Suryaa.co.in

Andhra Pradesh

ఆస్తి కోసం ఏ అన్నా, చెల్లెలు కొట్టుకు చస్తున్నది ఎవరో తెలుగు ప్రజలందరికీ తెలుసు

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ శవ రాజకీయాలు
– మనకు బాబాయి అనే ఫీలింగ్ లేదని, అందరూ మనలాగా ఉండరు కదా?
– హూ కిల్డ్ బాబాయి అన్న దానికి ప్రతిగా హూ కిల్డ్ పిన్ని
– ఎలుకలను పట్టుకుంటా… తస్మాత్ జాగ్రత్త
– తల్లినే గౌరవించని వాడు …మాతృభాషను గౌరవిస్తాడనుకోవడం తప్పే
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఆస్తి కోసం ఏ అన్నా, చెల్లె లు కొట్టుకు చస్తున్నారో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలుసునని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. రేపో, మాపో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.

మాజీ ముఖ్యమంత్రి , తెలుగువారి ఆరాధ్య దైవం, దివంగత ఎన్టీ రామారావు చిన్న కుమార్తె ఆత్మహత్యపై, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పేరిట చిలువలు, వలువలుగా రాతలు రాయడం దారుణమని మండిపడ్డారు. సర్వే నెంబర్లను సృష్టించి, అబద్ధమని తెలియగా తృణ ప్రాయమైన ఆస్తికోసం ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు తగాదాపడ్డారని పేర్కొంటూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ శవ రాజకీయాలను చేస్తున్నారన్నారు.

పార్టీ అధికారిక సోషల్ మీడియా వెబ్ సైట్ లో , చీఫ్ డిజిటల్ డైరెక్టర్ పేరిట ఈ తరహా పిచ్చి రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఢిల్లీలో రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… గతంలో 40 నుంచి 45 స్థానాలు తమ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని భావించామని, కానీ సోషల్ మీడియాలో పార్టీ వారియర్స్ చేస్తున్న వికృత చేష్టలు చూసి ఒక్క సీటు రాకపోయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. తన పిన్ని చనిపోయిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బోరున విలపిస్తుంటే, దాని పైన కూడా కామెంట్స్ చేయడం దారుణం అన్నారు.

మనకు బాబాయి అనే ఫీలింగ్ లేదని, అందరూ మనలాగా ఉండరు కదా? అంటూ ఎద్దేవా చేశారు. నడి రోడ్డులో పార్టీని సోషల్ మీడియా వారియర్స్ పెట్రోల్ పోసి తగల బెట్టారని రఘు రామ విమర్శించారు. హూ కిల్డ్ బాబాయి అన్న దానికి ప్రతిగా హూ కిల్డ్ పిన్ని అనే ప్రచారానికి తెర లేపారని మండిపడ్డారు. బాబాయ్ హత్య గావించబడ్డది నిజమని, బాబాయి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని బయటకు తెచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలను చేసింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. ఏకంగా సిబిఐ అధికారి రాంసింగ్ పైనే, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి చేత ఫిర్యాదు చేయించి కేసు పెట్టించారన్నారు. రామ్ సింగ్ తనపై పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ను స్క్వాష్ చేయమని కోరగా, కోర్టులో కేసు లిస్ట్ కాలేదని తెలిపారు. జడ్జి సెలవు పెట్టి వెళ్లారని, సీక్వెన్స్ ఈవెంట్స్ చూస్తే ఒళ్ళు జలదరిస్తుందని అన్నారు.

బాబాయ్ హత్య కేసులో 8 నెలలుగా ఎటువంటి పురోగతిని సాధించకుండా ఏమి పీకారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. దిక్కుమాలిన ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయించి, ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లను సస్పెండ్ చేయించినట్లుగా, సిబిఐ అధికారి రాంసింగ్ ను కూడా బదిలీ చేయించేందుకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రాలను చేస్తున్నారో తనకు తెలుసునని చెప్పారు. ఒకవేళ బదిలీ చేయిస్తే, తాను రైట్ ఫ్లాట్ ఫామ్ పై మూవ్ అవుతానని చెప్పారు. ఢిల్లీలో తానేమి ఖాళీగా కూర్చోలేదని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలను చెప్పాల్సిన సమయంలో చెబుతానని తెలిపారు. ఇంకా చాలా చేస్తున్నారని, గిట్టని వారిపై గతంలో కేసులు పెట్టి వేధించారని, ఇప్పుడు ఏకంగా వారి శాల్తీలను లేపే ప్రయత్నాలు చేస్తున్నారని అర్థం వచ్చే విధంగా రఘురామ సైగలు చేశారు. బాబాయి హత్య కేసులో నిందితులుగా ఉన్న కొంతమంది పేర్లను తొలగించడానికి ఆపసోపాలను పడుతున్నారని, పెద్ద పెద్ద ఆఫీసుల్లోని ఎలుకలను మేనేజ్ చేయాలని చూస్తున్నారన్న ఆయన, తాను ఎలుకలను పట్టుకుంటానని… తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఇప్పటికైనా సోషల్ మీడియాలో ఎన్టీ రామారావు చిన్న కుమార్తె గురించి చెత్త వ్యాఖ్యలు చేయడం ఆపాలని సూచించారు.

లేపి తన్నించుకోవడం అంటే ఇదే..

రాజ్యసభలో తమ పార్టీ పార్లమెంట్ నాయకుడు విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నలను చూస్తే లేపి తన్నించుకోవడం అంటే ఇదే కాబోలు అనిపిస్తుందని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట తాము చేసిన అప్పులు తప్పా?, , ఆర్.బి.ఐ అప్పులను తప్పు పట్టినట్టుగా లేఖ రాసిందా ?అంటూ ప్రశ్నించిన విజయసాయిరెడ్డి, ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట అప్పులు చేసేందుకు తాము సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ చేత అభిప్రాయాన్ని తీసుకున్నామని పేర్కొనగా… అది తప్పేనని ఆర్బిఐ లేఖ రాసినట్లు పార్లమెంటులో వెల్లడించడం జరిగిందన్నారు . పార్లమెంట్లో తప్పు చేశారని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , బ్యాంకర్లపై కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. పాతిక వేల కోట్లు మోసం చేసి రుణం పొందారన్న ఆయన, ఈ అప్పులు తప్పని తాను, రెండు ప్రముఖ దినపత్రికలు, మూడు చానల్స్ ఘోషిస్తున్నామని చెప్పుకు వచ్చారు.

మేనిఫెస్టో ను కాదని పిచ్చి చేష్టలు చేసిన సీఎంను డిస్ క్వాలిఫై చేస్తారా?

మేనిఫెస్టోకు వ్యతిరేకంగా మాట్లాడిన తనని డిస్ క్వాలిఫై చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మేని ఫెస్టోకు వ్యతిరేకంగా ఎన్నో పిచ్చి చేష్టలను చేసిన ముఖ్యమంత్రి డిస్ క్వాలిఫై అవుతారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రాజ్యాంగం లో పొందుపరిచిన ఆర్టికల్ 350 ఏ ప్రకారం మాతృభాషలో విద్యాబోధన చేయాలని తాను 2019 నవంబర్ లో లోక్ స భలో మాట్లాడడం జరిగిందని గుర్తు చేశారు.. అయితే తాను ఎన్నికల మేనిఫెస్టో కు విరుద్ధంగా మాట్లాడాలని, తనని ఎందుకు డిస్ క్వాలిఫై చేయవద్దో చెప్పాలని నోటీసు ఇవ్వడం జరిగిందని అన్నారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికి భిన్నంగా బీసీ యువతుల పెళ్లిళ్లకు గత ప్రభుత్వం 35 వేల ఆర్థిక సహాయం చేయగా, తాను 50 వేల ఆర్థిక సహాయం చేస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఆ మాట తప్పారని, ఇక ముస్లిం, క్రిస్టియన్ యువతుల పెళ్లిళ్లకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఏ ఒక్కరికి చేయలేదన్నారు.

ప్రతి ఏడాది జనవరిలో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తానని, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కటి కూడా చేయలేదని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. మాతృభాషలో ప్రాథమిక విద్యాభ్యాసం అన్నది తప్పనిసరి చేస్తూ పార్లమెంట్లో చట్టం కూడా చేశారని, ఆ చట్టం ప్రకారం… రాజ్యాంగంలోని ఆర్టికల్ 350 ఏ కు అనుగుణంగా మాతృభాషలో విద్యాబోధన జరగాలని కోరిన తనని డిస్ క్వాలిఫై చేయాలనుకున్నారని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు డిస్ క్వాలిఫై చేయవద్దు చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యని ప్రస్తావించకుండా చేశారు

పార్లమెంట్లో 377 లో భాగంగా లాటరీ లో తనకు ప్రశ్న లేవనెత్తి అవకాశం లభించిందని, అయితే తమ పార్టీ ఎంపీలు కేంద్రానికి సంబంధించిన అంశాన్ని మాత్రమే మాట్లాడాలి తప్ప, రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని మాట్లాడవద్దు అంటూ ఒత్తిడిని తీసుకువచ్చి, ప్రజా సమస్యను ప్రస్తావించకుండా చేశారని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ పై తాను ప్రశ్న వేశానని పేర్కొన్న ఆయన, తల్లినే గౌరవించని వాడు …మాతృభాషను గౌరవిస్తాడనుకోవడం తప్పేనని అన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే బోధించాలని ఎం ఓ ఎస్ అన్నపూర్ణాదేవి స్పష్టంగా పేర్కొన్నారని, దేశంలోని 28 భాషలలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాలల కోసం రోడ్డు ఎక్కారని గుర్తు చేశారు. పాఠశాలలు దూరంగా ఉండటం వల్లే దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు దగ్గర్లో ఉన్న ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారని, వీరిలో అత్యధిక శాతం ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వారేనని గుర్తు చేశారు.

LEAVE A RESPONSE