భారతీయులేనని పలు నివేదికలు తెలుపుతున్నాయి. అమెరికా వెళ్ళే వారిలో అత్యధికులు విద్యారుణాలు తీసుకుంటారు. ఆకస్మికంగా ఫీజులు పెరగడంతో వారు కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. గతంలో రుణాలు తీసుకున్న వారు ఇప్పుడు ఫీజులు పెరగడంతో అక్కడ (అమెరికాలో) అదనపు ఆదాయ మార్గాలకోసం అన్వేషించడం తప్పనిసరవుతుంది. ఇక విదేశీ విద్యకోసం తక్కువ ఫీజులుండే దేశాల బాట పట్టడం తప్పదేమో!
చమురు బిల్లు తగ్గి, రూపాయి మళ్లీ పుంజుకోవడం ప్రారంభిస్తే వాణిజ్యలోటు దానంతట అదే అదుపులో కొస్తుంది. ద్రవ్యోల్బణం తగ్గి, నిత్యావసరాలు ధరలు తగ్గి జనం సంతోషిస్తారు. రూపాయి విలువ తగ్గినప్పుడు మన ఉత్పత్తులు విదేశాలకు ఆకర్షణీయ ధరల్లో లభిస్తాయి. మన దేశ ఉత్పత్తులు నాణ్యంగా ఉండాలి. ఆధునిక నైపుణ్యాలను అలవర్చుకోవాలి. అప్పుడే పరిశ్రమల స్థాపనకు ఊతం లభిస్తుంది. తద్వారా ఉపాధీ పెరుగుతుంది. ఏతావాతా ముఖ్యంగా చిన్న పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నడుంకట్టాలి. ఇదంతా జరగాలంటే మన బ్యాంకులు తక్కువ వడ్డీ ఋణాలిచ్చి సమయోచితంగా వ్యవహరించాలి. అయితే మన బ్యాంకులు ఇప్పటికే ఎగొట్టిన భారీ రుణాలతో కునారిల్లు తున్నాయి. రోజుకో కుంభకోణం, నియంత్రణలేమి, పర్యవేక్షణ లోపాలు బ్యాంకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తొలుత బ్యాంకులను ఒడ్డున పడేయాలి. అవి కష్టాల నుంచి గట్టెక్కితేనే కొత్త పరిశ్రమలకు, వ్యాపారాలకు రుణం ఇవ్వగలుగుతాయి. రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లను పెంచినందువల్ల భారత్ నుంచి పెట్టుబడులు బయకుపోవడం నెమ్మదిస్తుంది. అది రూపాయి విలువ మరీ తగ్గకుండా, నిరోధిస్తుంది.
రూపాయి పతనాన్ని ఆపేందుకు, అవసరమైతే తన వద్ద ఉన్న విదేశీ మారకపు నిల్వలో ఆరోవంతు విక్రయించాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తలపోస్తోందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుత నిల్వల్లో ఆరోవంతు అంటే దాదాపు 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 6లక్షలకోట్లు)తో సమానం. రూపాయి భారీ పతనాన్ని ఆర్బీఐ ఆపుతుందని ఆర్థికరంగ వర్గాలు ఉటంకిస్తున్నాయి.
రూపాయి విలువ తగ్గడంతో పలు ముఖ్య రంగాల్లో ఒడుదొడుకులు ఆరంభమయ్యాయి. విదేశీయాత్రలు, విహారప్రయాణాలు మరింత ప్రియమౌతున్నాయి. ఇటీవల కాలంలో విదేశీ టూర్లు చాలా మంది డైరీల్లో నమోదవుతున్నాయి. పర్యాటకరంగ లెక్కలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. రూపాయి క్షీణత నేపథ్యంలో విదేశీ ప్రయాణాల ఖర్చు తగ్గించుకుంటే మేలని విశ్లేషకులు ఉద్బోధిస్తున్నారు. దక్షిణాఫ్రికా, టర్కీ, రష్యా, సింగపూర్, మలేషియా, ధాయ్‌లాండ్, దుబాయ్, హాంకాంగ్ లాంటి దేశాలైతే లాభం ఉంటుందని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఈ దేశాల కరెన్సీతో పోలిస్తే రూపాయి విలువ స్థిరంగా ఉంది. ఇండోనేషియా, కంబోడియా, శ్రీలంక, తదితర దేశాలైతే ఇంకా మేలు. ఈ దేశాల్లో కరెన్సీ విలువ రూపాయి కంటే తక్కువ ఉంది.
విలువ తగ్గడం ద్వారా రూపాయి మారకం కనిష్ట స్థాయికి చేరడంతో పలు రంగాల్లో ప్రతికూల సంకేతాలొస్తున్నాయి. కారణమేదైనా, కారకులెవరైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకొనేలా చర్యలు తీసుకోవాలన్నది సకల జనుల వాంఛ!

9959021483.
సీనియర్ జర్నలిస్టు, ఆర్థిక, సామాజిక విశ్లేషకుడు
ramaraochennupati@rediffmail.com