ఎన్ఆర్ఐలు ప్రపంచంలో సంపద సృష్టికర్తలు కావాలి

– పబ్లిక్ పాలసీలతో లబ్ది పొందిన ఎన్ఆర్ఐలు జన్మభూమి రుణం తీర్చుకోవాలి
– స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలతో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమావేశం

అమరావతి:- ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సంపద సృష్టికర్తలు కావాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనేక దేశాల్లో భారతీయులు ఉద్యోగ, వ్యాపార,రాజకీయ రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని….వీరిలో తెలుగు వారి పాత్ర మరింత ఎక్కువగా ఉందని చంద్రబాబు అన్నారు. నాడు ప్రభుత్వాలు తెచ్చిన పబ్లిక్ పాలసీల ద్వారా లబ్దిపొంది విదేశాల్లో మంచి స్థాయిలో ఉన్న ఎన్ ఆర్ ఐలు జన్మభూమి రుణం తీర్చుకునేందుకు కృష్టి చేయాలని చంద్రబాబు సూచించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 60కిపైగా దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలతో చంద్రబాబు జూమ్ ద్వారా సమావేశం అయ్యారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం వేళ వారితో ముచ్చడించడం పై సంతోషం వ్యక్తం చేశారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందునుంచి భారత దేశ ప్రస్థానం, తరువాత ఆయా ప్రభుత్వాలు తెచ్చిన సంస్కరణలు, వాటి ద్వారా జరిగిన లబ్ది వంటి అంశాలపై వారితో మాట్లాడారు.

ప్రపంచలో ఇప్పుడు తెలుగు వారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే స్థాయి వెళ్లారని కొనియాడారు. తమ ఆలోచనలతో, అనుభవాలతో తెలుగు ప్రజలు మరింత ఉన్నత స్థితికి వెళ్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇదే సమయంలో దేశంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, సొంత గ్రామాల, ప్రాంతాల అభివృద్దికి కృషి చెయ్యాలని వారిని కోరారు. గతంలో తెలుగు దేశం ప్రభుత్వం పిలుపు నిస్తే జన్మభూమిలో ఎన్ఆర్ఐలు ఎలా భాగస్వాములు అయ్యారు…ఎలాంటి ఫలితాలు వచ్చాయి అనే అంశాలను చంద్రబాబు వారికి గుర్తు చేశారు.

తెలుగు దేశం పార్టీకి, ఎన్ఆర్ఐలకు వారధిగా ఉండేందుకు టిడిపి ఎన్ఆర్ఐ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విభాగం ద్వారా స్కిల్ డవలప్మెంట్ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చి ఆసక్తి ఉన్న యువతను విదేశాలకు పంపేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలిపారు. ఎన్ ఆర్ ఐలకు అవసరం అయిన సాయం చేసేందుకు, పలు అంశాల్లో సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కూడా ఎన్ ఆర్ ఐ విభాగం పనిచేస్తుందని చంద్రబాబు అన్నారు.

గత మూడేళ్ల పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయింది అనేది తాము అక్కడ ఉండి చూస్తున్నామని పలువురు ఎన్నారై ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెప్పారు. రాష్ట్రం కోసం తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నామని వారు చెప్పారు. తెలుగు దేశం పార్టీ అనుబంధ విభాగమైన ఎన్ఆర్ఐ టిడిపిని మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా వారిని కోరారు.

Leave a Reply