-కట్టుదిట్టమైన భద్రత నడుమ తైపేలో అడుగుపెట్టిన నాన్సీ పెలోసీ
-అధ్యక్షుడు టిసై ఇంగ్-వెన్‌తో భేటీ
-తమకున్న అంకితభావం కలిగిన స్నేహితుల్లో నాన్సీ ఒకరని కీర్తించిన ఇంగ్-వెన్
-తైవాన్‌ను స్థిరీకరణ శక్తిగా చూడాలని ప్రపంచ దేశాలకు పిలుపు
-తైవాన్‌కు అండగా ఉంటామని ఎప్పుడో హామీ ఇచ్చామన్న నాన్సీ
తీవ్ర ఉద్రిక్తతల నడుమ తైవాన్‌లో అడుగుపెట్టిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆ దేశానికి తమ సంఘీభావం ప్రకటించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య తేపేలో నాన్సీ అడుగుపెట్టారు. నాన్సీ తైవాన్ పర్యటనపై గుర్రుగా ఉన్న చైనా పలు హెచ్చరికలు చేసినప్పటికీ అమెరికా బేఖాతరు చేసింది. తైవాన్‌కు తూర్పు తీరంలో నాలుగు యుద్ధ నౌకలను మోహరించి మరీ నాన్సీని తైవాన్ పంపింది. మరోవైపు, పెలోసీ తైపేలో ల్యాండ్ కాగానే చైనా కూడా ఆరు ప్రాంతాల్లో మిలటరీ డ్రిల్స్ నిర్వహించి ఉద్రిక్తతలను మరింత పెంచింది.
తైపేలో అడుగుపెట్టిన పెలోసీ తైవాన్ అధ్యక్షుడు టిసై ఇంగ్-వెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇంగ్-వెన్ మాట్లాడుతూ.. తైవాన్‌ను అమెరికా సందర్శించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తైవాన్‌కు ఉన్న అత్యంత అంకితభావం కలిగిన స్నేహితుల్లో పెలోసీ ఒకరని కీర్తించారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామన్న ఇంగ్-వెన్ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అని ప్రజాస్వామ్య దేశాలతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తైవాన్‌ను స్థిరీకరణ శక్తిగా చూడాలని ప్రపంచ దేశాలను కోరారు. శాంతి, సుస్థిరతను కొనసాగించాలన్న స్థిరచిత్తంతో ఉన్నామని పేర్కొన్నారు.
పెలోసీ మాట్లాడుతూ.. తైవాన్‌కు తాము అండగా నిలబడతామని అమెరికా ఎప్పుడో హామీ ఇచ్చిందని అన్నారు. ఈ ప్రాంతంలో పరస్పర భద్రత, ఆర్థిక శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నామన్నారు. తైవాన్ ఓ అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశమని, అది సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఆశ, ధైర్యం, సంకల్పంతో శాంతియుత, సంపన్నమైన భవిష్యత్తును నిర్మించగలమని ప్రపంచానికి అది చాటిచెప్పిందని కొనియాడారు. గతంలో కంటే తైవాన్‌కు అమెరికా సంఘీభావం ఎంతో కీలకమన్న పెలోసీ.. నేడు అందిస్తున్న సందేశం అదేనని పేర్కొన్నారు.
#WATCH | Taiwan: US House Speaker Nancy Pelosi meets President of Taiwan Tsai Ing-wen in Taipei pic.twitter.com/i7zVHUsOYx
— ANI (@ANI) August 3, 2022