-అనకాపల్లిలోని అచ్యుతాపురం సెజ్‌లో ఘటన
-50 మంది మహిళలకు అస్వస్థత
-వాంతులు, విరేచనాలతో స్పృహ తప్పిన మహిళా ఉద్యోగులు
-బాధితులను ఆసుపత్రులకు తరలించిన యాజమాన్యం
విశాఖ జిల్లాలో మంగళవారం మరోమారు విష వాయువులు లీకైన ఘటన చోటుచేసుకుంది. పారిశ్రామిక కేంద్రంగా మారిపోయిన విశాఖలో ఇప్పటికే పలుమార్లు గ్యాస్ లీకై పలువురు ప్రాణాలు కోల్పోగా పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం జిల్లాలోని అనకాపల్లి పరిధిలోని అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్ పరిశ్రమలో విష వాయువు లీకైంది.
విష వాయువును పీల్చిన బ్రాండిక్స్‌కు చెందిన మహిళా ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 50 మంది దాకా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. విష వాయువును పీల్చిన కారణంగా వీరంతా వాంతులు, విరేచనాలకు గురై స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితిని గమనించిన కంపెనీ యాజమాన్యం అస్వస్థతకు గురైన మహిళలను హుటాహుటీన ఆసుపత్రులకు తరలించింది.