– పలకరించుకోని జగన్-బాబు
– ఎవరి దారి వారిదే
పంద్రాగస్టును పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్‌భవన్‌లో ఎట్‌హోం పేరిట తేనేటి విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2019లో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఈ కార్యక్రమం రద్దు అయింది.
ప్రస్తుత కరోనా పరిస్ధితులు కొంతవరకు తగ్గుముఖం పట్టిన తరుణంలో- ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు, త్రివిద దళాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, వివిధ రంగాల ముఖ్యులు, అవార్డు గ్రహీతలను ఆహ్వానించారు.
ముందుగా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు,
విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబుతో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. వారికి కేటాయించిన సీట్లలో కూర్చోన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వద్దకు వచ్చి కరచాలనం చేశారు. చంద్రబాబు తన సహచరులను గవర్నర్‌కు పరిచయం చేశారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్ మిశ్రా దంపతులు గవర్నర్‌కు అభినందనలు తెలిపారు. జాతీయ గీతం ఆలపించిన తర్వాత గవర్నర్ స్వయంగా తేనేటి విందుకు హాజరైన వారి వద్దకు స్వయంగా వెళ్లి వారికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్ ఇచ్చిన తేనేటి విందులో పాల్గొన్నారు.
గవర్నర్ తేనేటి విందుకు ఈ మూడేళ్ల కాలంలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత హాజరైన సందర్భం ఇదే కావడంతో ఇరువురు ఒకరికి ఒకరు ఎదురుపడే సన్నివేశాలు వంటివి చోటుచేసుకోవచ్చని అంతా భావించారు. కానీ అలాంటివి ఏవీ లేకుండా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఎవరికి వారు తమకు నిర్దేశించిన సీట్లకు పరిమితం అయ్యారు.
తేనేటి విందు అనంతరం ఎవరికి వారు వెనుదిరిగారు. గవర్నర్ ఆహ్వానం మేరకు తాము సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని… గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియజేసి తేనేటి విందులో పాల్గొన్నట్లు తెదేపా నేతలు పేర్కొన్నారు. ఇతర రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపించినప్పటికీ ఆయా పార్టీల నేతలు ఎవరూ హాజరుకాలేదు.