Suryaa.co.in

Andhra Pradesh

స్వాతంత్ర్య దినోత్సవం రోజున జగన్ రెడ్డి మాట్లాడిందంతా అబద్ధాలు,అసత్యాలే

– టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున జగన్ రెడ్డి మాట్లాడిందంతా అబద్ధాలు, అసత్యాలేనని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న మీ విశ్వనీయత నేడు ఏమైంది? ఆజాదీ కా అమృత్ మహోత్సవం రోజున జగన్ రెడ్డి ప్రసంగం అబద్ధాలు, అసత్యాలతో సాగింది. ఏం చెప్పినా ప్రజలు నమ్మకపోతారా? అంటూ అబద్ధాలు వల్లె వేశారు.

గత మూడేళ్లలో జగన్ రెడ్డి ఏం చేశారో ప్రజలకు చెప్పాలి. భవిష్యత్ లో ఏం చేస్తారనేది కూడా కావాలి. జగన్ రెడ్డి మూడేళ్లలో తాను చేసింది ఏమీ లేక, భవిష్యత్ లో ఏం చేయాలో తెలియక ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులను ఏదో ఉద్ధరించినట్లుగా జగన్ రెడ్డి మాట్లాడారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం గుర్తుంచుకోవాలి. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, శేఖర్ రెడ్డి అనుయాయులు ఏడాదికి రూ.5వేల కోట్ల చొప్పున ఇసుకలో దోచుకున్న విషయం వాస్తవం కాదా? భవన నిర్మాణ కార్మికులు, పేదల కోసం 8 లక్షల టిడ్కో ఇళ్లను చంద్రబాబు నిర్మిస్తే.. మూడేళ్ల మూడు నెలల పాలనలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో జగన్ రెడ్డి నిర్లక్ష్యం వహించారు.

జగన్ రెడ్డి మేనిఫెస్టోలో ఏడాదికి 5 లక్షల ఇళ్ల చొప్పున 15 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. కేవలం 5 ఇళ్లు నిర్మించారని కేంద్రమే చెప్పింది. పెన్షన్లలోనూ అబద్ధాలే వల్లె వేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ ను రూ.2వేలకు పెంచించి చంద్రబాబు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. రూ.3వేలకు పెంచుతామని చెప్పి మాట తప్పారు. ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి ఫైల్ లోనే చేస్తామని చెప్పి మాట తప్పారు. విశ్వసనీయత లేకపోతే గడ్డి పెట్టాలని మాట్లాడే జగన్ రెడ్డి.. ఇప్పుడు గడ్డి ఎవరికి పెట్టాలి?

పెన్షన్ల తొలగింపు, మంజూరులో కూడా అనేక తిరకాసులు పెట్టారు. పాఠశాలల్లో నాడు-నేడు అని మాట్లాడుతున్నారు. 30 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేయకుండా ఎగ్గొట్టేందుకు పదివేల ప్రాథమిక పాఠశాలలను మూసేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు. విధ్య విషయంలో చంద్రబాబు గారు అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. మరోవైపు దశలవారీ మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ రెడ్డి.. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. 2025 వరకు బార్లకు అనుమతివ్వడం జగన్ రెడ్డి విశ్వసనీయతా, గడ్డి ఎవరికి పెట్టాలి?

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలు జగన్ రెడ్డి పాలనను వ్యతిరేకిస్తూ రోడ్లు ఎక్కుతున్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు అందేవే వీరికీ అందుతున్నాయి. వీరికి ప్రత్యేకంగా అందించే కార్పోరేషన్లను నిర్వీర్యం చేశారు. విదేశీ విద్యను పేదలకు దూరం చేశారు. బెస్ట్ అవైలబుల్స్ స్కూల్స్ ను దూరం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను అటకెక్కించారు. ఆ వర్గాలే నిన్ను ఊసడించుకుంటున్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ లో కోతలు పెట్టారు. వైద్యం విషయంలోనూ జగన్ రెడ్డి అబద్ధాలు చెప్పారు. ఆరోగ్యశ్రీని చంద్రబాబు కొనసాగించి, మెరుగుపర్చారు. మెరుగైన వైద్యం అందించారు. చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలను ఆదుకున్నారు. నేడు అది రద్దు చేశారు.

ఆడ బిడ్డల తాళిబొట్లను 15 సంవత్సరాలకు తాకట్టుపెట్టిన నీకు వారి గురించి మాట్లాడే అర్హత ఉందా. మద్యపాన నిషేధం అంటూ మద్యంపై వచ్చే ఆదాయాన్ని 15 ఏళ్లకు తాకట్టుపెట్టి రూ.25వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు. ఏకంగా మద్యం కార్పోరేషన్ పెట్టారు. అమ్మఒడి, చేయూత, పెన్షన్ ను మద్యం ఆదాయంతో చేస్తున్నారు. నాన్న తాగితేనే అమ్మఒడి వస్తుంది, కొడుకు తాగితేనే తల్లికి పెన్షన్ వస్తుంది. జగన్ రెడ్డి తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. 16 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామంటున్నారు. రెండేళ్ల క్రితమే ప్రారంభిస్తున్నట్లుగా చెప్పి.. డమ్మీ బటన్ నొక్కారు. ఇవి ఎక్కడా నిర్మాణం కావడం లేదు. మభ్య చేసి, మాయ పెట్టే విధంగా జగన్ ప్రసంగం ఉంది.

వికేంద్రీకరణ అంతా బూటకం. తలను మూడు ముక్కలు చేస్తే వికేంద్రీకరణా? కాదు.. అది విధ్వంసం. స్థానిక సంస్థలు బలోపేతం చేస్తే అది వికేంద్రీకరణ. పంచాయతీలకు నిధులు వస్తే.. రూ.15 వేల కోట్లు దారిమళ్లించారు. మున్సిపాలిటీలకు సంబంధించి రూ.5వేల కోట్లు దారిమళ్లించి నిర్వీర్యం చేస్తున్నారు. నదుల అనుసంధానం చేస్తే అది వికేంద్రీకరణ. తన పాలనపై ప్రజల అసహనాన్ని దారిమళ్లించేందుకు జగన్ రెడ్డి ప్రయత్నించారు. పవిత్ర దినోత్సవం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతిపక్షాలపై విమర్శలకు వేదిక చేసుకోవడాన్ని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రంగా ఖండించారు.

LEAVE A RESPONSE