-డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారకులు ఎవరంటూ ప్రశ్నించిన ఉండవల్లి
-ఇన్నేళ్లయినా ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని నిలదీత
-ఊసరవెల్లి మాటలు ఆపేయమన్న విష్ణువర్ధన్ రెడ్డి
-అధికారంలో వున్నప్పుడు పోలవరానికి ఏం చేశావన్న విష్ణువర్ధన్
పోలవరం ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బతికి ఉండగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడో వైఎస్ఆర్ హయాంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి కారకులెవరని నిలదీశారు.
ఇటీవల వచ్చిన వరదలకు ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారకులు ఎవరు? ఎవరిని బాధ్యులను చేస్తారు? ఎవరిపై చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని కోరారు. గతంతో తాను చెప్పిందే మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారంటూ, అందుకు అభినందనలు తెలియజేశారు.
ఇక ఉండవల్లి వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘‘అయ్యా ఉండవల్లీ మీ ఊసరవెల్లి మాటలు ఆపేయండి. గతంలో 10 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా కేంద్రంలో అధికారంలో ఉండి పోలవరానికి ఏం చేశావ్? అని ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. నీ ఉనికి కోసం మాట్లాడే ఈ ఊసరవెల్లి మాటలను ప్రజలు నమ్మరు’’ అని విష్ణువర్థన్ రెడ్డి ట్వీట్ చేశారు.
అయ్యా ఉండవల్లి నీ ఊసరవెల్లి మాటలు ఆపేయండి . మీరు 10 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా కేంద్రంలో అధికారంలో ఉండి పోలవరానికి ఏం చేసావ్ అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం ? నీ ఉనికి కోసం మాట్లాడే ఈ ఊసరవెల్లి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మరు . #Polavaram #AndhraPradesh https://t.co/ZB1xOoJLLw
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) August 3, 2022