– అనకాపల్లి మంత్రి గుడివాడ అమర్ అత్యుత్సాహం
– సీఎం ఆదేశించినా భేఖాతరు
– వందలాది కార్మికులు అస్వస్థతకు గురవుతున్నా పట్టించుకోని అమాత్యులు
– రెండ్నెళ్ల వ్యవధిలో రెండు సంఘటనలపై నోరు మెదపని యంత్రాంగం
– రసాయనాలు ఎక్కడ విడుదలవుతున్నాయో ఇప్పటికీ తెలియదట
(వీరభద్రరావు)
మంత్రి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అత్యుత్సాహం వందలాది కార్మికుల బతుకులపై పడింది . రెండు నెలల వ్యవధిలో రెండు సంఘటనలు చోటు చేసుకుంటే కారణం తెలియదంటూ చెబుతుండడం ఆయన నిర్లక్ష్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు విడుదలవుతుంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదని ఒక సారి, పక్కనున్న కంపెనీది కావచ్చని మరోసారి, ఏసీ నుంచి వచ్చాయంటూ ఇంకోసారి చెబుతుండడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం.
మే 3న సీడ్స్ దుస్తుల కంపెనీలో విషవాయువు లీకై 360మంది అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ పరిశ్రమ ను ప్రభుత్వ ఆదేశాలతో మూసేశారు.మళ్లీ ఆయా పరిశ్రమలకు అనుమతులెలా వచ్చాయో మంత్రిగారికే ఎరుక. తాజాగా మంగళవారం సాయంత్రం మళ్లీ విషవాయువు లీకై 150మందికి పైగా ఆస్పత్రిలో చేరితే కారణాలు వెదుకుతున్నామంటూ మంత్రి అమర్ కుంటిసాకులు చెబుతున్నారు.సాక్ష్యాత్తూ తన సొంత జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలపైనే నిర్లక్ష్యం వహిస్తుంటే ఇక దావోస్ వెళ్లి ఏం చెప్పొచ్చారో అంటూ స్థానికులు ఏద్దేవా చేస్తున్నారు.
సీఎం జగన్ ఆదేశించినా …
జనం ప్రాణాల మీదకు వచ్చే ఏ పరిశ్రమనైనా వెంటనే మూయించాలంటూ సాక్ష్యాత్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలోనే ఆదేశించారు.అచ్చుతాపురం సీడ్స్ కంపెనీని తక్షణమే మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్న మంత్రి గుడివాడ..గత సంఘటనపై ఎందుకు నిర్లక్ష్యం వహించారో తెలియాలి.జరిగిన సంఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారని చెబుతున్న అమర్నాథ్ సంబంధిత కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్సెక్టర్స్ అధికారులకేం ఆదేశించారో అనుమానాలున్నాయి.
ఎల్జీ పాలిమర్స్ విషయంలో జగన్ చెప్పిందే చేస్తూ అప్పట్లో నేతలు ఆ కంపెనీకి తాళం వేయించారు. కానీ అచ్యుతాపురం సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకై జనం మంచానికే పరిమితమైతే వాటిపై మంత్రి చర్యలు తీసుకోలేదు సరికదా తక్షణమే అనుమతులిచ్చేసినా నల్ల కళ్లద్దాల నుంచి కనబడనీకుండా చూసుకున్నారు.
వాస్తవానికి నిబంధనల ప్రకారం ఆ విషవాయువు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియమించిన కమిటీ నివేదికను ఇప్పటి వరకూ బయటపెట్టలేకపోవడం గమనార్హం. తాజాగా సీఎం ఆదేశించారంటూ సీడ్స్ కంపెనీని మూయించేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లిలో మీడియాకు చెప్పడం మరో వింత .
గత సంఘటనలో విషవాయువు కారణంగా వారి ఆరోగ్యం ఎలా ఉందని ఒక్కసారి కూడా మంత్రి ఆరా తీయలేకపోయారు. వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఏమీ చేయలేకపోయారు. తీరిగ్గా ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్న వారిని పరామర్శించేసి నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్లిపోవడాన్ని బాధిత కుటుంబసభ్యులు ఆక్షేపిస్తున్నారు.
అసలు గతంలో ఆ కంపెనికి అనుమతులెవరిచ్చారు, ఎలాంటి ఒత్తిళ్లు పనిచేశాయన్నది బయటపడాలి. ఐదు ఆస్పత్రుల్లో 121మంది చికిత్స పొందుతున్నారంటే బయట ఇంకెంతమంది ఉన్నారో కనీసం కనుక్కోలేదు. రెండోసారి కూడా బ్రాండిక్స్‌లో సంఘటన జరగడం దురదృష్టకరం అనేశారు. తప్పితే గత సంఘటనలో ఎవరి పరిస్థితి ఎలా ఉందో కనీసం విచారించలేదు. వారికి తిరిగి వైద్య పరీక్షలు చేయించలేదు.
చెల్లని మంత్రిగారి నోటీసులు?
గతంలోనే ఆ కంపెనీ మూసేయాలంటూ నోటీసులిచ్చామని చెబుతున్న మంత్రి..మరి ఆ నోటీసులకే దిక్కులేదని నిన్నటి సంఘటన ద్వారా తేటతేళ్ళమవుతోంది.పెస్టిసైడ్స్ ఫిమిగేషన్ వల్లే గతంలో ప్రమాదం జరిగిందని ఇప్పుడు చెబుతున్నారు. గ్లోరిఫైడ్ పొలిస్ అనే వాయువు కారణమని చెబుతున్నప్పుడు మరి ఇంత పెద్ద యంత్రాంగం ఉన్న విశాఖ అధికారులు, కమిటీని ఎందుకు అప్రమత్తం చేయలేదో చెప్పాల్సి ఉంది.
ఇది కావాలని చేసిందా.. తప్పిదం వల్ల జరిగిందా అని మంత్రి అడుగుతున్నారు.. అలాంటప్పుడు సంస్థ యాజమాన్యం నుంచి ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదు.. విచారణ ఏ దశలో ఉందో ఎందుకు బయట పెట్టలేకపోతున్నారో చెప్పాల్సి ఉంది. నమూనాల్ని ల్యాబ్‌కు పంపించగా నివేదిక ఏం చెప్పిందన్నదీ బయటపెట్టాలి. బాధితులకు తక్షణ వైద్య సదుపాయానికి ఆదేశించామని చెప్పడం చూస్తుంటే ఇప్పుడు కూడా చర్యలు తూతూమంత్రంగానే దర్యాప్తు సాగిస్తారని అర్ధమైపోతోంది.