Suryaa.co.in

Telangana

కాళేశ్వరం ఏమైనా నిషేధిత ప్రాంతమా?

-బాహుబలి మోటార్లు ఎందుకు మునిగాయి?
-ఎంత నష్టం వచ్చింది?
-అక్కడ కాళేశ్వరం ఉందా? మాయమైందా?
-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
-రాస్తారోకో లో సొమ్మసిల్లిన సిఎల్పీ నేత భట్టి

భూపాలపల్లి జిల్లా: సీఎల్పీ బృందం కాళేశ్వరం వెళ్లకుండా అడ్డుకోవడానికి కారణమేంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే, అక్కడ కాళేశ్వరం ఉందా మాయమైందా? సీఎల్పీ బృందం అక్కడ చూడకూడనివి ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడానికి, విదేశాల నుంచి తీసుకొచ్చిన బాహుబలి మోటర్లు వరద ముంపులో మునిగిపోయాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మునిగిన బాహుబలి పంపులు తిరిగి పని చేస్తాయా లేదా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా? కాలేశ్వరం బాహుబలి మోటార్లు ఎందుకు మునిగాయి. ఎంత నష్టం వచ్చింది? అక్కడ జరుగుతున్న నిర్మాణ లోపాలు ఏంటి? తెలుసుకోవడానికి వెళుతున్న సీఎల్పీ బృందాన్ని పోలీసులతో ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుంది.

కాళేశ్వరం ఏమైనా నిషేధిత ప్రాంతమా? శత్రు దేశాలకు తెలియని సమాచారం అక్కడ పెట్టి దానిని ఏమైనా రహస్య ప్రాంతంగా ప్రకటించారా? ప్రాజెక్టుకు వెళ్లకుండా పోలీసులతో ఎందుకు అడ్డుకుంటున్నారు. పది రోజుల ముందు అధికారులకు సమాచారం ఇచ్చి, మంగళ బుధవారాల్లో ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన తమ సీఎల్పీ బృందాన్ని, ప్రివెంట్ కస్టడీ పేరిట అరెస్టులు చేయడం ఖండిస్తున్నాను.

కాళేశ్వరంలో 144 సెక్షన్ విధించడానికి కారణం ఏంటి? కాళేశ్వరం ఏమైనా కల్లోలిత ప్రాంతమా? రహస్య ప్రాంతమా? ఎందుకు ఈ నిర్బంధం? ఎందుకు 144 సెక్షన్ విధించారు? కాళేశ్వరం వెళ్లకుండా ప్రభుత్వం పోలీసులతో ఈరోజు అడ్డుకోవచ్చు కానీ ఖచ్చితంగా సీఎల్పీ బృందం కాళేశ్వరానికి వెళుతుంది. అక్కడ ఉన్న రహస్యాలు ఏంటో తెలుసుకొని బట్టబయలు చేస్తుంది. మంథని నియోజకవర్గం పరిధిలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు శ్రీధర్ బాబుని సైతం, నియోజకవర్గంలో తిరగకుండా ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను
ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE