పాఠశాలలు కాదు.. కేవలం తరగతుల విలీనమేనన్న మంత్రి
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలన్నింటినీ ప్రజాభిప్రాయంతో అమలు చేయాలంటే కుదరదని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉన్నందున పాఠశాలల విలీన ప్రక్రియలో వారి అభిప్రాయం తీసుకుంటున్నామని చెప్పారు. పిల్లలు గొప్పవాళ్లు కావాలని.. ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకునే తల్లిదండ్రులు ఇంటి పక్కనే పాఠశాల ఉండాలని కోరుకోకూడదన్నారు.
రాష్ట్రంలో పాఠశాలల విలీనం జరగలేదని.. కేవలం తరగతుల విలీనం మాత్రమే జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చేపడతామే తప్ప ఇతర కారణాలు ఉండవన్నారు. విలీన ప్రక్రియకు సంబంధించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ల ఆధ్వర్యంలో నియమించిన కమిటీ నివేదిక ఇవ్వగానే దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స వెల్లడించారు.