సహజ వనరుల
సమాహారం…
పేద నోటికి దొరకని ఆహారం..
కుహానా దేశభక్తుల
బంగారు పంజరం
నా దేశం..!
ఉన్న సంపదంతా
కొందరి పరమై
ఇంకొందరి వరమై
పేదోడి నీరసం
బలిసినోడు తిప్పే మీసం..
బక్కచిక్కినోడి ఆయాసం..
నా దేశం..!
గొప్పోళ్ళ పెళ్లి విందుల్లో
వ్యర్థాహారం చెత్తకుండీలో
అడుక్కునే బక్కచిక్కిన డొక్క డొక్కు బండిలో
అన్నార్తుల..అర్ధాకలి జీవుల
ఉసురు పోసుకుంటున్న
గత కీర్తి..విగత మూర్తి
నా దేశం..!
పుణ్యనదులు ప్రవహించే
ఉత్తుంగ తరంగ..
గొంతులు ఎండిపోయే
కన్నీటి గంగ
నా దేశం..!
ఓటును కొనుక్కొని
నా గౌరవాన్ని లొంగదీసే
బ్రతుకును కృంగదీసే
విశృంఖల వధ్యశిల
నా దేశం…!
కష్టజీవి చెమటతో నిండే
విశ్వ కుబేరుల
జలకాలాటల
రుధిర కొలను
నా దేశం..!
ఏడుకొండల వాడికే
శఠగోపం పెట్టే
వెంకన్న హుండీకే
చిల్లులు పొడిచే
రాబందుల జమానా
నా దేశం.!
గుడినీ..
గుడిలో లింగాన్నీ మింగేసే
బడిని రాబడి కేంద్రంగా మార్చేసే మేధోగణ ప్రాంగణం
నాదేశం..!
బాల్యాన్ని మండబెట్టి
ఆడతనాన్ని పండబెట్టి
బతుకులను చిద్రం చేసే
ధనస్వామ్య చిరునామా
నాదేశం..!
పచ్చని పొలాలు రియల్ ఎస్టేట్లుగా మారి
కాచే చెట్లు ఎండిన మోడులై
అందరికీ అన్నం పెట్టిన రైతే
ఆకలితో అలమటించే బీడు
అన్నదాతల వల్లకాడు
నాదేశం..!
డెబ్బది ఐదు వత్సరాల
స్వతంత్ర భారత చరిత్రలో
ఏమున్నది గర్వకారణం
భరత జాతి సమస్తం
నాడు పరపీడన పరాయణం
నేడు పాలక పీడల పలాయనం
కొందరి కబంధ హస్తాల చిక్కిన
దీనాతిదీన నెలత..
నిత్య కలత..దీన చరిత
నాదేశం..!
రాముడు నడిచిన..
పురాణ ప్రదేశం..
పాదుకలేలిన ధన్యదేశం..
సీత శోకవేదిక అశోకవనమే
ఈనాడు నా దేశం మొత్తం
కన్నీటి వనమే..
నెత్తుటి వ్రణమే
వేదభూమిలో ప్రతిఒక్కరిదీ
వేదనా భూమికే..!!
ఇ.సురేష్ కుమార్
9948546286